Share News

ఎడారి జీవితం!

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:22 AM

ఏదో చేద్దామనుకుని వెళ్లి... ఇంకేదో చేస్తూ... ఎలా బయటపడాలో తెలియని దైన్యంలో కొట్టుమిట్టాడే జీవితాలు! సక్రమమైన విధానంలో,

ఎడారి జీవితం!

ఏజెంట్ల మోసాలు.. నకిలీ వీసాలు

చుట్టూ పచ్చటి చేలు, నదులూ, నీళ్లు, చక్కటి ఇల్లు, చల్లని కాపురం! ఇవన్నీ వదిలేసి.. ‘మంచి బతుకు’ కోసం గల్ఫ్‌ దేశాలకు వెళతాడు! ఎడారి పాలవుతాడు! బతుకు దుర్భరమవుతుంది. ఇది.. ‘ఆడుజీవితం’ చిత్రం! నిజానికి... ఇది అనేక మంది యథార్థ జీవిత కథ! పచ్చటి కోనసీమ నుంచి ఎడారి దేశాలకు వెళ్లి బాగా సంపాదించి స్థిరపడిన వారున్నారు! నానా ఇక్కట్లు పడుతూ.. ‘కాపాడండి’ అని వేడుకుంటున్న వారూ ఉన్నారు.

ఒకప్పుడు గల్ఫ్‌లో కూలి పనికి వెళ్లినా లక్షలు సంపాదించవచ్చన్న భరోసా ఉండేది!. ఇప్పుడు నకిలీ వీసాలు ఏజెంట్ల మోసాలతో గల్ఫ్‌ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అసలు ఉపాధి మాట దేవుడెరుగు.. వెళ్లినవారు మళ్లీ స్వదేశానికి తిరిగొస్తారోలేదోనన్న దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి. తాజాగా.. ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లి ఏజెంట్‌ మోసం.. యజమాని కర్కశంతో..

ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న అంబాజీపేట మండలం, ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్ర అనే యువకుడు.. మంత్రి లోకేశ్‌ చొరవతో బతుకుజీవుడా అంటూ తిరిగి స్వదేశంలోకి అడుగుపెట్టాడు. అంతకుముందు అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తీ ఎడారిలో సెల్ఫీ వీడియోతో తన కష్టాలు చెప్పుకోవడంతో.. అతనినీ స్వదేశానికి రప్పించారు. ఇలా రోజుకో బాధితుడి కథ తెరపైకి వస్తోంది.

