గోదావరి దోబూచులు
ABN , Publish Date - Jul 26 , 2024 | 04:10 AM
గోదావరి వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గురువారం ఉదయం 9 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం ఆరు గంటలకు నీటిమట్టం 13.40 అడుగులు ఉంది. బ్యారేజీ గుండా 12,30,242
తగ్గుతూ..పెరుగుతూ ఉన్న వరద ప్రవాహం
ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
భద్రాచలం వద్ద మళ్లీ రెండో హెచ్చరిక జారీ
ఆగస్టు వరకు ఇంతే అంటున్న అధికారులు
సముద్రంలోకి 12 లక్షల క్యూసెక్కులు
రాజమహేంద్రవరం/పోలవరం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గోదావరి వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గురువారం ఉదయం 9 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం ఆరు గంటలకు నీటిమట్టం 13.40 అడుగులు ఉంది. బ్యారేజీ గుండా 12,30,242 క్యూసెక్కుల నీరు సముద్రంలో పోతోంది. అయి తే భద్రాచలం వద్ద ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గురువారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 48.60 అడుగులకు చేరింది. మహారాష్ట్ర, తెలంగాణల్లో అక్కడక్కడ వర్షాలు పడుతుండడంతో గోదావరి వరద పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులు మాత్రం ఆగస్టు వరకూ ఇలాగే వరద తగ్గుతూ, పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో పునరావాస శిబిరాలు కొనసాగిస్తున్నారు. వరద దోబూచులాట వల్ల ఏజెన్సీలోని విలీన మండలాల ప్రజలు, గోదావరి లంకల ప్రజలు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రకాలవ పొంగడం వల్ల గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రకాలువ సమస్య శాశ్వత పరిష్కారానికి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.
పట్టిసీమ నుంచి నీటి విడుదల
గురువారం సాయంత్రం పోలవరంలో గోదావరి నీటిమట్టం 22.987 మీటర్లు ఉంది. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 10,95,616 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి ఎనిమిది పంపుల ద్వారా 2,832 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేస్తున్నారు.