ఎస్పీకు సవాలుగా దేవరగట్టు ఉత్సవాలు
ABN , Publish Date - Oct 03 , 2024 | 11:54 PM
దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల నిర్వహణకు పోలీసు, అధికార యంత్రాంగం చర్యలు ఆరంభించారు. కొత్త ఎస్పీ బిందు మాధవ్‌కు ఈ ఉత్సవాలు సవాలుగా మారాయి.
కర్రల నియంత్రణలో పోలీసు యంత్రాంగం
హింసను తగ్గించేందుకు అవగాహన సదస్సులు
ఆలూరు, అక్టోబరు 3 : దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల నిర్వహణకు పోలీసు, అధికార యంత్రాంగం చర్యలు ఆరంభించారు. కొత్త ఎస్పీ బిందు మాధవ్‌కు ఈ ఉత్సవాలు సవాలుగా మారాయి. ఉత్సవాల్లో హింసను నివారించేందుకు ముందస్తుగా పోలీసులను అప్రమత్తం చేశారు. గ్రామాల్లో జల్లెడ పడుతూ కర్రలు స్వాధీనం చేసుకుంటున్నారు. గతంలో జరిగిన ఆల్లరులు.. ఘర్షణలకు పరిగణలోకి తీసుకొని ఉత్సవాలను ప్రశాంతంగా జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో జరిగిన హింసాత్మక సంఘటనలు పునారవృతం కాకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. నాటుసార నియంత్రణకు దాడులు నిర్వహించి బెల్లపు ఊటలను ధ్వంసం చేస్తున్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు.. ఆలూరు సీఐ శ్రీనివాస నాయక్, ఆలూరు, హొళగుంద ఎస్సైలు వెంకట నరసింహులు, బాల నరసింహులు సిబ్బంది విసృతంగా పర్యటిస్తూ ప్రజలకు ఉత్సవాలలో హింసను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.