Share News

Engineering Colleges : ఇప్పుడూ అన్యాయమేనా?

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:46 AM

‘‘గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని ఆశించాం. కానీ, ఇప్పుడు కూడా అన్యాయానికే గురవుతున్నాం. గత ప్రభుత్వంలో ఎవరికైతే అయాచిత లబ్ధి చేకూరిందో ఇప్పుడు కూడా వారికే మేలు కొనసాగుతోంది’’ అంటూ ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Engineering Colleges : ఇప్పుడూ అన్యాయమేనా?

ఇంజనీరింగ్‌ కాలేజీల ఆవేదన

వైసీపీ హయాంలో కమిషన్‌

ఇచ్చిన సిఫారసులకే బాబు మొగ్గు

కనిష్ఠ ఫీజు 40 వేలకే సిఫారసు

కొన్ని కాలేజీలకే రూ.లక్షకు పైగా

గతంలోనే తప్పుబట్టిన కళాశాలలు

హైకోర్టుకూ వెళ్లిన యాజమాన్యాలు

జగన్‌ అనుకూల కాలేజీలకు ఎక్కువ

ఫీజులు సిఫారసు చేశారని ఆరోపణ

దీనిని బాబు కూడా సరిదిద్దలేదని

ఇలా అయితే.. ఇబ్బందులేనని వెల్లడి

విచారణ కోరుతూ నారా లోకేశ్‌కు లేఖ

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): ‘‘గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని ఆశించాం. కానీ, ఇప్పుడు కూడా అన్యాయానికే గురవుతున్నాం. గత ప్రభుత్వంలో ఎవరికైతే అయాచిత లబ్ధి చేకూరిందో ఇప్పుడు కూడా వారికే మేలు కొనసాగుతోంది’’ అంటూ ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఖరారు చేసిన ఫీజులపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా కొన్ని యాజమాన్యాలు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాశాయి. గత ప్రభుత్వంలో ప్రమాణాలకు మించి ఫీజులు ఖరారు చేసిన పది కాలేజీల వివరాలను ఆ లేఖలో పేర్కొన్నాయి. ఆయా కాలేజీల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయనే విషయంపై విచారణ చేయిస్తే అసలు విషయం తెలుస్తుందని అభిప్రాయపడుతున్నాయి.

ఏం జరిగింది?

ఉన్నత విద్యాకోర్సులకు సంబంధించి ప్రతి మూడేళ్లకోసారి ఫీజులు ఖరారు చేస్తారు. 2023-24 నుంచి 2025-26 విద్యాసంవత్సరం వరకు మూడేళ్లకు గతేడాది ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. కాలేజీల్లో ప్రమాణాలను అధ్యయనం చేసిన ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌... ఫీజులు సిఫారసు చేసింది. ఇంజనీరింగ్‌ కోర్సులకు కనీస ఫీజు రూ.45 వేలు, గరిష్ఠ ఫీజు రూ.1.05 లక్షలుగా ఉండాలని పేర్కొంది. ఈ సిఫారసులను అప్పటి ప్రభుత్వం ఆమోదించకుండా తిప్పి పంపింది. కనీస ఫీజును తగ్గించాలని ఒత్తిడి చేసింది. ప్రభుత్వ ఒత్తిడితో కనీస ఫీజును రూ.40 వేలకు తగ్గించారు. గరిష్ఠ ఫీజును మాత్రం అలానే ఉంచారు. అయితే అప్పట్లో ఫీజులపై వైసీపీ ప్రభావం ఉందన్న ఆరోపణలున్నాయి. కమిషన్‌ చైర్మన్‌ పారదర్శకంగా ఫీజులు ఖరారు చేయాలని ఎంత ప్రయత్నించినా కొందరు తప్పుదారి పట్టించారన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కమిషన్‌కు ఆడిటర్‌గా వ్యవహరించిన వ్యక్తి ఖర్చులపై తప్పుడు నివేదికలు సమర్పించి.. కొన్ని కాలేజీలకు ఎక్కువ ఫీజులు వచ్చేలా, వైసీపీకి అనుకూలంగా లేని కాలేజీలకు తక్కువ ఫీజులు వచ్చేలా చేశారని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఫీజులు సరిగా లేవంటూ గతేడాదే యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లాయి. కమిషన్‌కు ఫీజులు ఖరారు చేసే అధికారమే లేదని వాదించాయి. ఈ నేపథ్యంలో అడ్మిషన్లు జాప్యం కాకూడదనే హైకోర్టు ఆదేశాల మేరకు 2023-24 ఏడాదికి అంతకుముందున్న ఫీజులపై 10 శాతం చొప్పున పెంచి అమలుచేశారు. దీంతో కనీస ఫీజు రూ.38,500.. గరిష్ఠ ఫీజులు రూ.77,000 అయ్యాయి.


గత సిఫారసులే ప్రామాణికంగా!

గత ప్రభుత్వంలో కమిషన్‌ సిఫారసు చేసిన ఫీజులు సక్రమంగా లేవని కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అయితే.. ఇప్పుడు కూటమి సర్కారు కూడా గత సిఫారసులనే ఆమోదించింది. తొలుత సిఫారసు చేసినట్లు కనీస ఫీజు రూ.45 వేలుగా కాకుండా, ప్రభుత్వ ఒత్తిడి అనంతరం మార్చిన రూ.40 వేలను ప్రామాణికంగా తీసుకుంది. ఆ ఫీజులను ఖరారు చేస్తున్నట్లు రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 108 కళాశాలలకు కనీస ఫీజు రూ.40 వేలు మాత్రమే దక్కనుంది. మొత్తం కాలేజీలు 210లో ఇవి సగం కంటే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కొత్త ఫీజుల ఖరారుకు అధ్యయనం చేసే సమయం లేదనుకుంటే 10శాతం పెంపునే పరిగణనలోకి తీసుకుని, వచ్చే ఏడాదికి కొత్త ఫీజులపై అధ్యయనం చేయాల్సిందని యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. తాజా నిర్ణయం వల్ల గత ప్రభుత్వంలో ఐదేళ్లు నష్టపోయిన తాము ఈ ప్రభుత్వంలో తొలి రెండేళ్లు నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

అనుకూల కాలేజీలకు పెంచేశారు!

తాజాగా మంత్రి నారా లోకేశ్‌కు రాసిన లేఖలో యాజమాన్యాలు 10 కాలేజీల ఫీజులను వివరించాయి. కాలేజీ ఖర్చు ఎంత చేస్తుంది? అనే అంశం ఆధారంగా ఫీజులు సిఫారసు చేస్తున్నారు. అలాగే ఆయా కాలేజీలకు న్యాక్‌ గుర్తింపు, అందులో ర్యాంకు స్థాయిలను కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ వీటితో సంబంధం లేకుండా ఫీజులు సిఫారసు చేశారనేది యాజమాన్యాల ఆరోపణ. ఉదాహరణకు తిరుపతిలో వైసీపీకి అనుకూలంగా ఉండే ఓ కాలేజీకి రూ.60,600, పలమనేరులో ఓ కాలేజీకి రూ.57,200, చిత్తూరులో ఓ కాలేజీకి రూ.71,200గా ఫీజులు నిర్ణయించారు. ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నా అనేక కాలేజీలకు రూ.50 వేలకు పైగానే ఫీజులున్నాయి. గతంలో అన్యాయం జరిగిందనే న్యాయస్థానానికి వెళ్లామని, ఇప్పుడు మళ్లీ వాటినే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏముందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Jul 11 , 2024 | 04:46 AM