భయపడొద్దు.. రండి!
ABN , Publish Date - Jul 06 , 2024 | 04:32 AM
గత ఐదేళ్లలో జగన్ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి సరిదిద్దలేనంత నష్టం జరిగిందని, అమరావతి, పోలవరం విధ్వంసానికి గురయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
జగన్ భూతాన్ని మల్లి రానివ్వం
ఎలా నియత్రించాలో తెలుసు
పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు భరోసా
ఆంధ్ర పునర్నిర్మాణమే ధ్యేయం
ఆ దిశగానే ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చలు
గత ఐదేళ్ల నష్టం నుంచి బయటికి రావాలి
రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సహకరించాలని కోరాం
రాజధాని, పోలవరం ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అభివృద్ధే లక్ష్యం.. కులగణన బదులు నైపుణ్య గణన
విశాఖ ఉక్కుకు మెరుగైన యాజమాన్యంపై
చర్చిస్తున్నాం.. నేను ఇన్వెస్టర్లకు అనుకూలం
నా హయాంలోనే కియా వచ్చింది
ఈ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమా రాలేదు
ఇప్పుడు పలువురు సీఈవోలు సంప్రదిస్తున్నారు
ఢిల్లీలో మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠి
న్యూఢిల్లీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో జగన్ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి సరిదిద్దలేనంత నష్టం జరిగిందని, అమరావతి, పోలవరం విధ్వంసానికి గురయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. మళ్లీ జగన్ వస్తారేమోనని కొందరు భయపడుతున్నారని.. ముఖ్యంగా ఆ భూతాన్ని చూసి రాష్ట్రానికి వచ్చేందుకు పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారని తెలిపారు. అయితే దానిని ఎలా నియంత్రించాలో తమకు తెలుసని.. దాని గురించి భయపడాల్సిన అవసరం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం ఢిలీల్లో కేంద్ర ఆర్థిక, రక్షణ, ఆరోగ్య మంత్రులతో భేటీల అనంతరం.. హైదరాబాద్ బయల్దేరి వెళ్లే ముందు మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ, ప్రాంతీయ మీడియాతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. దాదాపు గంట సేపు మనసు విప్పి మాట్లాడారు. ఎవరు ఎన్ని వివాదాస్పద ప్రశ్నలు వేసినా తడుముకోకుండా చమత్కరిస్తూ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ప్రధాన ఎజెండాగా తన రెండ్రోజుల పర్యటన సాగిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడంతో పాటు మొత్తం రాష్టాన్ని పునర్నిర్మించడమే ధ్యేయంగా ఢిల్లీలో ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులతో చర్చలు జరిపానని, అందరి నుంచీ సానుకూల స్పందన వ్యక్తమైందని చెప్పారు. గత ఐదేళ్లుగా జరిగిన నష్టం నుంచి బయటకు రావాలని, అందుకు అనుగుణంగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సహకారం అందించాలని కేంద్రాన్ని కోరామని చెప్పా రు. ఏపీ గ్లోబల్ లీడర్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పదవులు మాకెప్పుడూ ముఖ్యం కాదు..
టీడీపీకి పదవులు ఎప్పుడూ ముఖ్యం కాదని, వాజపేయి హయాంలో కూడా ఏడు మంత్రిపదవులు ఇస్తామన్నా వద్దన్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్డీయేతో సత్సంబంధాల కోసమే బలవంతం మీద నాడు లోక్‌సభ స్పీకర్ పదవి తీసుకున్నామని చెప్పారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు మారాయన్నారు. కేంద్రంలో తమకు కేటాయించిన మంత్రి పదవుల పట్ల సంతోషంగా ఉన్నామని తెలిపారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా కోరుకోవడం లేదని చెప్పారు. కావాలంటే నా తరఫున మీరు అడగండని చమత్కరించారు. బీజేపీ ఎజెండాకు తాము మద్దతిచ్చామని.. తమ ఎజెండాకు వారు మద్దతిచ్చారని.. రెండు పార్టీలు పరస్పర ఎజెండాలకు అనుగుణంగా పనిచేస్తాయని తెలిపారు. 2014లో మోదీతో ఉన్న సంబంధాలకు, ఇప్పటి సంబంధాలకూ తేడా ఏమిటని ప్రశ్నించగా.. ఆయన నేరుగా జవాబివ్వలేదు. ‘నేను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మీరెలా చూశారు.. ఇప్పుడెలా ట్రీట్ చేస్తున్నారు? పరిస్థితులు మారాయి కదా..! ఇప్పుడు మేం కలిసి పని చేస్తాం’ అని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని మోదీ కూడా చెప్పారని గుర్తుచేశారు.
అదో నిరంతర ప్రక్రియ..
