Share News

మడ అడవుల విస్తీర్ణం పెంపునకు కృషి

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:09 AM

కేంద్ర ప్రభుత్వం సహకారంతో ‘మిస్టీ’ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో మడ అడవులు విస్తీర్ణం పెంచుతామని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

మడ అడవుల విస్తీర్ణం పెంపునకు కృషి

ఐదేళ్లలో 700 హెక్టార్లలో పెంచడమే లక్ష్యం: పవన్‌

అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం సహకారంతో ‘మిస్టీ’ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో మడ అడవులు విస్తీర్ణం పెంచుతామని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. శుక్రవారం అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్‌లో అటవీశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... ‘పర్యావరణంపై నాకు ప్రత్యేక అసక్తి ఉంది. ప్రకృతి సౌందర్యంతో పాటు జీవవైవిధ్యం, వన్యప్రాణులు, మడ అడవులను కాపాడాల్సిన అవసరముంది. వీటి విధ్వంసానికి పాల్పడితే పునరుద్ధరణకు శతాబ్దకాలం పడుతుంది. వచ్చే ఐదేళ్లలో 700 హెక్టార్లలో మడ అడవులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మడకు చట్టపరమైన రక్షణ అవసరం. వీటిని కాపాడేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. స్వామినాథన్‌ ఫౌండేషన్‌ సహకారం తీసుకోవాలి. ప్రభుత్వ భూముల్లో మడ ఉంటే అటవీశాఖ పరిధిలోకి తేవాలి. గత ప్రభుత్వం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించి, గృహ నిర్మాణానికి కేటాయించింది. ఇలాంటివి సీఎంతో చర్చించి, మడ అడవుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. మడ అడవుల విస్తరణకు 50ు నిధులు కేంద్రం ఇస్తుంది’ అని పవన్‌ చెప్పారు.

కుంకీ ఏనుగులపై కర్ణాటకతో చర్చిస్తాం

చిత్తూరు, మన్యం జిల్లాల్లో ఏనుగులు పంటలను నాశనం చేయడం, జనవాసాల్లోకి రావడంపై పవన్‌ కల్యాణ్‌ అటవీ శాఖ అధికారులతో చర్చించారు. ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపేందుకు కుంకీ ఏనుగుల కొరత ఉందని, అవి కర్ణాటకలో ఉన్నాయని అధికారులు చెప్పగా, కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి, కనీసం ఐదు కుంకీ ఏనుగులను తెప్పించేందుకు కృషి చేస్తామని పవన్‌ చెప్పారు.

Updated Date - Jul 27 , 2024 | 07:27 AM