రఘురామరాజుకు నిరాశే!
ABN , Publish Date - Mar 25 , 2024 | 04:32 AM
టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తనకు దక్కిన ఆరు లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
నరసాపురం బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాసవర్మ
రాజమండ్రిలో పురందేశ్వరి,
అనకాపల్లి నుంచి సీఎం రమేశ్
అరకు-గీత, రాజంపేట-కిరణ్
తిరుపతి లోక్‌సభ బరిలో వరప్రసాద్
నేడు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తనకు దక్కిన ఆరు లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం రాత్రి విడుదల చేసిన జాబితాలో నరసాపురం వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజుకు చోటు దక్కలేదు. తాను ఆశించిన నరసాపురం పార్లమెంటరీ స్థానంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ లభించడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగనున్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజంపేటలో, కొత్తపల్లి గీత-అరకు(ఎస్టీ), సీఎం రమేశ్-అనకాపల్లి, వైసీపీకి రాజీనామా చేసి వచ్చిన వరప్రసాద్ తిరుపతి (ఎస్సీ)లో పోటీచేయనున్నారు. ఇక పొత్తులో తమకు కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలకు బీజేపీ నాయకత్వం సోమవారం అభ్యర్థులను ప్రకటించనుంది. కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరికి విజయవాడ పశ్చిమ, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్-ధర్మవరం, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి-జమ్మలమడుగు, మాజీ మంత్రి కామినేని శ్రీనివా్‌స-కైకలూరు, విష్ణుకుమార్‌రాజు-విశాఖ ఉత్తరం, నడికుదిటి ఈశ్వరరావు-ఎచ్చెర్ల, ఉమామహేశ్వరరావు-పాడేరు, పార్థసారథి-ఆదోని, పనతల సురేశ్‌కు బద్వేలు (ఎస్సీ) స్థానం కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అనపర్తి స్థానం కూడా బీజేపీ ఖాతాలోనే పడినట్లు తెలిపాయి.
రాజకీయాలు క్రూరం: రఘురామ
రాజకీయాలు క్రూరంగా ఉంటాయని తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చిందని రఘురామరాజు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నరసాపురం టికెట్ రానందుకు తన అభిమానులు మనస్తాపం చెందవద్దని.. తాను ఎన్నికల బరిలో ఉన్నా, లేకపోయినా ఎన్డీయే విజయం సాధిస్తుందని, చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, జగన్‌కు తగిన గుణపాఠం చెబుతానని స్పష్టం చేశారు.