Share News

‘టైటిల్‌’తో రైతన్నకు ఉరి!

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:06 AM

రైతుకు భూమితో విడదీయలేని అనుబంధం! అంగుళం కూడా కోల్పోవడానికి ఇష్టపడడు. ఎవరైనా వివాదం రాజేస్తే ఎంతదాకైనా పోరాటం చేసి భూమిని దక్కించుకుంటాడు.

‘టైటిల్‌’తో రైతన్నకు ఉరి!

భూ యాజమాన్య హక్కు చట్టంతో సంకటం

ఒక చట్టం... ప్రజలకు మేలు చేయాలి. అన్నీ ఆలోచించి నిబంధనలు రూపొందించాలి. మరీ ముఖ్యంగా... భూములకు సంబంధించిన చట్టాలను అత్యంత జాగ్రత్తగా చేయాలి. కానీ... జగన్‌ సర్కారు తీరే వేరు! ‘భూ యాజమాన్య హక్కు చట్టం’ పేరుతో రైతుల భూములకు ఉరి వేశారు.

మీ భూమి మీదైతే చాలదు! అన్ని పత్రాలూ ఉన్నా సరిపోదు! ఇంకెవరో మోసగాడు వచ్చి..

తప్పుడు పత్రాలు సృష్టించి మీ భూమిని తమ భూమిగా చెప్పుకొంటే చాలు! దానిపై మీకున్న అన్ని హక్కులూ పోయినట్లే! ఆ భూమిపై ‘వివాదాస్పద’ ముద్ర వేస్తారు. ‘ఈ భూమి నాదే’ అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీదే!

జగన్‌ చేసిన చట్టం ప్రకారం భూ వివాదాలపై సివిల్‌ కోర్టులూ జోక్యం చేసుకోలేవు. ‘నా భూమిని నాకు అప్పగించండి’ అని రైతులు నేరుగా కోర్టులను ఆశ్రయించలేరు. ‘పెదరాయుడు’ తరహాలో రెవెన్యూ అధికారులే ట్రైబ్యునల్‌లో తీర్పులు చెబుతారు. రాష్ట్రస్థాయి ట్రైబ్యునల్‌లోనూ న్యాయం జరగకపోతే, హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.

జగన్‌ సర్కారు నిపుణులను సంప్రదించకుండా అడ్డగోలుగా ల్యాండ్‌ టైటిల్‌ తీసుకొచ్చింది. న్యాయ నిపుణుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఇప్పటికే జగన్‌ సర్కారు చేపట్టిన భూముల రీ సర్వే వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక కొత్త చట్టం వల్ల మరెన్ని సమస్యలు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.

అడ్డగోలుగా జగన్‌ సర్కారు తయారీ

భూ హక్కులకే ఎసరు తెచ్చే ప్రమాదం

కేంద్రం వద్దన్న అంశాలు చేర్చిన వైనం

భూములపై వివాదాలు ఏర్పడితే

రైతులు కోర్టులకు వెళ్లే అవకాశం లేదు

ట్రైబ్యునల్స్‌ పేరిట రెవెన్యూకు పవర్‌

వారి దయ ఉంటేనే రైతులకు హక్కులు

అక్రమార్కులకు వంత పాడితే అంతే

హక్కులకు హైకోర్టే రైతుకు దిక్కు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రైతుకు భూమితో విడదీయలేని అనుబంధం! అంగుళం కూడా కోల్పోవడానికి ఇష్టపడడు. ఎవరైనా వివాదం రాజేస్తే ఎంతదాకైనా పోరాటం చేసి భూమిని దక్కించుకుంటాడు. ఇదీ భూమిపై రైతుకున్న సెంటిమెంట్‌. అందుకే రైతుల భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయి. ఇప్పుడున్న చట్టాలను పారదర్శకంగా, సమర్థంగా అమలు చేస్తే రైతుల కష్టాలు తీరుతాయి. అయితే, భూ వివాదాల పరిష్కారానికి భూముల సమగ్ర సర్వే చేపడతానని, 100 ఏళ్ల తర్వాత చాలా గొప్ప పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. భూముల సర్వే పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్‌ టైటిల్‌) తీసుకొస్తామన్నారు. కానీ భూముల సర్వే పూర్తికాకముందే సర్కారు టైటిల్‌ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. ఆ చట్టం రైతుల భూములకు ఉరివేసేలా ఉంది. భూమిపై పట్టాదారు పాసుపుస్తకాలు, ఆర్‌ఓఆర్‌, 1బీ, ఇతర రికార్డులు రైతు పేరిటే ఉన్నా, అవి నిజమైనవేనని నిరూపించుకోవాలి. ఆ భూమిపై ఎవరైనా వివాదం రాజేస్తే ఇక అంతే సంగతులు. అది తన భూమే అని రైతు నిరూపించుకోవాలి. లేదంటే ఆ భూమిని వివాదాస్పద రిజిస్టర్‌ (డిస్పూట్‌)లో నమోదు చేస్తారు. ఇక ఆ వివాదం పరిష్కారం కోసం దేవుడే దిగిరావాలి. న్యాయం కోరుతూ రైతు కోర్టులను ఆశ్రయించడానికి అవకాశం లేదు. పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగాలి. వారు దయదలిస్తే భూమి దక్కుతుంది. లేదంటే శాశ్వత వివాదాస్పద భూమి జాబితాలోకి వెళ్లిపోతుంది. వివాదాలు లేని భూమి హక్కులు ఇస్తామన్న జగన్‌ చేసిన నిర్వాకం ఇది. దీనివల్ల రైతుకు తిండిపెట్టే భూమిపైనే భరోసా లేకుండాపోయే పరిస్థితి వచ్చింది. భూముల సర్వే పూర్తి కాకముందే టైటిల్‌ చట్టం అమల్లోకి తీసుకురావడంపై రైతులు, రైతు సంఘాలు, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కేంద్రం పేరు చెప్పి చ ట్టం

