Share News

ఇంటర్‌ ఒకేషనల్‌లో డ్యూయల్‌ సర్టిఫికెట్‌!

ABN , Publish Date - Oct 10 , 2024 | 03:26 AM

ఇంటర్మీడియట్‌ విద్యలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెగ్యులర్‌ ఇంటర్‌ కోర్సులతో పాటు వృత్తి విద్యా కోర్సుల్లోనూ సంస్కరణలు తీసుకురాబోతోంది.

ఇంటర్‌ ఒకేషనల్‌లో డ్యూయల్‌ సర్టిఫికెట్‌!

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎన్‌సీవీటీఈతో ఇంటర్‌ బోర్డు అఫిలియేషన్‌

ఈ విధానంతో విద్యార్థులకు అదనపు ప్రయోజనం

సిలబ్‌సపై సమీక్ష... కోర్సుల కుదింపు

90వేల మంది విద్యార్థులకు మేలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇంటర్మీడియట్‌ విద్యలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెగ్యులర్‌ ఇంటర్‌ కోర్సులతో పాటు వృత్తి విద్యా కోర్సుల్లోనూ సంస్కరణలు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఒకేషనల్‌ కోర్సులు చదివే విద్యార్థులకు డ్యూయల్‌ సర్టిఫికేట్లు ఇచ్చే విధానం అమల్లోకి తేవాలని కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఒకేషనల్‌ విద్యార్థులకు సాధారణంగా ఇచ్చే ఇంటర్‌ సర్టిఫికెట్‌తో పాటు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఒకేషనల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీవీటీఈ) సర్టిఫికెట్‌ను అదనంగా ఇవ్వనుంది. ఎన్‌సీవీటీఈ జాతీయ స్థాయిలో వృత్తి విద్య కోర్సులను పర్యవేక్షిస్తుంది. ఇది జారీ చేసే సర్టిఫికెట్‌ ద్వారా వృత్తి విద్య కోర్సులు చదివిన విద్యార్థులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది.

ఉపాధి అవకాశాలు మెరుగు

సాధారణంగా ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ లాంటి రెగ్యులర్‌ కోర్సులకే ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. అయితే ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులు త్వరగా స్థిరపడాలనే లక్ష్యంతో ఒకేషనల్‌ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇంటర్‌ చదివే విద్యార్థుల్లో ఒకేషనల్‌ విద్యార్థులు కేవలం 10శాతం మంది ఉన్నారు. ఏటా రాష్ట్రంలో 80 నుంచి 90వేల మంది విద్యార్థులు ఒకేషనల్‌ కోర్సులు చదువుతున్నారు. వీరిలో కొందరు ఇంటర్‌ అనంతరం ఉద్యోగాల్లో చేరుతుంటే, కొందరు వృత్తి విద్యలో ఉన్నత విద్యకు వెళ్తున్నారు. అయితే, రాష్ట్ర బోర్డు ఇచ్చే ఇంటర్‌ సర్టిఫికెట్‌ రాష్ట్రంలోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రం వెలుపల ఉద్యోగాల్లో చేరాలంటే ఎన్‌సీవీటీఈ సర్టిఫికెట్‌ అవసరం అవుతోంది. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ సంస్థల్లో చేరాలన్నా జాతీయ స్థాయి సర్టిఫికెట్‌ అడుగుతున్నారు. అందువల్ల ఇకపై ఎన్‌సీవీటీఈతో కలిసి డ్యూయల్‌ సర్టిఫికెట్లు జారీచేయాలని ఇంటర్‌ విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఎన్‌సీవీటీఈతో ఇంటర్‌ బోర్డు అఫిలియేట్‌ అవుతుంది. ఇంటర్‌ తర్వాత ఉద్యోగాలు పొందేవారితో పాటు ఉన్నత విద్య అనంతరం ఉద్యోగాలకు కూడా ఎన్‌సీవీటీఈ సర్టిఫికెట్‌ ఉపయోగపడుతుంది. డ్యూయల్‌ సర్టిఫికేషన్‌ విధానం విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

కోర్సుల తగ్గింపుపై కసరత్తు

రాష్ట్రంలో 722 జూనియర్‌ కాలేజీల్లో 23 ఒకేషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, లైవ్‌స్టాక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెయిరీయింగ్‌ కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. టూరిజం ట్రావెల్‌ టెక్నీషియన్‌, హోటల్‌ ఆపరేషన్స్‌, ఫ్యాషన్‌ అండ్‌ గార్మెంట్‌ మేకింగ్‌ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇలాంటి కోర్సుల్లో ఒక్కో కాలేజీలో ఇద్దరు ముగ్గురే చేరుతున్నారు. అందువల్ల విద్యార్థులు పెద్దగా చేరని కోర్సులను తొలగించాలని కూడా నిర్ణయించారు. 23 కోర్సులను కనీసం 15కు తగ్గించాలని భావిస్తున్నారు. అలాగే పదేళ్ల కిందట ఒకేషనల్‌ కోర్సుల సిలబస్‌ రూపొందించగా, ఆ తర్వాత మార్పులు చేయలేదు. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టుగా సిలబ్‌సలో కూడా మార్పులు చేయనున్నారు. ఇందులో కూడా ఎన్‌సీవీటీఈ సహకారం తీసుకుంటారు.

Updated Date - Oct 10 , 2024 | 03:26 AM