Share News

Atp Dumping yard : డంపు.. అవినీతి కంపు!

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:21 PM

ఇది డంపులో జరిగిన అవినీతి కంపు కథ. వైసీపీ అధికారంలో ఉండగా, అప్పటి ఆ పార్టీ ప్రజాప్రతినిధుల బినామీ సంస్థల అడ్డగోలు బాగోతం. ఆ పార్టీ వారే నిలదీసినా, కడిగేసినా పట్టించుకోకుండా దోపిడీ చేసిన వైనం. లక్షలాది మంది నగర ప్రజలకు సమస్యగా మారిన డంపింగ్‌ యార్డును కూడా అక్రమ సంపాదనకు వాడుకున్నారు. పాత చెత్తను పూర్తిగా తరలించాల్సింది పోయి.. పాత చెత్తను, కొత్త చెత్తను ఒకే చోట పోసి రూ.కోట్లు కొల్లగొట్టారు. కొందరు ఆడిట్‌ అధికారులు రైట్‌ రైట్‌ అంటూ బిల్లుల చెల్లింపునకు గ్రీనసిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటికే రూ.9 కోట్ల పేమెంట్‌ జగినట్లు సమాచారం. మరో రూ.2 కోట్లను సైతం నొక్కేయాలని చూశారు. కానీ కొందరు ఆడిట్‌ అధికారులు చెక్‌ పెట్టడంతో ఆగినట్లు సమాచారం. ...

Atp Dumping yard : డంపు.. అవినీతి కంపు!
Dumping yard

బయోమైనింగ్‌ పేరిట భారీ స్కాం..

పాత చెత్తలో కొత్త చెత్త కలిపి.. మాయ

రోజువారీ బయోమైనింగ్‌పై కాకి లెక్కలు

అడ్డగోలుగా.. రూ.9 కోట్ల బిల్లుల చెల్లింపు

చెత్త శుద్ధికి రూ.26.59 కోట్లకు టెండర్‌ ఆహ్వానం

రూ.22.92 కోట్లకే దక్కించుకున్న నోవుస్‌ గ్రీన ఎనర్జీ

వైసీపీ హయాంలో ఆడిట్‌లో భారీ అక్రమాలు..?

తాజాగా పసిగట్టిన కొత్త ఆడిట్‌ అధికారులు..?

రూ.2 కోట్ల బిల్లుల ఫైల్‌ తిరస్కరణ

ఇది డంపులో జరిగిన అవినీతి కంపు కథ. వైసీపీ అధికారంలో ఉండగా, అప్పటి ఆ పార్టీ ప్రజాప్రతినిధుల బినామీ సంస్థల అడ్డగోలు బాగోతం. ఆ పార్టీ వారే నిలదీసినా, కడిగేసినా పట్టించుకోకుండా దోపిడీ చేసిన వైనం. లక్షలాది మంది నగర ప్రజలకు సమస్యగా మారిన డంపింగ్‌ యార్డును కూడా అక్రమ సంపాదనకు వాడుకున్నారు. పాత చెత్తను పూర్తిగా తరలించాల్సింది పోయి.. పాత చెత్తను, కొత్త చెత్తను ఒకే చోట పోసి రూ.కోట్లు కొల్లగొట్టారు. కొందరు ఆడిట్‌ అధికారులు రైట్‌ రైట్‌ అంటూ బిల్లుల చెల్లింపునకు గ్రీనసిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటికే రూ.9 కోట్ల పేమెంట్‌ జగినట్లు సమాచారం. మరో రూ.2 కోట్లను సైతం నొక్కేయాలని చూశారు. కానీ కొందరు ఆడిట్‌ అధికారులు చెక్‌ పెట్టడంతో ఆగినట్లు సమాచారం.

- అనంతపురం విద్య

ఇదీ ఒప్పందం..

