Share News

సర్వం స్వాహా!

ABN , Publish Date - Jul 15 , 2024 | 05:36 AM

సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

సర్వం స్వాహా!

జగన్‌ ఏలుబడిలో అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ

అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించారు. పారదర్శకతకు పాతరేశారు. కనిపించిందల్లా దోచుకున్నారు. గత ఐదేళ్ల జగన్‌ సర్కారులో సహజ వనరులను చెరపట్టి దోపిడీ చేశారు. గనుల శాఖలో జరిగిన ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కూటమి సర్కారును గనుల శాఖ కోరనుంది. అలాగే గత వైసీపీ పాలకులు, బంధువులు, అధికారులు విశాఖ, విజయనగరం పరిధిలో విలువైన భూములు దోచుకున్నారు. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. మరి నాటి భూదందాలను కూటమి సర్కారు నిగ్గుతేలుస్తుందా?

గనుల అక్రమాలే 19,000 కోట్లు!

కేవలం ఐదారు అంశాల్లోనే ఈ నష్టం

గనుల శాఖ ప్రాథమిక అంచనా

ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నెన్నో

జగన్‌ అసమర్థ పాలనతో నష్టం

అంతులేని పర్యావరణ విధ్వంసం

సమగ్ర విచారణ జరిపించాలని

చంద్రబాబును కోరనున్న గనుల శాఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సమర్పించేందుకు గనుల శాఖ నివేదికను తయారు చేసింది. అందులో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. ‘జగన్‌ ఏలుబడిలో గనుల తవ్వకాలు, అమ్మకాల్లో అంతులేని దోపిడీ జరిగింది. ఖనిజాల తవ్వకాలకు ఇచ్చే పర్మిట్లు, రవాణా, ఇతర వ్యవహారాల్లో అంతుచిక్కని అనేకానేక అక్రమాలున్నాయి. కేవలం ఐదారు అంశాలను ప్రాథమికంగా పరిశీలన చేస్తేనే గత ఐదేళ్ల కాలంలో 19 వేల కోట్లపైనే అక్రమాలు జరిగాయి. ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి గనుల శాఖలో జరిగిన అక్రమాలు, ఘోరాలపై సమగ్ర విచారణ జరగాలి’ అని గనుల శాఖ నివేదించనుంది. చంద్రబాబు వద్ద జరిగే సమావేశంలో... జగన్‌ హయాం నాటి అక్రమాలను నిగ్గుతేల్చడానికి సమగ్ర విచారణ చేయించాలని గనుల శాఖ ప్రధాన డిమాండ్‌గా ఉంచనుంది. సీఐడీ విచరణా లేక విజిలెన్స్‌తోనా అన్నది ప్రభుత్వ నిర్ణయానికే వదిలేయనున్నది. విచారణ మాత్రం జరిగి తీరాలని, అప్పుడే అసలైన అక్రమాలు, ఘోరాలు బయటికి వస్తాయని ఆ శాఖ సీఎంను కోరనుంది. గనుల శాఖ తయారు చేసిన నివేదికలో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. 2019-24 మధ్యకాలంలో జగన్‌ పాలనలో సమర్థులు, నైపుణ్యం ఉన్నవారిని కాకుండా అస్మదీయులను తీసుకొచ్చి గనుల శాఖ డైరెక్టర్‌ గా నియమించడం మొదలు, అనేక అక్రమాలు, అవినీతి బాగోతాలు గనుల శాఖలో జరిగిపోయాయి. ఫలితంగా 19,137 కోట్ల అక్రమాలు జరిగాయని గనుల శాఖ చెబుతోంది. అసమర్థ పరిపాలన వల్ల ఐదేళ్లలో 9,750 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ శాఖ చెబుతోంది. 2016 నుంచి అమల్లో ఉన్న ఉచిత పాలసీని రద్దు చేయడం, అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల సర్కారుకు 6,940 కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక అమలైనప్పుడు రీచ్‌లో టన్ను ఇసుక 75 రూపాయలు ఉంటే... జగన్‌ సర్కారు తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీలో దాన్ని రూ.475 చేశారని, ఆచరణలో టన్నుకు వెయ్యి రూపాయలపైనే వసూలు చేశారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

పర్యావరణ విధ్వంసం ఎంతెంతో...

గత ఐదేళ్లలో ఇసుక, ఇతర ఖనిజాల తవ్వకాల్లో పెద్దఎత్తున పర్యావరణ విధ్వంసం జరిగిందని గనుల శాఖ సీఎంకు నివేదించనుంది. ఇసుక తవ్వకాల్లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని నివేదికలో పేర్కొంది. చ ట్టవిరుద్ధమైన తవ్వకాలు నిలిపివేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని జాతీయ హరి త ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ), హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరించాయని నిర్ధారించింది.

గనుల శాఖ అంచనా ప్రకారం ఐదేళ్ల నష్టం లెక్క

కేటగిరీ నష్టం (రూ.కోట్లలో)

అసమర్థ ఖనిజ నిర్వహణ పాలన 9750

ఉచిత ఇసుకను రద్దు చేసి అడ్డగోలు దందా 6940

ఇసుక కాంట్రాక్టర్లు చె ల్లించ ని బకాయిలు 1167

మినరల్‌ పర్మిట్లను ఔట్‌సోర్సింగ్‌ ఇవ్వడం వల్ల 1000

సీనరేజీ కాంట్రాక్టర్లు చెల్లించని బకాయిలు 280

మొత్తం నష్టం 19,137

Updated Date - Jul 15 , 2024 | 05:52 AM