Share News

బాబు వచ్చినా ‘మారలేదు’!

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:27 AM

2019లో జగన్‌ అధికారంలోకి రాగానే... చంద్రబాబు హయాంలో కీలక పోస్టింగుల్లో ఉన్న వారందరినీ పక్కన పడేశారు.

బాబు వచ్చినా ‘మారలేదు’!

ఐఏఎస్‌ పోస్టింగ్‌ల తీరుపై సర్వత్రా విస్మయం

జగన్‌తో అంటకాగిన వాళ్లకే మళ్లీ అందలం

ఐదేళ్లు అష్టకష్టాలు పడిన

వాళ్లకు దక్కని న్యాయం

గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో సాయిప్రసాద్‌

ఇప్పుడు ఆయనకే జల వనరుల శాఖ అప్పగింత

బాబును విమర్శించిన ప్రద్యుమ్నకే పేషీలో చోటు

సాయిరెడ్డి చెప్పినట్టల్లా విన్న సృజనకు ఎన్టీఆర్‌ జిల్లా

జవహర్‌రెడ్డికి అసైన్డ్‌ అప్పగించిన నాగలక్ష్మికి గుంటూరు

పెద్దిరెడ్డి సన్నిహితులందరికీ నేడూ మంచి పోస్టులు

విపక్షంలో ఉండగా చేసిన హెచ్చరికలు ఉత్తుత్తివేనా?

లోకేశ్‌ ‘రెడ్‌బుక్‌’లో రాతలు చెరిగిపోయాయా?

‘‘జగన్మోహన్‌ రెడ్డి స్వార్థానికి, ధనదాహానికి కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తాం. అలాంటి అధికారుల ఆట కట్టిస్తాం!’’

...ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన ప్రకటనలు, జారీ చేసిన హెచ్చరికలు!

...సీన్‌ కట్‌ చేస్తే

ఎన్నికల ఫలితాలు వచ్చి నెల

రోజులైనా... కొత్త సర్కారు కొలువుదీరి 20 రోజులు దాటినా పరిస్థితి మారలేదు. జగన్‌ సర్కారుతో అంటకాగిన అధికారులు అందలం

వీడలేదు. పైగా... వైసీపీకి

అడు గులకు మడుగులొత్తి, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వారిని పిలిచి చక్కటి

పోస్టింగులు ఇచ్చేస్తున్నారు.

ఈ చిత్రంపై బ్యూరోక్రాట్లలోనే తీవ్రమైన విస్మయం, అసంతృప్తి వ్యక్తమవుతోంది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

2019లో జగన్‌ అధికారంలోకి రాగానే... చంద్రబాబు హయాంలో కీలక పోస్టింగుల్లో ఉన్న వారందరినీ పక్కన పడేశారు. జిల్లా స్థాయిలో ఎస్పీలు, కలెక్టర్లతో మొదలుకుని రాష్ట్రస్థాయిలో కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. చివరికి... తటస్థంగా వ్యవహరిస్తూ, పద్ధతిగా పని చేసిన వారినీ జగన్‌ పక్కనపెట్టేశారు. ‘వీళ్లంతా టీడీపీ’ అనే ముద్ర వేసి అప్రాధాన్య పోస్టుల్లోకి నెట్టేశారు. ఆ అధికారులను ముప్పుతిప్పలు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే ఐదేళ్లపాటు ఈ అధికారులంతా తీవ్ర అసంతృప్తి,మనోవేదన అనుభవించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తమకు మంచి రోజులు వస్తాయని, పని చేసే ప్రభుత్వంలో భాగస్వాములై సామర్థ్యం నిరూపించుకుందామని ఎదురు చూస్తున్న చాలామంది అధికారులకు ఇప్పటికీ నిరాశే మిగిలింది.

మాటలకే పరిమితమా...

‘తప్పుడు అధికారుల లెక్క తేలుస్తాం’ అని చంద్రబాబు... ‘రెడ్‌ బుక్‌’ అంటూ లోకేశ్‌ ఎన్నికల ముందు ప్రదర్శించిన ఆవేశానికి అర్థముంది. ఎందుకంటే జగన్‌ హయాంలో అనేకమంది అధికారులు ‘బ్లూ’ రంగు పులుముకుని మరీ పని చేశారు. ‘వైసీపీ చెప్పిందే వేదం’ అన్నట్లుగా వ్యవహరించారు. పనిలోపనిగా తామూ విచ్చలవిడిగా అవినీతి చేసి... కోట్లు పోగేసుకున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వీరందరి పని పడతారని, లెక్కలు తేలుస్తారని అంతా భావించారు. కానీ... అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేశ్‌ మాటలన్నీ ‘గెలుపు హోరు’లో కొట్టుకుపోయాయి. ముగ్గురు, నలుగురు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా నిలిపి ఉంచడం మినహా జరిగిందేమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితులు పరిశీలిస్తే జరగబోయేది కూడా ఏమీ లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే... కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జరగకూడదని అందరూ భావించారో అదే జరుగుతోంది. చంద్రబాబు చుట్టూ కొంత మంది చేరిపోయి వారికి కావాల్సిన అధికారులకు కీలకమైన స్థానాల్లో పోస్టింగ్‌లు వచ్చేలా లాబీయింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజాయితీగా పని చేసిన వారిపై కూడా చిన్నచిన్న వంకలు చూపించి పోస్టింగ్‌లు రానివ్వకుండా తొక్కిపెడుతున్నారు. జగన్‌ హయాంలో తీవ్ర ఒత్తిళ్ల మధ్య పనిచేసి, తటస్థంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు కనీసం చంద్రబాబును కలిసి తమ పరిస్థితి వివరించాలనుకున్నా కుదరడంలేదు. ఇలాంటి వాళ్లను సీఎంవో దరిదాపుల్లోకి కూడా రాకుండా అడ్డుకుంటున్నారు.


