Share News

1న ఇంటింటికీ పింఛన్‌ అందాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:08 AM

ఈ ఒకటో తారీఖున ఇంటింటికీ సామాజిక పింఛన్లు తీసుకెళ్లి ఇవ్వకుంటే దాని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నట్లేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

1న ఇంటింటికీ పింఛన్‌ అందాలి

లేదంటే అది ప్రభుత్వ కుట్రే: పవన్‌

సీఎస్‌, డీజీపీ అడ్డంకులు సృష్టించకుంటే పెన్షన్‌ ఇంటికే చేరుతుంది

వైసీపీ రేబిస్‌ సోకిన కుక్క

ఎవరిని పడితే వారిని కరుస్తోంది

జగన్‌ అవినీతి మాకెందుకని జనం అనుకుంటే పొరపాటే

ఐదేళ్లలో సొంత పత్రికకు రూ.930 కోట్లు దోచిపెట్టాడు

ఆయన వద్ద లక్ష కోట్లు

అదంతా ప్రజలదే

సజ్జలా.. చిరంజీవి గురించి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు

జనసేనాని హెచ్చరిక

పిఠాపురంలో నామినేషన్‌

ఉప్పాడలో భారీ బహిరంగ సభ

కాకినాడ-ఆంధ్రజ్యోతి/పిఠాపురం, ఏప్రిల్‌ 23: ఈ ఒకటో తారీఖున ఇంటింటికీ సామాజిక పింఛన్లు తీసుకెళ్లి ఇవ్వకుంటే దాని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నట్లేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, ఇతర అధికారులు అడ్డంకులు సృష్టించకుంటే పింఛన్‌ ఇంటికే చేరుతుందన్నారు. వైసీపీ రేబిస్‌ సోకిన కుక్క. రాష్ట్రంలో అది ఎవరిని పడితే వారిని కరుస్తోందని నిప్పులు చెరిగారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా ఆయన మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాత్రికి ఉప్పాడ బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్‌ వద్ద లక్ష కోట్లు ఉన్నాయని, అదంతా ప్రజల డబ్బేనన్నారు. మత్స్యకారులు కష్టాలు పడుతున్నా పట్టించుకోని సీఎం.. తన పత్రికకు ఐదేళ్లలో రూ.930 కోట్లు దోచిపెట్టారని మండిపడ్డారు.ఈ ఎన్నికలు రాష్ట్రానికే కాదు.. భావి తరాలకు ఎంతో కీలకమైనవని.. అందుకోసమే టీడీపీ, బీజేపీలతో కలిసి వెళ్తున్నామన్నారు. మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం లాంటి 40 నియోజకవర్గాల్లో బలమైన ప్రజానాయకులు పార్టీలో ఉన్నా.. పొత్తు కారణంగా విరమించుకోవలసి వచ్చిందన్నారు. ఇంకా ఏమన్నారంటే.

వైసీపీ కట్లపాము..

వైసీపీ కట్లపాములాంటిది. తన గుడ్లు తనే తినేస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా వదిలేసింది. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎస్‌ఈజెడ్‌లు. కాకినాడ సెజ్‌ కోసం నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పది వేల ఎకరాలు లాక్కున్నారు. ఇంతవరకు అందులో పరిశ్రమలు రాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి రైతుకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటా. ఉప్పాడలో మత్స్యకారుల కోసం హార్బర్‌ నిర్మించడానికి రూ.422 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. జగన్‌ తన సొంతపత్రికకు ఐదేళ్లలో రూ.930 కోట్లు మళ్లించారు. ఇదంతా ఎవరి డబ్బు? మత్స్యకారుల బతుకులపై కొట్టారు.

మీ ఇంట్లో జరగవని అనుకోవద్దు..

జగన్‌ తన సొంత చెల్లిని కూడా వదల్లేదు. సోషల్‌ మీడియాలో ఆ పార్టీ నేతలు ఆమెపై రకరకాల బురదజల్లారు. చంద్రబాబు భార్యను తిట్టారు. రాజకీయాల్లో లేని నా భార్యనూ ఆడిపోసుకుంటున్నారు. ఇదంతా చూసి నవ్వుకుంటే వైసీపీ వాళ్లు భవిష్యత్‌లో మీ ఇంటికి కూడా వస్తారు. అటువంటివి మీ ఇంట్లో జరగవని అనుకోకండి. ఇప్పటికే రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. అందుకే ఆడపడుచులంతా ఆలోచించాలి. వైసీపీని అంతమొందించాలి. జగన్‌ మాట్లాడితే నా భార్యను తిడుతున్నారు. నాలుగు పెళ్లిళ్లు అంటున్నారు. ఆయనకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకు పెళ్లిళ్లు అయ్యాయి. కాదనలేదు. కొన్ని జీవితాలకు కుదరదంతే. విడిపోయాం. ఒకరు వేరే పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కన్నది. వాళ్లంతా గుట్టుగా బతుకుతున్నారు. కానీ పెళ్లాలు అని తిడుతున్నారు. మేం మాత్రం ముఖ్యమంత్రి భార్యను గౌరవంగా పిలుస్తున్నాం.

ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరు

చంద్రబాబును అకారణంగా జైల్లో పెట్టారు. అప్పుడు చాలా ఆలోచించి కూటమి పురుడుపోసుకునేలా చేశాను. రాష్ట్రంలో ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరు అందేలా కూటమి తరఫున ఎజెండాగా నిర్ణయించుకున్నాం. మాట్లాడితే బటన్‌ నొక్కానని జగన్‌ అంటున్నారు. ఆయనేమన్నా తన తాతది తెచ్చి పంచుతున్నారా? మేం వచ్చాక పోలవరం పూర్తిచేస్తాం. డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. అదీ అమలుచేస్తాం. అన్న క్యాంటీన్లకు తోడు డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు తెరు స్తాం. బీసీలకు రిజర్వేషన్లు 24 శాతం నుంచి 34 శాతం వరకు పెంచు తాం. మత్స్యకారులకు వేట నిషేధ పరిహారం పెంచుతాం. వేటకు వెళ్లి చనిపోయిన వారికి త్వరగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యేలా చేస్తాం. రాయితీపై వలలు, ఇంజన్లు అందిస్తాం. కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తాం.

సజ్జలది ఆధిపత్యపు అహంకారం..

ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఆధిపత్యపు అహంకారం ఎక్కువైంది. దేశం గర్వించదగ్గ అవార్డులు తీసుకున్న చిరంజీవిని ఆయన తిట్టారు. చిరంజీవి జోలికి రావొద్దు. ఆయన గురించి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు. మీలాంటి గూండాలను చాలామందిని చూశాను.

భారీ ర్యాలీతో పిఠాపురంలో నామినేషన్‌

పిఠాపురం జనసేన అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్‌ దాఖలు చేశారు. పిఠాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి రామసుందరరెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అంతకుముందు చేబ్రోలు నివాసం నుంచి భారీ ర్యాలీతో గొల్లప్రోలు, పిఠాపురం పట్టణాల మీదుగా ఆయన తరలివచ్చారు. 216వ జాతీయ రహదారితోపాటు పట్టణాల రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ, బీజేపీ ఇన్‌చార్జి బుర్రా కృష్ణంరాజు, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌, కె.నాగబాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 04:08 AM