రాజధాని నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, హైదరాబాద్ కూడా ఇదే విధంగా అభివృద్ధి చెందిందని సీఎం తెలిపారు. శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి ముఖ్యమైన భవనాలతో సహా అన్ని కార్యాలయాల నిర్మాణాలను పూర్తిచేస్తామని తెలిపారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలనూ మొదట పూర్తి చేస్తామన్నారు. విశాఖ ఉక్కు మెరుగైన యాజమాన్యం ఆధ్వర్యంలో అభివృద్ధి చెందే దిశగా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. తాను ఇన్వెస్టర్లకు అనుకూల సీఎంనని ప్రకటించారు. తన హయాంలోనే అనంతపురంలో కియా వచ్చిందని గుర్తుచేశారు. ‘ఈ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమా రాలేదు. ఇప్పుడు మేం మళ్లీ గేట్లు తెరిచాం. పలు విదేశీ సంస్థలు, పరిశ్రమల సీఈవోలు సంప్రదిస్తున్నారు. దావో్‌సలో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరవుతా’ అని చెప్పారు.
నైపుణ్యాన్ని బట్టి ఉపాధి!
కులగణన బదులు నైపుణ్య గణన చేపట్టాలని భావిస్తున్నామని.. దీనిపై కే బినెట్ లో చర్చించి ఆమోదించామని చంద్రబాబు తెలిపారు. ‘మానవ వనరులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపదను సృష్టించడమే నా లక్ష్యం. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో అభివృద్ధి చేపడతాం. నైపుణ్యానికి అనుగుణంగా యువతకు ఉపాధి లభిస్తుంది. ప్రతి కుటుంబంలో నైపుణ్యాలను అంచనా వేసి వారి శక్తి సామర్థ్యాలతోనే తలసరి ఆదాయాన్ని పెంచుతాం. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీఏ) ఉండేది. నేను మరో పీ(పీపుల్ )ని కూడా చేర్చా. ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నారు. వారిని గ్లోబల్ లీడర్లుగా తయారు చేయవచ్చు’ అని చెప్పారు.
విధ్వంసంపై ప్రజల్లో చైతన్యం
ఏపీలో జరిగిన విధ్వంసంపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని సీఎం అన్నారు. జగన్ చేసిన అక్రమాలపై చార్జిషీట్ దాఖలు చేస్తారా అని అడుగగా.. ఏం జరిగిందో వివరించి ప్రజల్లో చైతన్యం తేవడమే పరిష్కారమని బదులిచ్చారు. ‘రుషికొండ ప్యాలెస్‌ను మీరందరూ వచ్చి చూడండి.. దానిని జగన్ ఎలా నిర్మించాలో తెలుస్తుంది. ప్రజలు కూడా వచ్చి చూసేలా చేస్తాం’ అని అన్నారు. రిసార్ట్‌గా మారుస్తారా అని అడిగినప్పుడు.. ఎవరు చెల్లిస్తారని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి ఏ అడ్డంకులూ లేవని, దక్షిణాదిలో ఏ రాష్ట్రానికీ లేనన్ని గొప్ప వనరులు ఉన్నాయని చెప్పారు. నదుల అనుసంధానం పూర్తి స్థాయిలో చేపడితే గోదావరి నుంచే దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ నీటి సరఫరా చేయవచ్చన్నారు. అరకును మార్చివేసిన నాందీ ఫౌండేషన్ తన సృష్టేనన్నారు. దానిని తాను అంజిరెడ్డికి అప్పజెబితే ఆయన ఆనంద్ మహీంద్రాకు అప్పగించారని తెలిపారు.
ఏపీ అభివృద్ధి, పునర్నిర్మాణానికి మొత్తం ఎన్డీయే కట్టుబడి ఉంది. అది దాని బాధ్యత. దేశ, రాష్ట్ర ప్రజలు ఎన్డీయేకే అధికారం ఇచ్చారు. అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తాం.
జగన్ ధ్వంసం చేసేశారని నేను పారిపోదలచుకోలేదు. ఈ కష్ట సమయాన్ని తట్టుకుని దశలవారీగా రాష్ట్రాన్ని నిర్మిస్తా. 2014లో కూడా ఇదే విధంగా నిర్మాణం ప్రారంభించా.
కృష్ణా, గోదావరి నదుల మధ్య ఏపీ అనుసంధానమై ఉంది. ఒక్క గోదావరి నుంచే సుమారు 3వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. దీనిని ఉపయోగించుకుంటే రాష్ట్రంలో అద్భుతాలు సాధించవచ్చు. కరువు అనేదే ఉండదు.
విభజన సమయంలో నేను తటస్థంగా ఉన్నాను. ఏ పక్షం గురించీ మాట్లాడలేదు. ప్రజలను కన్వి న్స్ చేయాలని చెప్పాను. కానీ వారిని ఒప్పించకుండా ఎలా చేశారో అందరికీ తెలుసు. అందుకే సమస్యలు తలెత్తాయి.
- చంద్రబాబు
పరస్పర ప్రయోజనాల కోసమే రేవంత్‌తో చర్చలు
శనివారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలన్నదే తన విధానమని చంద్రబాబు అన్నారు. విభజన సమయంలో కూడా ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని కోరానని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించవచ్చని.. కానీ తాను రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరస్పర ఆమోదంతో సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో చర్చలు జరుపుతానని తెలిపారు. తెలుగువారు కలిసి ఉండాలని, సోదర భావంతో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. కార్పొరేషన్లు, షెడ్యూలు 9, 10 కింద ఉన్న సంస్థల విభజనపై చర్చించాల్సి ఉందన్నారు.