Pawan Kalyan: ఏలేరు వరదపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
ABN , Publish Date - Sep 08 , 2024 | 07:40 PM
ఏలేరు వరదపై అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షించారు. ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలు ఆలత అధికారులతో ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. జిల్లాలో పరిస్థితులు, సహాయక చర్యలపై పవన్ కల్యాణ్‌కు జిల్లా కలెక్టర్ వివరించారు. కాగా పవన్ సోమవారం కాకినాడ వెళ్లనున్నారు. నియోజకవర్గంలో ఉండి అధికారులతో సమీక్షలు చేయనున్నారు.
అమరావతి: ఏలేరు వరదపై అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షించారు. ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలు ఆలత అధికారులతో ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. జిల్లాలో పరిస్థితులు, సహాయక చర్యలపై పవన్ కల్యాణ్‌కు జిల్లా కలెక్టర్ వివరించారు. కాగా పవన్ సోమవారం కాకినాడ వెళ్లనున్నారు. నియోజకవర్గంలో ఉండి అధికారులతో సమీక్షలు చేయనున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరు రిజర్వాయర్‌కి ఇప్పటికే 21 టీఎంసీల నీరు చేరింది. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. భారీ వర్షాలు ఉన్న క్రమంలో ఉప్పాడ ప్రాంతంలోని ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఠాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండ్రవాడ ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం ఉండే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు పవన్ వెల్లడించారు.
బుడమేరుకు కనీవిని ఎరుగని వరద: మంత్రి కొల్లు రవీంద్ర
బుడమేరుకు కనీవిని ఎరుగని రీతిలో వరద వచ్చిందని, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను అతలాకుతలం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు ఆయన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ 7 రోజులుగా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల ఆక్రమణలు, మట్టి దోపిడీతో బలపరచాల్సిన బుడమేరు గట్లను బలహీనపరిచారు. విపత్తుల వేళ ప్రజల వద్దకు వచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి.. రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. వరద ప్రభావంలో నష్టపోయిన అందరిని పూర్తి స్థాయిలో ఆదుకుంటాం. ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వరద ప్రభావిత ప్రాంతాలను సాధారణ స్థితికి తేవడానికి 7 రోజులుగా సీఎం విజయవాడలోనే ఉన్నారు. కూటమి నేతల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించడం అభినందనీయం’’ అని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. నందివాడ మండలంలో ప్రతి ఊరు ముంపు బారిన పడి నష్టపోయిందని అన్నారు. 6 రోజులుగా ముంపులోనే ఇల్లు, పొలాలు ఉన్నాయని ప్రస్తావించారు. 12 వేల మందికిపైగా పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ‘‘ఇంకెన్ని రోజులు ఈ వరద కష్టాల్లో ఉంటాయో అర్థం కావడం లేదు. మండలంలో వరద నష్టాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం’’ అని అన్నారు. ఇక ఎంపీ వల్లభనేని బాలసౌరి మాట్లాడుతూ.. ఎప్పుడులేని దారుణమైన పరిస్థితులను నేడు చూస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. ‘‘భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు రాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారు. కేంద్ర, నాబార్డు నిధులతో బుడమేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. పంట, ఆస్తి నష్టం జరిగిన ప్రతి ఒక్కరికీ మెరుగైన నష్టపరిహారం అందిస్తాం’’ అని ఎంపీ భరోసా ఇచ్చారు.