ఎంత చిత్రమో...

చంద్రబాబు పేషీలోని అధికారులందరినీ పక్కన పెట్టిన జగన్‌... సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సాయిప్రసాద్‌కు మాత్రం ప్రాధాన్యమిచ్చారు. సీసీఎల్‌ఏతోపాటు రెవెన్యూ స్పెషల్‌ సీఎ్‌సగా చాలాకాలం పని చేశారు. ఒకే అధికారికి రెండు అత్యంత కీలక పోస్టులను ఇచ్చారంటేనే... జగన్‌ ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. సాయిప్రసాద్‌ వ్యవహార శైలిపై వచ్చిన ఆరోపణలు అన్నీఇన్నీ కావు. అత్యంత చిత్రంగా... చంద్రబాబు కూడా సాయి ప్రసాద్‌కు పిలిచి పీఠం ఎక్కించారు. ఆయనకు అత్యంత కీలకమైన సాగునీటి శాఖను అప్పగించారు. ఇదే ఒక పెద్ద చిత్రం కాగా... ఆయన నిత్యం సీఎంవోకు వెళ్లి మేనిఫెస్టోలు ఎలా అమలుచేయాలి.. ఏం చేస్తే బాగుంటుందంటూ సలహాలూ సూచనలూ ఇస్తున్నారు.

ఇంకెవరూ లేనట్లు... ప్రద్యుమ్న

2019 ఎన్నికల ముందు తన వద్దకు వచ్చిన చంద్రబాబునే వెయిటింగ్‌లో పెట్టి, ఆ తర్వాత జగన్‌ సర్కారుతో అంటకాగి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న గోపాలకృష్ణ ద్వివేదికి ఇప్పుడు చంద్రబాబు కార్మిక శాఖ అప్పగించారు. దీనిపై తీవ్ర విమర్శలు తలెత్తడంతో... కొన్నాళ్లకు పక్కన పెట్టారు. కానీ... మరో అధికారి ప్రద్యుమ్న కథే వేరు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో సీఎంవోలో జాయింట్‌ సెక్రటరీగా, చిత్తూరు కలెక్టర్‌గా పని చేశాు. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం ఆయన్ని మరో విధంగా ఉపయోగించుకుంది. ఐఏఎస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ హోదాలో... చంద్రబాబుపైనే ప్రద్యుమ్న విమర్శలు గుప్పించారు. ఆయన సతీమణి శిల్ప వైసీపీ లీగల్‌ సెల్‌లో భాగస్వామి. ఇప్పుడు అదే ప్రద్యుమ్న బాబుపేషీలో కీలక అధికారిగా చేరిపోయారు.

తిట్టిన వాళ్లకే దీవెనలు...

బుడితి రాజశేఖర్‌ గత ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో పాఠశాలల విలీనంపై వివాదాస్పదమైన జీవో 117 జారీ చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు గగ్గోలు పెట్టినా... జీవో రద్దు చేసేది లేదంటూ హేళనగా మాట్లాడారు. 2014-19 మధ్య చంద్రబాబునూ లెక్క చేయకుండా మాట్లాడేవారు. అప్పట్లో పౌరసరఫరాల శాఖలో ఉన్న రాజశేఖర్‌... ‘ఏది పడితే ఆ నిర్ణయం తీసుకుంటే డబ్బులు చంద్రబాబు ఇస్తారా? మీడియా వాళ్లు ఇస్తారా?’’ అని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అలాంటి అధికారిని చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

పోస్టింగ్‌ల్లో లాబీయింగ్‌లు..

విజయనగరం కలెక్టర్‌ నాగలక్ష్మికి కీలకమైన గుంటూరు కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించడం, కర్నూలు కలెక్టర్‌గా ఉన్న సృజనను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించడంపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాగలక్ష్మి విజయనగరం కలెక్టర్‌గా ఉండగా... భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టు పక్కల అసైన్డ్‌ ల్యాండ్స్‌ను అప్పటి సీఎస్‌ జవహర్‌ రెడ్డితో ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. ఇక... సృజన జగన్‌ హయాంలో ఒక వెలుగు వెలిగారు. విశాఖ కమిషనర్‌గా ఉండగా వైసీపీ ఎంపీ విజయసాయి చెప్పినవన్నీ చేసేశారు. అక్కడ జరిగిన ‘రాజకీయ కక్షసాధింపు’ కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించారు. ఆమెను చంద్రబాబు.....రాష్ట్ర రాజధానిలాంటి విజయవాడ కేంద్రంగా ఉండే ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ను చేశారు. ఈస్థానంలోని ఢిల్లీరావుపై ఎలాంటి విమర్శలూ, ఆరోపణలూ లేవు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆయనను పక్కనపెట్టేసి...కనీసం పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. దీనికి కారణాలేమిటో కూడా లేదు.