అనంతడంపింగ్‌ యార్డ్‌లో చెత్త నుంచి సందప తయారీ-వ్యర్థ భూమి పునరుద్ధరణ (సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ - లెగసీ వేస్ట్‌ ల్యాండ్‌ రిక్లమేషన) పనులకు వైసీపీ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టారు. యార్డులో ఉన్న 3.32 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయో మైనింగ్‌ చేసేందుకు 2022లో సిద్ధమయ్యారు. ఒక మెట్రిక్‌ టన్ను చెత్తను శుద్ధి చేసేందుకు రూ.800 చెల్లించేలా.. రూ.26,59,88,000 పనులకు టెండర్లు పిలిచారు. కానీ ఒక మెట్రిక్‌ టన్నును రూ.689.54 ఇస్తే చాలు.. శుద్ధి చేస్తామని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సంస్థ ముందుకొచ్చి.. టెండర్‌ను దక్కించుకుంది. లెస్‌కు కోట్‌ చేసి రూ.22.92 కోట్లకు ‘నోవుస్‌ గ్రీన ఎనర్జీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌’ సంస్థ టెండరును సొంతం చేసుకుంది. టెండర్‌ అగ్రిమెంట్‌ నాటికి (2022 జనవరి) డంపింగ్‌ యార్డులో 3.32 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త ఉంది. ఆ చెత్తను శుద్ధి చేసి తరలించడానికి ముందు.. కొత్తగా డంపింగ్‌ యార్డును ఎంపిక చేయాల్సి ఉన్నింది. ఒక వైపు పాత డంపింగ్‌ యార్డులో చెత్తను బయో మైనింగ్‌ చేయాలి. మరో వైపు నగరంలోని నిత్యం పుట్టుకొట్టే చెత్తను కొత్తగా ఎంపిక చేసిన డంపింగ్‌ యార్డులో వేయాలి. అగ్రిమెంట్‌ మేరకు రోజుకు 1000 మెట్రిక్‌ టన్నుల చెత్తను శుద్ధి చేసి తరలించాలి. నిత్యం ఎంత చెత్తను శుద్ధి చేసి తరలిస్తున్నారో డంపింగ్‌ యార్డులో వేబ్రిడ్జి మీద తూకం వేసి, రసీదులు తీసుకోవాలి. ఏడాది కాలంలో మొత్తం పని పూర్తి చేయాలి.

ఇవీ.. అక్రమాలు

కొత్తగా ఉత్పత్తయ్యే చెత్తను వేసేందుకు కొత్త యార్డును ఎంపిక చేయలేదు. అదే యార్డులో వేస్తూ.. బయో మైనింగ్‌ మొదలు పెట్టారు. అరకొరగా చెత్తను శుద్ధి చేయడం, కొత్తగా వచ్చే చెత్తను పాత డంపింగ్‌ యార్డులోనే వేయడం చేస్తూ వచ్చారు. కొత్త చెత్తను, పాత చెత్తను కలగాపులగం చేస్తే.. పాత చెత్త బయో మైనింగ్‌ ఎంత పరిమాణంలో జరిగిందో ఎవరూ కనిపెట్టలేరని ఎత్తుగడ వేశారు. మసిపూసి మారేడు కాయ చేశారు. ‘బయో మైనింగ్‌ ఎన్ని టన్నులు చేశారు..? ఇంకా ఎందుకు చెత్త అలాగే ఉంది..?’ అని ఎవరైనా అడిగితే.. ‘అంతా చేశాం. ఇక్కడున్నదంతా కొత్త చెత్తే..’ అని చెప్పేలా వ్యూహాత్మకంగా స్కాం చేశారు. రోజువారీ బయో మైనింగ్‌ లెక్కలను తెలిపే వే బ్రిడ్జి రసీదుల విషయంలోనూ మాయ చేసినట్లు సమాచారం.

ఆడిట్‌లో గేట్లు ఎత్తేశారు..

డంపింగ్‌ యార్డులో వెయ్యి మెట్రిక్‌ టన్నుల చెత్తను శుద్ధి చేయాల్సి ఉంది. ఆ మేరకు తూకాలు వేసిన రసీదులు జారీ కావాలి. కానీ ఒక్కో రోజు రెండు వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను కూడా శుద్ధి చేసినట్లు రికార్డు చేశారని సమాచారం. వేబ్రిడ్జి స్లిప్పుల విషయంలో వైసీపీ పాలకులు, అధికారులు కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలను గుర్తించి, అడ్డుకట్ట వేయాల్సిన నగరపాలికలోని కొందరు ఆడిట్‌ పరిశీలకులు.. గేట్లు ఎత్తినట్లు సమాచారం. మొదట సుమారు రూ.1.8 కోట్ల బిల్లులు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత మరో రెండు బిల్లులు కలిపి ఏకంగా రూ.6 కోట్లకు పైగా చేసినట్లు తెలిసింది. సహాయ ఆడిట్‌ పరిశీలకులు ఒకరు, ఆడిట్‌ పరిశీలకులు ఒకరు సుమారు రూ.9 కోట్ల బిల్లులకు గ్రీన సిగ్నల్‌ ఇవ్వడం వల్లే చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. నిత్యం ఎన్ని టన్నుల వేబిల్స్‌ స్లిప్పులు తీశారు..? క్షేత్రస్థాయిలో ఎంత బయో మైనింగ్‌ చేశారు..? ఎంత రికార్డు చేశారు..? డంపింగ్‌ యార్డులో ఎంత చెత్త ఉంది..? తదితర వివరాలను పరిశీలించకుండానే కమీషన్ల కోసం ఆడిట్‌ పరిశీలకులు అడ్డగోలుగా బిల్లుల చెల్లింపునకు రెకమెండ్‌ చేశారని, దీంతో చెల్లింపులు సాఫీగా సాగిపోయాయని అంత్యత విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో ఆడిట్‌ పరిశీలకులకు లక్షలాది రూపాయలు చేరినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రూ.2 కోట్ల బిల్లులు రిజెక్ట్‌..?

