‘ఉపాధి’ కూలీలు విలవిల!
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:21 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక చట్టబద్ధమైన పథకం. ఈ పథకం ద్వారా చేపట్టే పనులన్నింటికీ చట్టబద్ధత ఉంది.
చట్టప్రకారం గ్రామీణ కూలీలకు ఉపాధి పనులు కల్పించడమే కాదు.. వేసవిలో అయితే పని ప్రదేశంలో మజ్జిగ ప్యాకెట్లు, ప్రతి ఉపాధి కార్మికుడికీ ప్రతి రోజూ తాగునీటి సదుపాయం లేదా అలవెన్సు.. ఎండ వేడిమి తట్టుకునేందుకు షేడ్స్.. అనుకోని ప్రమాదాలు జరిగితే మెడికల్ కిట్స్.. చిన్న పిల్లల కోసం ఆయాల ఏర్పాటు.. కూలీలకు పనిముట్ల కోసం వారానికి రూ.9లు చొప్పున అలవెన్సు అందజేత.. ఒకప్పుడు ఇవన్నీ ప్రభుత్వం కల్పించేది!. కానీ ఇప్పుడు ఆ సౌకర్యాలన్నీ ఆపేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్ వచ్చిన తర్వాత వాటిలో అలాంటి ప్రొవిజన్స్ లేకపోవడంతో వేతనాలతో వాటిని చెల్లించే వెసులుబాటు లేకుండా పోవడమే ఇందుకు కారణమైనప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ నిధులు ఖర్చు చేసి, కేంద్రం మెటీరియల్ నిధులు ఇచ్చిన తర్వాత వాడుకోవచ్చు!. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను ఇతర అవసరాలకు దారిమళ్లించేసి.. వీటికి వాడకపోవడంతో గ్రామాల్లో ఉపాధి కూలీలు పని ప్రదేశాల్లో సదుపాయాల్లేక విలవిల్లాడుతున్నారు!.
మండు వేసవిలోనూ తాగునీటి సరఫరా నిల్
మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ సరేసరి
పనిముట్లకు ఇవ్వాల్సిన అలవెన్సు నిలిపివేత
పని ప్రదేశాల్లో ‘నీడ’నివ్వని సర్కార్
అందుబాటులో లేని ఫస్ట్ ఎయిడ్ కిట్స్
చట్టబద్ధ పథకంలో సౌకర్యాలు నిల్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక చట్టబద్ధమైన పథకం. ఈ పథకం ద్వారా చేపట్టే పనులన్నింటికీ చట్టబద్ధత ఉంది. ఈ పథకంలో పనిచేసే కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీరు, పని చేసే మహిళలకు ఐదేళ్ల లోపు పిల్లలుంటే వారిని చూసుకునేందుకు ఒక ఆయా, ప్రమాదం జరిగితే ప్రాథమిక చికిత్స చేసేందుకు మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలని ఈ పథకం మాస్టర్ సర్క్యులర్ 2022-23లో చాప్టర్ 8.1లో స్పష్టంగా వివరించారు. పనిచేసే సమయంలో ఎవరైనా కూలీలు ప్రమాదానికి గురైతే వారికి వైద్యం చేయించడమే కాకుండా ఆ రోజు కనీసం సగం వేతనం తగ్గకుండా చెల్లించాలని చట్టంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించడం, ట్రీట్‌మెంట్, మందులు ఉచితంగా ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అందిస్తారు. పని ప్రదేశాల్లో కూలీల పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే వారికి వైద్యం చేయించాల్సి ఉంది. బీమా వంటివి మినహాయిస్తే.. రాష్ట్రంలో ఈ సర్కార్ వచ్చిన తర్వాత ఇవేమీ అమలు కావడం లేదు. ప్రస్తుతం ఉపాధి క్షేత్రాల్లో పనిచేసే కూలీలు ఎర్రటి ఎండలో తాగునీటి సౌకర్యాలు సైతం లేక విలవిలలాడుతున్నారు. వాస్తవానికి పనికి వెళ్లే ప్రతి కూలీకి పనిముట్లను అందించాలి.
గడ్డపార, పార, మట్టిని మోసేందుకు తట్టలు ఈ పథకం ద్వారా అందించాలి. గడ్డపార పదును చేసుకునేందుకు ప్రతి వారం రూ.9లు అలవెన్సును గతంలో ఇచ్చేవారు. ఈ సర్కార్ వచ్చిన తర్వాత అలాంటి సౌకర్యాలేవీ ఇవ్వకుండా నిలిపేసింది. దీంతో కూలీలు తమ సొంత ఖర్చులతోనే పనిముట్లను వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో వేసవి వచ్చే సరికి ప్రతి ఏటా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేవారు. మజ్జిగ పంపిణీ చేయలేకపోతే అందుకు అవసరమైన అలవెన్సును వేతనంతో పాటు అందించేవారు. ఇప్పుడా అలవెన్సు నిలిచిపోయింది. ఏడాదిలో ఎప్పుడైనా ప్రతి రోజు కూలీలకు తాగునీటి కోసం రూ.5 అలవెన్స్ చెల్లించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పని ప్రదేశాల్లో చెట్లు కూడా లేని చోట ఎండ వేడిమి నుంచి రక్షణకు షేడ్స్ వేసి గతంలో నీడను కల్పించేవారు. ఈ సర్కార్ వచ్చిన తర్వాత షేడ్స్, పనిముట్లు, మెడికల్ ఎయిడ్ కిట్స్ కొనుగోలు టెండర్లు పిలవడం మానేసింది. గతంలో సరఫరా చేసిన షేడ్స్ సైతం చిరిగిపోయి ఎక్కడా అందుబాటులో లేకుండా పోయాయి. మెడికల్ ఎయిడ్ కిట్స్ లేకపోవడంతో ఏదైన ప్రమాదాలు జరిగితే హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు వెళ్లే లోపు మరింత అనారోగ్యం పాలవుతున్నారు.
వేసవి అలవెన్సులు నిలిపివేత
గతంలో ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 20 శాతం నుంచి 30 శాతం వరకు కూలీలకు అదనంగా వేసవి అలవెన్సును అందించేవారు. వేసవిలో నేల గట్టిగా ఉండటం వల్ల 20 శాతం నుంచి 30 శాతం తక్కువ పనిచేసినా.. వారికి రోజువారీ వేతనం తగ్గకుండా అందేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడా అలవెన్సులను నిలిపేశారు. గతంలో ప్రతి ఏటా జనవరిలో అలవెన్సును ప్రకటించేవారు. ఇప్పుడవన్నీ నిలిపేయడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అసౌకర్యాలు
ఉపాధి పథకం నిధులు దారిమళ్లించడంతోనే రా ష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడింది. కూలీలకు సౌకర్యాల తో పాటు ఈ పథకంలో పనిచేసే సిబ్బందికి సైతం ప్ర తి నెలా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఆ శాఖ దిగజారిపోయింది. ఒకప్పుడు మెటీరియల్ నిధులను సద్వినియో గం చేసుకుని గ్రామాల్లో అన్నీ మౌలిక వసతులు కల్పనకు ఉపయోగపడిన ఉపాధి హామీ పథకం ఇప్పుడు కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించలేని దీనస్థితికి రాష్ట్రంలో చేరుకుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.