మంత్రాలయంలో భక్తుల సందడి
ABN , Publish Date - Nov 09 , 2024 | 11:33 PM
ప్రముఖ పుణ్య క్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో సందడిగా మారింది.
మంత్రాలయం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్య క్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో సందడిగా మారింది. రెండో శని, ఆదివారం సెలవు దినాలు కావటంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నదితీరం, ఆర్‌టీసీ బస్‌స్టాండ్ ప్రాంతం భక్తులతో కోలాహలంగా మారింది. భక్తులు వివిధ రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని, కార్తీక దీపాలను భక్తిశ్రద్ధలతో వెలిగించి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులు పొందారు.
రాఘవేంద్రుడి సన్నిధిలో కన్నడ నటుడు
మంత్రాలయం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామిని కన్నడ సినీ నటుడు దాలి ధనుంజయ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు మఠం జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీర్వదించారు. ధనుంజయతో అభిమానులు ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆయన వెంట మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ వెంకటేష్ జోషి, అనంత పురాణిక్, వ్యాసరాజ్ ఆచార్, సూపరింటెండెంట్ జేపీ స్వామి, జయతీర్థఆచార్, బిందు మాధవ్, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్ ఆచార్ ఉన్నారు.