Share News

వెల్లివిరిసిన చైతన్యం

ABN , Publish Date - May 14 , 2024 | 01:41 AM

ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

వెల్లివిరిసిన చైతన్యం
మంత్రాల‌యంలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు

పోలింగ్‌ ప్రశాంతం

పలు కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు

పట్టణ ఓటర్లలో నిర్లిప్తత.... పల్లెల్లో హుషారు

కొన్ని ప్రాంతాల్లో నేతల మధ్య తోపులాటలు

చెదురుముదరు ఘటనలు మినహా ప్రశాంతం

ఆదోని/ఎమ్మిగనూరు/మంత్రాలయం/పత్తికొండ/ఆలూరు, మే 13: ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో 6 గంటలలోపు కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఆపై సమయంలో కూడా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. ఓటర్లు ఇచ్చిన తీర్పుతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. జూన్‌ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓటర్ల అభ్యర్థన కార్యక్రమాలు, ప్రచారాలతో ఆలసిన అభ్యర్థులు.. 21 రోజులు రిలాక్స్‌ అవుతున్నారు. చాలా మందికి వారి నివాసిత ప్రాంతంలో కంటే దూరంలో ఓటర్లుగా నమోదు కావడం, పోలింగ్‌ సెంటర్లకు వెళ్లిన కొందరు ఓటు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. చెదురు ముదురు సంఘటనలు మినహా మొత్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇక అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేశారు. పోలింగ్‌ సెంటర్లలోకి సెల్‌ఫోన్‌లను అనుమతించలేదు. దీంతో ఓటర్లు వాటిని బయటే పెట్టి సెంటర్‌లోకి వెళ్లారు.

ఎమ్మిగనూరులో 79.85 శాతం పోలింగ్‌ : నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు పట్టణం, మండలం, నందవరం, గోనెగండ్ల మండలాల్లో పోలింగ్‌ ప్రశాంగా ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. నియోజకవర్గంలో మొత్తం 2,47,752 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు వేసేందుకు 272 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 79.85 శాతం ఓట్లు నమోదయ్యాయి. టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పట్టణంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు

పత్తికొండ నియోజకవర్గంలో 79.10 శాతం పోలింగ్‌ : నియోజకవర్గంలో మొత్తం 5మండలాలు ఉండగా 2,23,603 మంది ఓటర్లు ఉన్నారు. 255 పోలింగ్‌కేంద్రాలు ఉండగా 27 రూట్లను ఏర్పాటుచేసి అధికారులు ఎన్నికలను పర్యవేక్షించారు. నియోజకవర్గపరిధిలో మొత్తం 79.10 శాతం పోలింగ్‌నమోదు అయిందని ఆర్‌వో రామలక్ష్మి తెలిపారు. వెల్దుర్థి మండలం మల్లెపల్లె గ్రామంలో టీడీపీ మద్దతుదారుడు భాష్యంరాజుపై వైసీపీ కార్యకర్తలు ఐదుగురు దాడిచేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రాలయం నియోజకవర్గంలో 82.50 శాతం పోలింగ్‌ : నియోజకవర్గంలో 237 పోలింగ్‌ కేంద్రాల్లో 82.50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆర్వో మురళితెలిపారు. డీఎస్పీ సీతారామయ్య పర్యవేక్షణలో ఆరుగురు సీఐలు,10 మంది ఎస్‌ఐలు, 150 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 100 మంది హోంగార్డులు, 100 మంది కేంద్ర బలగాలతో పోలిసు బందోబస్తు చేపట్టారు. 1528 మంది పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు సిబ్బందితో 19 మంది మైక్రో అబ్జర్వర్ల మధ్య పోలింగ్‌ ప్రశాంతంగా ముగిగిసింది.

ఆలూరులో 77.71 శాతం పోలింగ్‌ : నియోజకవర్గంలోని 6 మండలాల్లో మొత్తం 2,58,997 ఓట్లు ఉండగా, రాత్రి 9.30 నిమిషాల సమయానికి 2,01,265 ఓట్లు పోలైయ్యాయని, 77.71 శాతంగా నమోదు అయ్యిందని ఆలూరు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రామునాయక్‌ తెలిపారు. దేవనకొండ మండలంలో రెండు కేంద్రాల్లో పోలింగ్‌ పూర్తి కాలేదని, దీంతో పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

వైసీపీ నాయకుల దౌర్జన్యం: ఆలూరు మెయిన్‌ స్కూల్‌లో వైసీపీ మూకలు టీడీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్‌ ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గుంతకల్‌ రైల్వే డీఎస్పీ చాముండేశ్వరి, ఆలూరు సీఐ వెంకటేశ్వర్లు, తన సిబ్బందితో వచ్చి అందరినీ చెదరగొట్టి లాఠిచార్జి చేయడంతో ప్రశాంతంగా పోలింగ్‌ సాగింది.

మద్దికెరలో 94 ఏళ్ల వృద్ధురాలు ఓటు

మద్దికెర, మే 13: మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో ఊటకూరు సరోజమ్మ (94) వృద్ధురాలు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు వయోభారం మీద పడినవారికి ఇంట్లోనే ఓటు హక్కు కల్పించినప్పటికీ ఈ వృద్ధురాలు పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు వేయాలనే ఉద్దేశంతో తన కుమారుడు రిక్విత్‌ రెడ్డి సాయంతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం విశేషం.

Updated Date - May 14 , 2024 | 01:41 AM