Share News

Education system : ఇదేనా చదువుల గొప్ప..

ABN , Publish Date - Jan 25 , 2024 | 04:31 AM

పిల్లల చదువులతో రకరకాల ప్రయోగాలు చేస్తూ... స్కూళ్ల విలీనం పేరిట బడులను ‘దూరం’ చేసిన జగన్‌... తన విద్యా విధానం గురించి చాలా గొప్పలు చెప్పారు. ట్యాబ్‌లు, బైజూస్‌ కంటెంట్‌, ఇంటర్‌నేషనల్‌ బ్యాకెలారియేట్‌

Education system : ఇదేనా చదువుల గొప్ప..

పిల్లల చదువులతో రకరకాల ప్రయోగాలు చేస్తూ... స్కూళ్ల విలీనం పేరిట బడులను ‘దూరం’ చేసిన జగన్‌... తన విద్యా విధానం గురించి చాలా గొప్పలు చెప్పారు. ట్యాబ్‌లు, బైజూస్‌ కంటెంట్‌, ఇంటర్‌నేషనల్‌ బ్యాకెలారియేట్‌ (ఐబీ), ఆన్‌లైన్‌ కోర్స్‌లు... అంటూ ‘రంగుల చిత్రాన్ని’ ఆవిష్కరించారు. ఉన్నత విద్య చదివిన వారికి ఉపాధి అవకాశాల మాటేమిటి, మీరు చేశామంటున్న మార్పు ఒకటి చెప్పండి... అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. ‘ఉదాహరణకు.. ఉదాహరణకు’ అంటూ మన దేశంలో బీకాం చదివిన వాళ్లకు ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ తెలియదని జగన్‌ చెప్పారు. ఇలాంటి వాళ్లకు హార్వర్డ్‌ లాంటి ప్రఖ్యాత వర్సిటీలతో సర్టిఫికెట్లు ఇప్పించేందుకు ‘ఎడెక్స్‌’తో ఒప్పందం చేసుకున్నామన్నారు. నిజానికి... ఈ ఒప్పందం ఇంకా అమలులోకే రాలేదు. ఇదే కాదు... సీఎం గొప్పగా చెబుతున్న ‘ఐబీ’ సంగతీ అంతే. జగన్‌ అధికారంలోకి రాగానే... మొత్తం 45వేల పాఠశాలల్లో సీబీఎ్‌సఈ ప్రవేశపెడతామని గొప్పగా చెప్పారు. కానీ... వెయ్యి స్కూళ్లలో కూడా ప్రవేశపెట్టలేకపోయారు. సీబీఎ్‌సఈకి సరిపడా ప్రమాణాలు, వసతులు లేకపోవడమే దీనికి కారణం. దీంతో... ‘ఐబీ’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. దీని పేరు వినడానికి మాత్రమే గొప్పగా ఉంటుంది. కానీ... ప్రపంచవ్యాప్తంగా పదివేల స్కూళ్లలో కూడా ఈ సిలబస్‌ అమలులో లేదు. మనదేశంలో ఎక్కడుందో ఎవరికీ తెలియదు. దీనివల్ల ఉపయోగమేమిటో కూడా విద్యా నిపుణులకు అర్థం కావడంలేదు. ఇది 2025 నుంచి రాష్ట్రంలో అమలులోకి వస్తుందని... ఒక్కో తరగతికి పొడిగించుకుంటూ వెళ్తామని, 2035 నాటికి రాష్ట్రంలోని విద్యార్థులంతా టెన్త్‌ పరీక్షలను ‘ఐబీ’లో రాస్తారని జగన్‌ తిరుపతి సదస్సులో చెప్పారు.

బైజూస్‌, ట్యాబ్‌ల కథ...

‘ఎడ్యుకేషన్‌ మీట్‌’లోనూ జగన్‌ బైజూస్‌ కంటెంట్‌, ట్యాబ్‌ల పంపిణీ గురించి అందంగా వివరించారు. దీనివల్ల నిజంగానే ఉపయోగముందా? స్టేట్‌ సిలబ్‌సనే బైజూస్‌ కంటెంట్‌ పేరిట ట్యాబ్‌లలోకి ఎక్కించడం వల్ల ఉపయోగం ఏమిటి?పిల్లలు ఆ ట్యాబ్‌లను ఓపెన్‌ చేస్తున్నారా? అవి దుర్వినియోగం కావడంలేదా? వాటిలో ఎన్ని పనికొస్తున్నాయి? పక్కాగా సర్వే చేస్తే ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. అసలు వాస్తవాలు ఏమైనప్పటికీ... జగన్‌ చెప్పిన అంశాలతో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ బాగా సంతృప్తి చెందడం, ‘మీరు కూడా చప్పట్లు కొట్టండి’ అని అందరితో చప్పట్లు కొట్టించడం కొసమెరుపు!

Updated Date - Jan 25 , 2024 | 04:31 AM