డంపిగ్‌ యార్డులో కంపు వ్యవహారం కొత్తగా వచ్చిన ఆడిట్‌ పరిశీలకుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. బయో మైనింగ్‌లో రూ.కోట్లు కొల్లగొడుతున్న వ్యవహారాలు, బయో మైనింగ్‌ అక్రమాలు చూసి... వారు అవాక్కయ్యారని తెలిసింది. అందుకే సుమారు రూ.2 కోట్ల బిల్లులను తిరస్కరించారని విశ్వసనీయంగా తెలిసింది. అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు, కొందరు ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల అడ్డగోలు బయో మైనింగ్‌ వ్యవహారాలు భారీగానే సాగినట్లు సమాచారం. వేబ్రిడ్జి రసీదులకు, టెండర్‌లో ఉన్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో రికార్డు చేసిన వివరాలకు చాలా వ్యత్యాసాలు ఉన్నా.. రూ.9 కోట్ల చెల్లింపులు జరగడం చూసి.. వారు విస్మయం చెందినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పేమెంట్‌ కోసం వాళ్ల ముందుకు వచ్చిన రూ.2 కోట్ల బిల్లులను రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే అప్పట్లో అడ్డగోలుగా రూ.9 కోట్ల చెల్లింపులు చేయించిన ఆడిట్‌ పరిశీలకుల్లో ఓ మహిళా అధికారి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లు రూ.కోట్లు ఊడ్చేశారని ఆడిట్‌ అధికార వర్గాలద్వారా తెలిసింది.


అనంత డంపింగ్‌ కథ ఇదీ..

అనంతపురం నగరపాలక సంస్థ అతి పెద్ద సమస్యల్లో డంపింగ్‌ యార్డ్‌ ఒకటి. దశాబ్దాల నుంచి గుత్తి రోడ్డులోని డంపింగ్‌ యార్డు మాత్రమే దిక్కు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరంలో 2.63 లక్షల జనాభా ఉంది. ఇప్పుడు మూడింతలు దాటిందని అంచనా. 2021 నాటికే నగరంలో ప్రతి రోజు 125 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఆ తరువాత కూడా జనాభా పెరిగింది.. ఇళ్లు పెరిగాయి. అదే స్థాయిలో చెత్త కూడా పెరిగింది. కానీ డంపింగ్‌ యార్డ్‌ మాత్రం అంతే ఉంది. కేవలం 12.65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీంతో వందల టన్నుల చెత్త పేరుకుపోయి.. డంపింగ్‌ యార్డు కొండను తలపిస్తోంది. సుమారు 25 ఏళ్ల నుంచి నగరంలోని చెత్తను అక్కడే డంప్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకూ అక్కడ 3,32,485 మెట్రిక్‌ టన్నుల చెత్త పోగైనట్లు అధికారులు తేల్చారు. ఈ చెత్తలోనూ అక్రమ సంపాదనకు దిగారు అప్పటి అధికార పార్టీ నాయకులు, కొందరు అధికారులు. బయో మైనింగ్‌, చెత్త శుభ్రత, తరలింపు పేరిట రూ.కోట్లు కొల్లగొట్టారు.

కార్పొరేటర్లు నిలదీసినా..

డంపింగ్‌ యార్డులో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీకే చెందిన కొందరు కార్పొరేటర్లు గతంలోనే ఆరోపించారు. వైసీపీ హయాంలో ఓ డీఈ వ్యవహార శైలిపై, రూ.6 కోట్లకు పైగా చెల్లింపులపై ఆ పార్టీ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు గళం విప్పారు. డంపింగ్‌ యార్డు పనుల్లో అడుగడుగునా అవినీతి తాండవించింది అనేందుకు ఆ పార్టీవారి నిలదీతలే నిదర్శనం. టీడీపీ కూటమి ప్రభుత్వం విచారిస్తే.. రూ.కోట్ల కుంభకోణం వెలుగులోకి రావడం ఖాయం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 08 , 2024 | 11:23 PM