జగన్ పాలనలో అర్చకులకు తీవ్ర నష్టం
ABN , Publish Date - Oct 31 , 2024 | 04:00 AM
గత ప్రభుత్వం చేపట్టిన జగనన్న రీ సర్వేతో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అర్చకులు తీవ్రంగా నష్టపోయారని, ఆన్‌లైన్‌లో, అడంగళ్‌లో అర్చకుల పేర్లు తొలగించడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని అర్చక సంక్షేమ సంఘ సభ్యులు ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు.
గత ప్రభుత్వ తీరుతో పథకాలకు దూరం
ప్రజావేదికలో వైసీపీ బాధితుల గోడు
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం చేపట్టిన జగనన్న రీ సర్వేతో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అర్చకులు తీవ్రంగా నష్టపోయారని, ఆన్‌లైన్‌లో, అడంగళ్‌లో అర్చకుల పేర్లు తొలగించడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని అర్చక సంక్షేమ సంఘ సభ్యులు ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. ఆలయాల అర్చకులు అనుభవిస్తున్న భూముల వివరాలను ఆన్‌లైన్, అడంగళ్‌లో నమోదు చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని అర్చక సంఘ సభ్యులు కోరారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, టిడ్కో చైర్మన్ శ్రీనివాసులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ బాధితులు టీడీపీ నేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. నక్కవాగు అభివృద్ధికి 2.39ఎకరాలు భూసేకరణ కింద తీసుకుని పరిహారం ఇవ్వలేదని, దీనిపై గత ప్రభుత్వంలో అధికారులను అడిగితే.. అప్పటి మంత్రి విడదల రజనిని కలవాలన్నారని పల్నాడు జిల్లా జగ్గాపురం గ్రామానికి చెందిన బసవేశ్వరరావు తన గోడు వెళ్లబోసుకున్నారు. రజనీని కలిసేందుకు అంగీకరించకపోవడంతో తనకు రావాల్సిన బిల్లులు రానివ్వలేదని నేతల దృష్టికి తెచ్చారు. ఏపీ గురుకుల పాఠశాలల్లో రికార్డు అసిస్టెంట్లుగా పని చేస్తున్న తమని ఎలాంటి ఉత్తర్వులూ లేకుండా గత ప్రభుత్వం విధుల నుంచి తొలగించడంతో ఉపాధి కోల్పోయామని పలువురు మంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం ముంపు గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వకుండా, వైసీపీ వారికి మాత్రం మంజూరు చేశారని, అల్లూరి జిల్లా దేవీపట్నం మండలానికి చెందిన నిర్వాసితులు వాపోయారు.
నేడు, రేపు ప్రజావేదిక రద్దు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 31న జరగాల్సిన ప్రజావేదికను దీపావళి కారణంగా రద్దు చేసినట్లు ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. అలాగే నవంబరు1న పింఛన్ల పంపిణీ ఉన్నందున ఆ రోజు కూడా గ్రీవెన్స్ ఉండదని చెప్పారు.