Share News

సీఎంఆర్‌పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

ABN , Publish Date - Oct 10 , 2024 | 03:12 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందుతున్న సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్స్‌పై కొందరు ఇటీవల సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని,

సీఎంఆర్‌పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

సోషల్‌ మీడియా ప్రచారంలో వాస్తవం లేదు

ది వైజాగపటం క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌

ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం

సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ

విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందుతున్న సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్స్‌పై కొందరు ఇటీవల సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, మార్ఫింగ్‌ ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని ఎవరూ నమ్మవద్దని ది వైజాగపటం క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కంకటాల మల్లిక్‌ కోరారు. అసోసియేషన్‌ తరఫున బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎంఆర్‌ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసే దురుద్దేశంతో ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. దీనిని వస్త్ర వ్యాపారులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చేదంతా వాస్తవం కాదని, నిర్ధారించుకోవాలని సూచించారు. ఫేక్‌ పోస్టులు ఇతరులకు షేర్‌ చేయడం వల్ల తెలియకుండానే నష్టం చేసినట్టు అవుతుందన్నారు. సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో సీఎంఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్స్‌ ఉన్న ప్రతిచోట పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తెలిసీ తెలియక ఈ పోస్టును ఇతరులకు షేర్‌ చేసినా సైబర్‌ క్రైమ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సీఐఐ ఏపీ వైస్‌ చైర్మన్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ, సీఎంఆర్‌ గ్రూపు వ్యాపారంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుందని, వారిపై తప్పుడు ప్రచారం చేయడం తగదని, దీనిని ఖండిస్తున్నామన్నారు. మతపరమైన అంశాలను జోడించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వాటివల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, అలాంటి పనులు తగవని వీసీసీఐ అధ్యక్షులు సుదర్శన స్వామి అన్నారు. ఈ అంశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పూర్వపు అధ్యక్షులు పైడా కృష్ణప్రసాద్‌ కోరారు.

Updated Date - Oct 10 , 2024 | 03:13 AM