AP News: 4 లక్షల మంది వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ!
ABN , Publish Date - Sep 25 , 2024 | 07:35 AM
భారీ వర్షాలు, వరద బాధితులకు అందించే సాయంపై ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం అందజేయనుంది.
అమరావతి: భారీ వర్షాలు, వరద బాధితులకు అందించే సాయంపై ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం అందజేయనుంది. విజయవాడ పరిధిలోనే సుమారు లక్షన్నర మంది ముంపు బారినపడ్డారు. బాధితులకు సాయం కింద సుమారు రూ. 600 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బండ్లు, వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువుల నష్టాలకు కూటమి సర్కారు ఆర్థిక సాయం అందించనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం అందించనుంది.
ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ప్రభుత్వం సాయం అందించనుంది. ఇక ముంపు ప్రాంతాల్లో రూ.180 కోట్ల మేర బ్యాంక్ రుణాలను రీ షెడ్యూల్ చేయనుంది. ఎన్యూమరేషన్‌లో ఎవరి పేర్లైనా తప్పిపోతే.. నిబంధనల ప్రకారం వారికి కూడా ఆర్థిక ప్యాకేజీ అందివ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ (బుధవారం) ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు సాయం అందించనున్నారు. ఇక వరద బాధిత కుటుంబాలకు నేడు (బుధవారం) నష్ట పరిహారాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. నేరుగా బ్యాంక్ ఖాత్తాలోనే జమ చేయనుంది. ఇందుకు సంబంధించిన నగదు బదిలీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
విజయవాడ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సాయం అందనుంది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25 వేలు నగదు సాయం ప్రభుత్వ ఇవ్వనుంది. మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండే వారికి రూ.10 వేలు నగదు జమ చేయనుంది. దుకాణాలు ధ్వంసమైన వారికి రూ.25 వేలు, పంటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించనుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ఇళ్లకు రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం అందించనుంది. చరిత్రలో కనీవిని ఎరుగని ప్యాకేజీని కూటమి సర్కార్ ప్రకటించి అందిస్తుండడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.