Share News

Devuni Kadapa : దేవుని కడప... ప్రజల అభిమతం

ABN , Publish Date - Oct 09 , 2024 | 12:14 AM

‘జిల్లాకు ‘కడప’ లేదా ‘దేవుని కడప’ అన్న పేరు మాత్రమే ఉండాలనేది ప్రజల అభిమతం. అయినప్పటికీ వైఎస్‌ఆర్‌ పేరు తొలగించమని నేను ఎక్కడా కోరలేదు’ అని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. జిల్లా పేరు మార్పు వివాదంపై మంగళవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Devuni Kadapa : దేవుని కడప... ప్రజల అభిమతం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి

వైఎస్‌ఆర్‌ పేరు తొలగించమని నేను కోరలేదు

తిరుమలేశునికన్నా ‘వ్యక్తి’ గొప్ప కాదు

దీనిపై బహిరంగ చర్చకు జగన్‌ సిద్ధమా?: మంత్రి సత్యకుమార్‌

సత్యకుమార్‌ మాటలు హేయం: రవీంద్రనాథ్‌రెడ్డి

న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి) / కడప (ఎడ్యుకేషన్‌), అక్టోబరు 8: ‘జిల్లాకు ‘కడప’ లేదా ‘దేవుని కడప’ అన్న పేరు మాత్రమే ఉండాలనేది ప్రజల అభిమతం. అయినప్పటికీ వైఎస్‌ఆర్‌ పేరు తొలగించమని నేను ఎక్కడా కోరలేదు’ అని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. జిల్లా పేరు మార్పు వివాదంపై మంగళవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘వైసీపీ ప్రభుత్వం హిందూ దేవుళ్ల, దేవాలయాల పవిత్రతను అడుగడుగునా తగ్గించే ప్రయత్నం చేసింది. కడప జిల్లా పేరు మార్చి కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కన్నా ‘వ్యక్తి’ గొప్ప అని చూపే ప్రయత్నం చేసింది. ప్రజల మనో భావాలను దెబ్బతీసింది. కడప పేరు చేర్చి తప్పు సరిదిద్దా లని కోరినందుకు అంజాద్‌ బాషా లాంటి మతోన్మాదులతో వైఎస్‌ జగన్‌ నాపై విమర్శలు చేయిస్తున్నారు. దేవుడు గొప్పా? వ్యక్తి గొప్పా..! అన్న విషయంపై ప్రజల మధ్య బహిరంగ చర్చకు నేను సిద్ధం. మరి వైసీపీ నేత జగన్‌ సిద్ధమా..?’ అని మంత్రి సత్యకుమార్‌ సవాల్‌ చేశారు.


పేరు మార్పు ప్రతిపాదనను సీఎం పక్కన పెట్టాలి

‘వైఎస్సార్‌ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని పక్క జిల్లాకు చెందిన మంత్రి సత్యకుమార్‌ మాట్లాడడం హేయమైన చర్య. ఇటువంటి ప్రతిపాదనను సీఎం చంద్రబాబు పక్కన పెట్టాలి. పేరు మారిస్తే వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదు’ అని అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాఽథ్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కడప నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్‌ మరణం తరువాత కడప జిల్లాకు వైఎస్సార్‌ జిల్లాగా కేబినెట్‌ ఆమోదంతో నామకరణం చేశాం. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించలేదు. ఇప్పుడు మళ్లీ కడప జిల్లాగా పేరు మార్చాలని మంత్రి మాట్లాడడం దుర్మార్గం. మారుస్తామంటే వైఎస్సార్‌ అభిమానులు, ప్రజలు ఊరుకోరు’ అని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. మీడియా సమావేశంలో కార్పొరేటర్లు పాకా సురేశ్‌, బాలస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 12:14 AM