Share News

Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:37 PM

ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. అన్ని దశల్లోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలన్నారు. పనులు సాఫీగా సాగేందుకు కేంద్రం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయని తెలిపారు.

Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: పవన్ కళ్యాణ్

అమరావతి: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. అన్ని దశల్లోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలన్నారు. పనులు సాఫీగా సాగేందుకు కేంద్రం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయని తెలిపారు. వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 13 వేల 326 పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ మేరకు ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజ, ఉపాధి హామీ పథకం అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు.


రోడ్లపై ప్రత్యేక దృష్టి..

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లే రోడ్లను బాగుచేయడం తమ ప్రధాన లక్ష్యమని పవన్ తెలిపారు. 2024 -25లో 3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 22 వేల 525 గోకులాలు, 30 వేల ఎకరాలకు సంబంధించి నీటి సంరక్షణ కందకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పల్లె పండుగ నుంచి ఆ పనులు మొదలు కావాలన్నారు. "ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టే పనులను నిర్దేశిత ప్రమాణాల మేరకు చేయాలి. ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాల తనిఖీ తప్పనిసరి. పనులు ఏ దశలో ఉన్నాయో కూడా ప్రజలకు తెలియచేస్తేనే పారదర్శకత ఉంటుంది. వైసీపీ మాదిరి పంచాయతీలకు దక్కాల్సిన నిధులను పక్కదారి పట్టించడం లేదు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి.


సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డుల ద్వారా కూడా ఏ పంచాయతీకి ఎంత నిధులు అందాయో, వాటి ద్వారా చేస్తున్న పనులు ఏంటో వివరించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభల నిర్వహణ, పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా పనుల ప్రారంభం జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా ఉండాలి. మనం చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతగా పూర్తి చేయడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలివాలి" అని పవన్ కళ్యాణ్ సూచించారు.

Updated Date - Oct 27 , 2024 | 01:37 PM