ప్రాణాలు దక్కితే చాలనే ఆశ

పాస్‌పోర్టు లాక్కుంటారు.. జీతాలివ్వరు

చెప్పే పని ఒకటి.. చేయించేది మరొకటి

యజమాని దయాదాక్షిణ్యాలపైనే జీవితం

ఎడారి విధుల్లో గొంతు తడవడమూ కష్టమే

సక్రమమైన విధానంలో వెళ్లడమే మేలు

నకిలీ ఏజెంట్ల మోసాలకు బలి కావొద్దు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఏదో చేద్దామనుకుని వెళ్లి... ఇంకేదో చేస్తూ... ఎలా బయటపడాలో తెలియని దైన్యంలో కొట్టుమిట్టాడే జీవితాలు! సక్రమమైన విధానంలో, సరైన ఉద్యోగంలో చేరితే అంతా మేలే! ఏజెంట్ల మోసాల వలలో పడితే మాత్రం కష్టాలు చుట్టుముడతాయి. గల్ఫ్‌ వెళ్లాలనుకునే వారి అమాయకత్వాన్ని, బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్నారు. కంపెనీల్లో ఉద్యోగాల పేరిట వీసాలు సృష్టించి గల్ఫ్‌ పంపిన తర్వాత అక్కడ పనులు లేక చాలామంది ఎడారుల్లో గొర్రెలు, ఒంటెలు కాపరులుగా ఒంటరిగా మగ్గిపోతున్నారు. ఉండటానికి నీడలేక ఎడారుల్లో వేసే గుడారాల్లో ఏళ్ల తరబడి జీవనం సాగిస్తూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చీకటి బతుకులు వెళ్లదీస్తున్నారు. తినడానికి తిండిలేక గొర్రెలకు పెట్టే ఆహారాన్ని తింటూ పొట్ట గడుపుకునే వారందరో ఉన్నారు. ఎడారి నుంచి పారిపోయే అవకాశం లేక అలాగే మగ్గిపోతున్నారు. గల్ఫ్‌ ఏజెంట్లు కోనసీమ జిల్లాలో ఊరికొకరి వంతున పుట్టుకొచ్చారు. అమాయక గ్రామీణ ప్రాంత మహిళలకు గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పట్ల ఆసక్తి కల్పించి వారిని అక్కడికి పంపించి మురికి కూపంలోకి నెట్టుతున్నారు. ఇటువంటి సంఘటనలపై కోనసీమ జిల్లాల్లో ముఖ్యంగా రాజోలు దీవిలో పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరికొందరిని ఉపాధి పేరుతో డబ్బులు తీసుకుని మోసాలు చేసే బోగస్‌ ఏజెంట్లు పైనా కేసులు ఉన్నాయి.

పాస్‌పోర్టు లాగేసుకుని...

ఇళ్లల్లో పనిచేసేందుకు వెళ్లే కార్మికుల వెతలు అన్నీఇన్నీకావు. గల్ఫ్‌లో యజమానులను కపిల్‌ అని పిలుస్తుంటారు. వీసాపై వెళ్లిన వెంటనే కపిల్‌ అక్కామా(యజవాని అనుమతి ముద్ర) వేస్తేనే ఆ దేశంలో ఉండేందుకు వీలవుతుంది. కొంతమంది యజమానులు మానవతా దృక్పథంతో కార్మికులను బాగానే చూస్తుంటారు. మరికొంతమంది మాత్రం నరకయాతన పెడుతుంటారు. పాస్‌పోర్టు తీసేసుకుంటారు. దాంతో గత్యంతరం లేక కష్టమైనా, నష్టమైనా అక్కడే పనిచేయాల్సి వస్తోంది. తిండి సరిగా పెట్టక, జీతాలు ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడనీయరు. పాస్‌పోర్టు కపిల్‌ వద్ద ఉండిపోవడంతో అలాగే కాలం గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండటంతో కుటుంబ సభ్యులతో సమాచారం తెగిపోతుంది. యజమానుల చిత్రహింసలు భరించలేక చాలామంది పారిపోతూ బయటకు వచ్చేస్తుంటారు. అయితే వారి వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో అక్కడి పోలీసులు వెంటనే అరెస్టు చేసి జైల్లో పెడతారు.


మరణాలు ఎక్కువే..

గల్ఫ్‌ దేశాల్లో ఇటీవల కాలంలో భారతీయుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. కొంతమంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, మరి కొంతమంది హత్యలకు కూడా గురవుతారు. చాలామంది అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. వీరిలో కొన్ని మృతదేహాలు స్వగ్రామం చేరుతుండగా, పాస్‌పోర్టు లేని మృతదేహాలు అనాథ శవాలుగా అక్కడే ఉండిపోవడం కడు దయనీయం.

ఇలా చేస్తే మేలు!

