బరితెగింపు వద్దు బ్రదర్!
ABN , Publish Date - Oct 16 , 2024 | 05:30 AM
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ నెల 18న ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఎంపీలు, ఎమ్మెల్సీలకు మంగళవారం సమాచారం వెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
‘కట్టు’ తప్పుతున్న తమ్ముళ్లకు గట్టి సంకేతం
18న ఎమ్మెల్యేలు, ఎంపీలతో బాబు భేటీ
ఇసుక దందా, లిక్కర్ సిండికేట్‌పై సీరియస్
పలువురు ఎమ్మెల్యేల తీరుపై విమర్శల వెల్లువ
కార్యకర్తల నుంచీ అధిష్ఠానానికి ఫిర్యాదులు
పార్టీకి, ప్రభుత్వానికీ అప్రతిష్ఠ తెస్తే సహించం
దందాల్లో కుటుంబసభ్యులున్నా ఊరుకోం.. తేల్చిచెప్పనున్న
ముఖ్యమంత్రి.. తీవ్ర ఆరోపణలున్న వారికి సెపరేట్‌గా క్లాసు
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ నెల 18న ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఎంపీలు, ఎమ్మెల్సీలకు మంగళవారం సమాచారం వెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. త్వ రలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కానుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటిపైనా అధినేత దృష్టి సారించనున్నట్టు తెలిపాయి. ముఖ్యంగా, ఇసుక దందా, మద్యం షాపుల దరఖాస్తులో నడిచిన సిండికేట్ వ్యవహారాల్లో అక్కడకక్కడ కొందరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. ఈ వ్యవహారాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఇలాంటి నేతలను గుర్తించి ఇప్పటికే అధిష్ఠానం వారికి గట్టి సంకేతాలు అందించింది. జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారు. వారిని కట్టడి చేయాలంటూ చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీల భేటీ ఏర్పాటు అయినట్టు, ఈ భేటీలో అందరికీ అధినేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా.. పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉండాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేయనున్నారు. అక్రమ, అవినీతి, అధికార దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు వారి కుటుంబసభ్యులూ ఎక్కడా తల దూర్చడానికి వీల్లేదని గట్టిగా చెప్పనున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్ఠను తెచ్చే పనులు చేసినట్టు తన దృష్టికి వస్తే సహించేది లేదని, నాయకుడి నుంచి కార్యకర్త వరకు... అందరికీ ఇదే వైఖరి వర్తిస్తుందని చంద్రబాబు తేల్చిచెప్పనున్నారు. ఏ కొద్దిమందికో కాకుండా అందరినీ ఒకే హాలులో కూర్చోబట్టి చంద్రబాబు మాట్లాడతారు. అయితే, తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేలను మాత్రం విడి విడిగా ఒక్కొక్కళ్లను పిలిపించి మాట్లాడతారు. పద్ధతి మార్చుకోవాలని, బరితెగింపును సహించేది లేదని వారికి స్పష్టం చేస్తారు. కాగా, దీని కొనసాగింపుగా శనివారం,పంతొమ్మిదో తేదీన కూడా మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలుగా లేని నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్య నేతలతో ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితి, సభ్యత్వ నమోదుకు సంబంధించిన అంశాలను ఈ భేటీలో సమీక్షించనున్నట్లు పేర్కొన్నాయి.