Share News

పోలవరం ప్రాజెక్టు వద్ద డీవాటరింగ్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:20 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని ఐదు నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీరింగ్‌ అధికారులు అడుగులు వేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద డీవాటరింగ్‌

కాఫర్‌ డ్యాంల మధ్య ఉన్న వరద నీటిని

45 మోటార్లతో తోడేస్తున్న అధికారులు

డయాఫ్రం వాల్‌ నిర్మాణం దిశగా చర్యలు

యంత్రాలు, వాహనాల రాకపోకలకు అంతర్గత రహదారి పూర్తి

పోలవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని ఐదు నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీరింగ్‌ అధికారులు అడుగులు వేస్తున్నారు. సీపేజీ జలాలకు తోడు ఇటీవలి వర్షాలు, వరదలకు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నడుమ పెద్దఎత్తున నీరు చేరడంతో పెద్దసంఖ్యలో మోటార్లను పెట్టి నీటిని తోడేసే పని ముమ్మరంగా సాగుతోంది. నవంబరు నుంచి మార్చి నెలాఖరు వరకూ రూ.1,183 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నడుమ యంత్రాలు, వాహనాల రాకపోకలు సాగించేందుకు అంతర్గత రహదారి నిర్మాణం పూర్తి చేశారు. ప్రధాన డ్యాం ఇరువైపులా కొండలను కొంతమేర తొలిచి అక్కడి నుంచి వాల్‌ నిర్మించేందుకు మట్టి పనులను, నిర్మాణాల కొలతలను ముమ్మరం చేశారు. వాల్‌ డిజైన్‌ ఖరారు కావలసి ఉంది. కాఫర్‌ డ్యాంల నడుమ సీపేజీ జలాల నీటిమట్టం 16 మీటర్లకు చేరిందని.. 80హెచ్‌పీ సామర్థ్యం ఉన్న 45 మోటార్ల ద్వారా కాఫర్‌ డ్యాంల నడుమ నీటిని నెలరోజులుగా డీవాటరింగ్‌ చేస్తున్నామని, కొంతమేర జలాలు స్లూయిజ్‌ ద్వారా దిగువకు ప్రవహిస్తున్నాయని ఈఈ సుధాకర్‌ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఆ ప్రభావంతో ఎగువ కాఫర్‌ డ్యాం నుంచి సీపేజీ ఎగదన్నడం తీవ్రమైంది. కాఫర్‌ డ్యాంలకు ఇరువైపులా కొండలపై కురిసిన వర్షపు నీరు కాఫర్‌ డ్యాంల నడుమకు చేరడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ సీజన్‌లో డయాఫ్రంవాల్‌ నిర్మాణ పనులు వేగవంతానికి వర్షం అడ్డంకిగా మారింది.

Updated Date - Oct 22 , 2024 | 03:21 AM