గుర్తింపు లేని ఏజెంట్లు చాలామంది ఉన్నారు. వీసా, టికెట్టు, విమానం ఎక్కించేందుకు వీరంతా మొత్తం ఖర్చులు మాట్లాడుకుని వారిని విదేశాలకు పంపిస్తుంటారు. హైదరాబాద్‌, చెన్నై విమానాశ్రయాల ద్వారా ఏజెంట్లు గల్ఫ్‌ పంపిస్తుంటారు. ఒక్కోసారి టికెట్లు ఒత్తిడి అయినా పుషింగ్‌ ద్వారా పంపిస్తుంటారు. ఇలా ఏజెంట్ల చేతుల్లో చాలా మంది మోసపోతున్నారు. కొన్నింటికి కేసులు నమోదవుతున్నా, ఎన్నో కేసులు బయటకు చెప్పకోలేక అలాగే ఉండిపోతున్నాయి. గుర్తింపుగల ఏజెంట్లను ఆశ్రయించమని పోలీసులు ప్రకటిస్తున్నా జనం పట్టించుకోవడం లేదు. ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, గుర్తింపు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీసా వచ్చిన వెంటనే అది అసలుదో... నకిలీయో ఇట్టే తెలుసుకోవచ్చు వీసాను స్థానిక పోలీస్‌సేష్టన్‌కు తీసుకెళ్లి చూపించాలి. తద్వారా అధికారులు ఎంబసీతో సంప్రదింపులు జరిపి దాని వివరాలు తెలుపుతారు. అరబిక్‌, ఇంగ్లీషు భాషలో ఉంటుంది కాబట్టి పూర్తి సమాచారం అందిస్తారు. వీసా వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ పూర్తి సమాచారం తెలుసుకోవాలి.

కళ్లు పోయినా పట్టించుకోలేదు

దుబాయ్‌లో తొమ్మిదేళ్లపాటు పనిచేశా. ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో కెమికల్‌ కళ్లల్లో పడింది. రెండు కళ్లూ కనిపించకుండా పోయాయి. కంపెనీ ఎటువంటి సమాధానం చెప్పలేదు. చెకప్‌ కోసం సొంత డబ్బులతో వైద్యం చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల స్వస్థలానికి వచ్చేశాను. గల్ఫ్‌లో కొన్నాళ్ల పాటు కష్టపడితే నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటుందని వెళ్తే ఇప్పుడు ఇంటికొచ్చిన తరువాత ఎటువంటి ఉపాధి పనులకూ వెళ్లలేని నిస్సహాయ పరిస్థితిలో పడిపోయాను.

-గనిశెట్టి రామాంజనేయులు, అంతర్వేది

లోకేశ్‌కు రుణపడి ఉంటాం

బతుకుదెరువు కోసం గల్ఫ్‌ వెళ్లిన నేను ఏజెంట్‌ మోసంతో సౌదీ అరేబియా ఏడారిలో నరకయాతన అనుభవించా. అధిక ఉష్ణోగ్రతతో రక్తపు వాంతులై ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నా పరిస్థితిపై సోషల్‌ మీడియాలో వీడియో పెట్టడంతో మంత్రి నారా లోకేశ్‌ ఎంతో సహృదయంతో స్పందించారు. అక్కడున్న ఎన్నారై, టీడీపీ ప్రతినిధుల ద్వారా క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చారు. నేను, నా కుటుంబ సభ్యులు కూటమి ప్రభుత్వానికి, మంత్రి నారా లోకేశ్‌కు రుణపడి ఉంటాం.

-సరెళ్ల వీరేంద్రకుమార్‌, గల్ఫ్‌ బాధితుడు,

ఇసుకపూడి గ్రామం, అంబాజీపేట మండలం

మినీ గల్‌ రాజోలు దీవి..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచి వేల సంఖ్యలో గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళుతుంటారు. మినీ గల్ఫ్‌గా పేరొందిన రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాల నుంచి గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య అధికం. గత కొన్ని సంవత్సరాల క్రితం అరబిక్‌ దేశాల్లో ద్రవ్యోల్బణం రేటు అధికంగా ఉండటంతో అక్కడికి వెళ్లిన వారిలో చాలామంది ఆర్థికంగా స్థితిమంతులు కావడం నిజం! కష్టాలు అనుభవిస్తున్న వారు ఉండటమూ అంతే నిజం!

Updated Date - Jul 29 , 2024 | 03:22 AM