Share News

బంగాళాఖాతంలో వాయుగుండం

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:42 AM

బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తాజా బులెటిన్‌ ప్రకారం ఇది శుక్రవారం రాత్రి చెన్నైకి 370 కి.మీ.

బంగాళాఖాతంలో వాయుగుండం

తీరంలో 60 కి.మీ. వేగంతో గాలులు

కోస్తాలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు సూచిక

నేడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తాజా బులెటిన్‌ ప్రకారం ఇది శుక్రవారం రాత్రి చెన్నైకి 370 కి.మీ. తూర్పు ఈశాన్యంగా, విశాఖపట్నానికి 450 కి.మీ. దక్షిణంగా.. పశ్చిమ మఽధ్య, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం శనివారం సాయంత్రం వరకు ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. ఇది ఒడిశా తీరం వైపు పయనించే క్రమంలో బలహీనపడుతుందా? లేదా? అనేది ఇంకా వెల్లడించలేదు. అయితే, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీలు నమోదవడంతోపాటు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో సముద్రంలోనే వాయుగుండం బలహీనపడుతుందని వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు. దీని ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ అనేక ప్రాంతాల్లో వర్షాలు, కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ముసురు వాతావరణం కొనసాగడంతో చలిగాలులు వీస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి, పత్తి, పొగాకు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నందున ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం పేర్కొంది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. శనివారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో మరీముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా, రానున్న 24 గంటల్లో వాయుగుండం ఉత్తర ఈశాన్యం దిశగా కదులుతూ తీవ్రతను కొనసాగిస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Updated Date - Dec 21 , 2024 | 04:42 AM