ఒడిశాకు తుఫాన్ ముప్పు!
ABN , Publish Date - May 22 , 2024 | 04:20 AM
నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో బుధవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
నేడు అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా..
25న రాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశం
23 నుంచి రాష్ట్రంలో పెరగనున్న ఎండలు
30 కల్లా కేరళలోకి నైరుతి రుతుపవనాలు?
విశాఖపట్నం, అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో బుధవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత అది ఈశాన్యంగా పయనించి ఈనెల 24వ తేదీకల్లా వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని, ఆ తర్వాత మరింత బలపడి ఈశాన్యంగా పయనిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌గా మారి ఈ నెల 25వ తేదీ రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అయితే, తుఫాన్‌గా మారి ఉత్తర ఒడిశా తీరం దిశగా పయనిస్తుందని మరో నిపుణుడు తెలిపారు. ఆ ప్రభావంతో ఈనెల 24వ తేదీ నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో వర్షాలు పెరుగుతాయన్నారు. 23వ తేదీ నుంచి మధ్య బంగాళాఖాతం పరిసరాలు అల్లకల్లోలంగా మారుతున్నందున మత్స్యకారులు అటు వైపు వెళ్లరాదని హెచ్చరించారు. ఇప్పటికే దక్షిణ అండమాన్ పరిసరాలను తాకిన నైరుతి రుతుపవనాలు తుఫాన్ ప్రభావంతో అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలో మరిన్ని భాగాలకు విస్తరించనున్నాయి. నెలాఖరు నాటికి రుతుపవనాలు కేరళ లోకి ప్రవేశించేలా తుఫాన్ దోహదం చేస్తుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. నెలాఖరులోగా కేరళకు ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో ఈనెల 30వ తేదీ నాటికే కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని వెల్లడించారు.
ద్రోణి ప్రభావంతో వర్షాలు..
ఉత్తర కోస్తాలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా నార్పలలో 26.5, చిత్తూరులో 22.5, జీడీ నెల్లూరులో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేకచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. కర్నూలులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడనున్న నేపథ్యంలో ఈనెల 23వ తేదీ తర్వాత ఎండలు పెరిగి వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు.
మరో నాలుగు రోజులు వర్షాలు
రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బుధవారం విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.