లెక్కతేల్చడం ఇదేనా...

ప్రజా వేదిక కూల్చాలని ఆదేశించిందే తడవుగా దగ్గరుండి మరీ ఆ పని చేసి... ఎప్పటికప్పుడు జగన్‌కు రిపోర్టు ఇచ్చిన అప్పటి సీఆర్డీయే అదనపు కమిషనర్‌ విజయను చంద్రబాబు ప్రభుత్వం అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా నియమించి సత్కరించింది.

ప్రజావేదిక కూల్చివేతను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన నాటి డిప్యూటీ కలెక్టర్‌ వీరబ్రహ్మాన్ని జగన్‌ ఆ తర్వాత కీలకమైన టీటీడీ జేఈవోగా నియమించారు. అధికారంలోకి వచ్చి నెలరోజులైనా చంద్రబాబు ప్రభుత్వం వీరబ్రహ్మాన్ని అదే స్థానంలో కొనసాగిస్తోంది.

ఐఏఎస్‌ కృష్ణబాబు ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి హోదాలో తాడేపల్లి ప్యాలె్‌సకు భారీగా ప్రజాధనాన్ని ఖర్చుపెట్టారు. బడ్జెట్‌తో సంబంధంలేకుండా ఆ బిల్లులు మంజూరు చేయించారు. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం ఆయనకు వైద్య ఆరోగ్యశాఖ అప్పగించింది. కృష్ణబాబు ఇప్పటికీ అదే శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను మరో ఏడాది అక్కడే కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉండడం గమనార్హం.

గత ప్రభుత్వంలో మిషన్‌ బిల్డ్‌ ఏపీ, ఏపీఐఐసీ ఎండీ వంటి కీలక విభాగాల్లో పని చేసిన ప్రవీణ్‌ కుమార్‌కు గనుల శాఖ డైరెక్టర్‌, ఏపీఎండీసీ ఎండీగా బాధ్యతలు అప్పగించింది. ఆయనను తిరుపతి కలెక్టర్‌గా తొలగించి మంచి నిర్ణయం తీసుకుందనేలోపే గనుల శాఖను అప్పగించేశారు.

రైతులకు ఇచ్చే పట్టాలపై జగన్‌ ఫొటోలు ముద్రించి, ఆయనను ప్రసన్నం చేసుకున్న అధికారి సిద్ధార్థ జైన్‌! సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మలు చెక్కించిన ఘనత కూడా ఆయనదే. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని కేంద్రం పలుసార్లు తిరస్కరించినా... ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్‌ చేసి మరీ ఆమోద ముద్ర పొందారు. అలాంటి అధికారికి ప్రభుత్వం కీలకమైన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది.

నారాయణపై పగపట్టినా...

గత ప్రభుత్వంలో పాఠశాల విద్య కమిషనర్‌గా ఉన్న సురేశ్‌ కుమార్‌ అప్పటి ప్రభుత్వం ఏం చెబితే అది గుడ్డిగా అమలు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో నారాయణ విద్యా సంస్థల అధినేత, ప్రస్తుత మంత్రి నారాయణపై తీవ్ర అభియోగాలు మోపారు. ఇప్పుడు అదే సురేశ్‌ కుమార్‌ను చంద్రబాబు ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్‌ సెక్రటరీగా నియమించింది. ఆయన ఇతర ఐఏఎ్‌సలపై చంద్రబాబుకు నివేదికలు ఇస్తున్నారు. ఇందులోనూ గోల్‌మాల్‌ చేస్తున్నారని... జగన్‌ ప్రభుత్వానికి వత్తాసు పలికిన ఐఏఎ్‌సలకు కీలక పోస్టులు దక్కేలా రిపోర్టులు ఇస్తున్నారని తెలుస్తోంది.

పెద్దిరెడ్డితో అంటకాగినా...

ఐఏఎస్‌ అధికారి షణ్మోహన్‌ది మరో కథ. చిత్తూరు కలెక్టర్‌గా పెద్దిరెడ్డి చెప్పిందల్లా చేశారు. కొత్త ప్రభుత్వంలో ఆయనకు పోస్టింగ్‌ కూడా దక్కదని అంతా భావించారు. కానీ... ఆయనకు కాకినాడ కలెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. తిరుపతి కలెక్టర్‌గా బదిలీ అయిన వెంకటేశ్వర్‌ కూడా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడే. ఉమ్మడి చిత్తూరు జిల్లా హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌గా ఆయన 928 ఎకరాల వివాదాస్పద భూములను సింగిల్‌ సంతకంతో పెద్దిరెడ్డికి ధారాదత్తం చేశారన్న ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తికి చంద్రబాబు తిరుపతి కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు.

Updated Date - Jul 06 , 2024 | 04:32 AM