ఎడాపెడా ‘సిద్ధం’
ABN , Publish Date - Feb 03 , 2024 | 04:24 AM
అధికార పార్టీ వైసీపీ ‘సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని భీమిలిలో తొలి సభను నిర్వహించగా..
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు దేన్నీ వదలని వైసీపీ నేతలు
ఎటు చూసినా పోస్టర్లు, బ్యానర్లే
పార్టీ ప్రచారానికి ప్రజల సొమ్ముపై విస్మయం
విజయవాడ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ వైసీపీ ‘సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని భీమిలిలో తొలి సభను నిర్వహించగా.. శనివారం ఏలూరు జిల్లాలో మలి సభకు ఏర్పాట్లు చేశారు. అయితే.. ఈ సిద్ధం సభకు సంబంధించి జిల్లాలు దాటి మరీ ప్రచారం చేస్తుండడం గమనార్హం. రైల్వే స్టేషన్, బస్టాండ్ సహా కీలక ప్రాంతాల్లో ఎటు చూసినా బ్యానన్లు, పోస్టర్లు, డిజిటల్ చిత్రాలు దర్శనమిచ్చాయి. అత్యంత రద్దీగా ఉండే విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అయితే అడుగడుగునా వీటిని ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ముఖచిత్రంతో ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రచార చిత్రాలు చూసి ప్రయాణికులు విస్తుబోతున్నారు. సహజంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వచ్చేవారు.. రైళ్లు, బస్సుల సమాచారం తెలుసుకునేందుకు బోర్డుల వంక చూస్తారు. కానీ, ఇప్పుడు ఎటు చూసినా ఆ సమాచారం ఎక్కడా కనిపించక పోగా, ‘జగన్ సిద్ధం’ బ్యానర్లు, పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ‘ఇదేం ఖర్మ’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో జాతీయ, రాష్ట్ర రహదారులను సైతం వైసీపీ నాయకులు వదిలి పెట్టలేదు. విజయవాడలోని ఎన్‌హెచ్-16, 65ల వెంబడి భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌లో ప్రకాశ్ ఆర్ట్స్, బస్‌స్టేషన్‌లో యూనీ యాడ్స్ ఏజెన్సీలు ఈ ‘సిద్ధం’ బ్యానర్లను ఏర్పాటు చేశాయి. ఈ రెండు సంస్థలు యాడ్ ఏజెన్సీలు కావటంతో.. ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక పార్టీకి సంబంధించిన ప్రచార బ్యానర్లను ఇలా ప్రభుత్వ సొమ్ముతో భారీ సంఖ్యలో ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఏ ఖాతా నుంచి ఈ నిధులు చెల్లించి ఉంటారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ‘సిద్ధం’ సభ నిర్వహణ, లక్ష్యం పూర్తిగా పార్టీకి సంబంధించిన వ్యవహారం. దీనికి, ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా.. ముఖ్యమంత్రి ఫొటోతో భారీ ఎత్తున ప్రచారం చేస్తుండడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధం బ్యానర్లలో ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే కనపడవచ్చు, అందులో పార్టీ పేరు లేకపోవచ్చు, కానీ పార్టీ రంగులు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ వ్యవహారాలకు సంబంధించిన బ్యానర్లకు, ప్రచారానికి ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారనేది సామాన్యుల ప్రశ్న. దీనికి వైసీపీ నాయకులు ఏం చెబుతారో చూడాలి.