Share News

Pawan Kalyan : నా కుమార్తె కన్నీళ్లు చూసే.. అలా మాట్లాడానమ్మా

ABN , Publish Date - Nov 08 , 2024 | 05:43 AM

నా కుమార్తె కన్నీళ్లు చూసే అలా మాట్లాడానమ్మా’.....‘నేను కూడా ఫేక్‌ న్యూస్‌ బాధితురాలినే సర్‌..’ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మధ్య ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం జరిగిన చర్చ ఇది.

Pawan Kalyan : నా కుమార్తె కన్నీళ్లు చూసే.. అలా మాట్లాడానమ్మా

నేనూ ఫేక్‌ న్యూస్‌ బాధితురాలినే సర్‌..

డిప్యూటీ సీఎం, హోంమంత్రి మాటామంతీ

మీకూ, మా ఇళ్లలో ఆడవాళ్లకే రక్షణ లేకపోతే

ఇక సమాజానికి మనమేం భరోసా ఇస్తాం?

ప్రమాదకరమైన సోషల్‌ సైకోలను ఉపేక్షిస్తే

సమాజాన్ని నాశనం చేస్తారు: పవన్‌ ఆందోళన

నాపైనా దారుణమైన ట్రోలింగ్స్‌ చేశారు సర్‌..

ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఊరుకోం

హిందూపురం, కడప, చీరాల, తిరుపతి.. ఎక్కడ ఘటన జరిగినా గంటల్లో అరెస్టు: అనిత

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘నా కుమార్తె కన్నీళ్లు చూసే అలా మాట్లాడానమ్మా’.....‘నేను కూడా ఫేక్‌ న్యూస్‌ బాధితురాలినే సర్‌..’ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మధ్య ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం జరిగిన చర్చ ఇది. రాష్ట్రంలో చెలరేగిపోతున్న సోషల్‌ మీడియా సైకోలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, హోంశాఖ మంత్రి అనిత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తోపాటు వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత పోస్టులు సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. వారి ఆగడాలు భరించలేని పవన్‌ కల్యాణ్‌....ఇటీవల పిఠాపురం పర్యటనలో పదునైన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి కఠినంగా వ్యవహరించక పోతే తానే హోంశాఖ తీసుకుని ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్‌ తరహా చర్యలకు ఉపక్రమిస్తానని అనడంతో జాతీయ స్థాయిలో పవన్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో నెల రోజుల్లో పోలీసు శాఖను బలోపేతం చేస్తానని, తప్పు చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని చంద్రబాబు అన్నారు. అన్నట్టుగానే సోషల్‌ మీడియా సైకోల భరతం పట్టేందుకు ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రితో విడి విడిగా సమావేశమయ్యారు. అంతకుముందు.. పవన్‌ కల్యాణ్‌, అనిత కొద్దిసేపు విడిగా చర్చించుకున్నారు. తొలుత.. పవన్‌కల్యాణ్‌ను చూడగానే అనిత నమస్కరించి పలకరించారు. పవన్‌ ఆప్యాయంగా స్పందిస్తూ..‘‘నా కుమార్తె కన్నీళ్లు చూసే అలా మాట్లాడానమ్మా.. వాళ్లు ఇంట్లో నుంచి బయటికి రావడానికే ఇబ్బంది పడుతున్నారు..’’ అని తెలిపారు.

gk.jpg

దీనిపై స్పందించిన అనిత... ‘‘నేను కూడా ఫేక్‌ న్యూస్‌ బాధితురాలినే సర్‌. నాపై దారుణమైన ట్రోలింగ్స్‌ చేశారు’’ అని వాపోయారు. ‘‘రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి. మీకు..మా ఇళ్లలో అడవాళ్లకే రక్షణ లేకపోతే ఇక సమాజానికి మనం ఏమి భరోసా ఇస్తాం?’’ అని పవన్‌ అన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తేలేదనీ, హిందూపురం, కడప, చీరాల, తిరుపతి...ఎక్కడ జరిగినా గంటల్లోనే నిందితుల్ని అరెస్టు చేసినట్లు అనిత వివరించారు. అంతకన్నా ప్రమాదకరమైన సోషల్‌ సైకోలను ఉపేక్షిస్తే మొత్తం సమాజమే నాశనం అయ్యే ప్రమాదం ఉందని పవన్‌ పేర్కొన్నారు. దీనిపై అనిత స్పందిస్తూ.. ‘‘మీరు చెప్పిన దాంతో విభేదించను సర్‌.. సీఎం గారికి అన్నీ చెబుదాం. మనం ఏది మాట్లాడినా వివాదం చేస్తున్నారు’’ అంటూ పవన్‌ పిఠాపురం వ్యాఖ్యల్ని పరోక్షంగా గుర్తు చేశారు. కూటమి కలిసి ఉండకూడదనుకుని వారు ఏవేవో చేస్తుంటారని పవన్‌ వ్యాఖ్యానించారు. ‘‘కూటమి కలిసే ఉంటుంది.. వీళ్ల తాట తీస్తుందని మనం నిరూపిద్దాం’’ అంటూ పవన్‌ నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో వారు వేర్వేరుగా సమావేశమై.. రాష్ట్రంలో శాంతి భద్రతలు, సోషల్‌ మీడియాలో పెరిగిపోతున్న అరాచక పోస్టులపై చర్యల గురించి చర్చించారు.


అరెస్టులు చేయక.. ముద్దులు పెట్టాలా?: దీపక్‌రెడ్డి

మహిళల శీల హననం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటే చర్యలు తీసుకోక... ముద్దులు పెట్టాలా? అని సీడాప్‌ చైర్మన్‌ జీ దీపక్‌రెడ్డి మండిపడ్డారు. ‘జగన్‌ పాలనలో మహిళలపై అత్యాచారాలు, అరాచకాలకు అడ్డూ అదుపూ లేదు. కన్న తల్లి, చెల్లిపై కూడా రోత రాతలు రాయించిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి. వర్రా రవీంద్రారెడ్డి లాంటి పిచ్చి మూకల్ని పెట్టుకుని, పచ్చి బూతులతో సోషల్‌ మీడియాలో సైకో చేష్టలకు పాల్పడ్డారు. వైసీపీ నేతలకు దమ్ముంటే.. 11వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలి’ అని దీపక్‌రెడ్డి సవాల్‌ చేశారు.

Updated Date - Nov 08 , 2024 | 05:44 AM