Patamata Police Station: సాక్షి పత్రిక కథనాలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ABN , Publish Date - Oct 10 , 2024 | 07:06 PM
సాక్షి వార్త పత్రికలో ప్రచురిస్తున్న కథనాలు ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషాలు పెంచేలా ఉన్నాయని విజయవాడకు చెందిన న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ పటమట పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం ఫిర్యాదు చేశారు.
విజయవాడ, అక్టోబర్ 10: సాక్షి వార్త పత్రికలో ప్రచురిస్తున్న కథనాలు ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషాలు పెంచేలా ఉన్నాయని విజయవాడకు చెందిన న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ పటమట పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ వార్తా పత్రికలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా.. అల్లర్లను ప్రేరేపించే ఉద్దేశ్యంతో తప్పుడు వార్తలను ప్రచురించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసం సాక్షి వార్తా పత్రికలో అడ్డగోలు కథనాలు వండి వారుస్తూ.. ప్రజలను రెచ్చ కొడుతున్నారన్నారు. పూర్తి అబద్దాలు, అసత్యాలతో.. విద్వేషాలు సృష్టిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కథనాలను పరిశీలించి సాక్షి పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో న్యాయవాది లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. 2024, అక్టోబర్ 8వ తేదీన సాక్షి తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తల్లో అన్నీ అబద్దాలేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై ముందుగా చర్యలు తీసుకుంటే.. మరొకరు ఈ తప్పు చేయకుండా ఉంటారని న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రికకు చెందిన వెబ్ సైట్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఇటీవల గుర్తించి.. బహిర్గతం చేసింది. ఆ క్రమంలో సాక్షి దిన పత్రిక యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ అంశాన్ని ప్రముఖ జర్నలిస్ట్ సంఘాల నేతలు సైతం ఖండించారు. అయితే ఈ విషయంపై సాక్షి యాజమాన్యం మాత్రం తప్పు జరిగిందని స్పష్టం చేయలేదు. సరికాదా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఎదురుదాడికి దిగింది.
అంతేకాదు.. దీనిపై ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసి.. తాము ఎటువంటి తప్పు చేయలేదని బుకాయించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా భారీ వర్షాలు వరదలతో విజయవాడ మహానగరం మునిగిపోతే.. అందులో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రమేయం ఉందంటూ ఓ విధమైన వితండ వాదనకు సాక్షి మీడియా దిగింది. ఆ క్రమంలో ఆ మీడియా సంస్థ పలు ఆరోపణలు సైతం సంధించింది. ఆ క్రమంలో సాక్షి దిన పత్రికలో వచ్చిన కథనాలు.. తెలుగు ప్రజలపై తీవ్ర ప్రభావం చూసేలా ఉన్నాయంటూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పటమట పోలీసులను ఆశ్రయించారు. ఆ పత్రిక కథనాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
For AndhraPradesh News Ad Telangana News