Share News

అందరికీ రక్షిత మంచినీరు

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:58 AM

ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు గట్టిగా కృషి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

అందరికీ రక్షిత మంచినీరు

శాసనసభలో ఉపముఖ్యమంత్రి పవన్‌

అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు గట్టిగా కృషి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రక్షిత మంచినీరు ప్రజల ప్రాథమిక హక్కు అని, వారికి సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. రాష్ట్రంలో రక్షిత నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్లు పూర్తిగా పాడైపోయాయని బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వారు అడిగిన ప్రశ్నలకు మంత్రి పవన్‌ కల్యాణ్‌ సమాధానమిచ్చారు. ఆ ప్లాంట్ల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులు కూడా ఉన్నాయని తెలిపారు. ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేసి 24 గంటలూ ప్రజలకు తాగునీరు ఇవ్వాలని ప్రధాని కోరుకుంటున్నారని, తాను కూడా అదే గట్టి సంకల్పంతో ఉన్నానన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను సకాలంలో పూర్తి చేసి ఏపీని దేశానికే రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతానని పవన్‌ పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రతి మండల హెడ్‌క్వార్టర్‌లో జన ఔషధి కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్‌ చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా... గోదావరి పుష్కరాల కోసం ఈసారి ముందుగానే పనులు చేపడతామని మంత్రి నిమ్మల తెలిపారు. సంవర్థకశాఖలో ఐస్‌ లైన్డ్‌ రిఫ్రిజిరేటర్ల కొనుగోలులో అక్రమాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ.. వాటి కొనుగోలు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగిందని చెప్పారు.

Updated Date - Nov 21 , 2024 | 04:58 AM