ప్రతీ రైతు తన భూమిపై శాశ్వత హక్కు కోరుకుంటున్నారు. ఇది జరగాల్సిందే. ఇప్పుడు జగన్‌ సర్కారు తీసుకొచ్చిన టైటిల్‌ చట్టం ప్రకారం హక్కులు ఇవ్వాలనుకుంటే చాలా సమస్యలొస్తాయి. చట్టంలోని అనేక క్లాజుల ప్రకారం రెవెన్యూ అధికారులు సూపర్‌ పవర్‌గా మారుతారు. భూ బకాసురులు, కబ్జాకోరులు, రాజకీయ పలుబడి ఉన్నవారు భూ వ్యవహారాల్లో దర్జాగా వేలు పెట్టి కావాల్సిన మేరకు వివాదాలు సృష్టించే అవకాశముంది. ఇలాంటివి జరిగేందుకు ఆస్కారం కలిగించేలా కొత్త చట్టం తయారు చేశారు. చట్టంపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తాక జగన్‌ సర్కారు కొత్త వాదన తెరమీదకు తీసుకొచ్చింది. కేంద్రం సూచన మేరకే చట్టం చేశామని, నీతి ఆయోగ్‌ ఆమోదించిన ముసాయిదా నివేదిక ప్రకారమే నడుచుకున్నామని చెబుతోంది. ఇది పచ్చి అబద్ధం. రైతులకు భూములపై టైటిల్‌ గ్యారెంటీ ఉండాలని కేంద్రం చెప్పింది. కానీ జగన్‌ సర్కారు తీసుకొచ్చిన చట్టం ప్రకారం హక్కులు కల్పించాలని చెప్పలేదు. పైగా నీతి ఆయోగ్‌ ఆమోదించిన ముసాయిదాలోని అంశాలకు విరుద్ధ్దంగా ఏపీ టైటిల్‌ చట్టం ఉంది. సివిల్‌ కోర్టుల ప్రమేయం లేకుండా టైటిల్‌ చట్టం ఉండాలని కేంద్రం చెప్పలేదు. నీతి ఆయోగ్‌ అలా సిఫారసు చేయలేదు. కానీ జగన్‌ సర్కారు ఆ పని చేసింది.

రాజస్థాన్‌ బిల్లు నుంచి కాపీ

రాజస్థాన్‌ సర్కారు 2016లో తయారు చేసిన అర్బన్‌ ల్యాండ్‌ టైటిల్‌ బిల్లును ఆధారంగా చేసుకొని జగన్‌ సర్కారు చట్టం తయారు చేసింది. ఈ చ ట్టానికి మూలాధారమైన టైటిల్‌ బిల్లును ఎలా తయారు చేశారో తెలిస్తే విస్తుపోవాల్సిందే. నాటి సర్వే శాఖ అధికారి ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌తో ముసాయిదా బిల్లును తయారు చేయించారు. రాజస్థాన్‌ అర్బన్‌ టైటిల్‌ బిల్లులోని అంశాలను ఏపీ బిల్లులో మక్కీ మక్కీ దింపారు. ఆ తర్వాత ఆ ముసాయిదా బిల్లును ఉలవపాడు, మంగళగిరిలో పనిచేసిన మాజీ తహసిల్దార్లలో ఓకే చేయించారు. దాన్ని న్యాయ శాఖ పరిశీలన, అధ్యయనానికి పంపించకుండానే 2019 జూలైలో అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. ఆ తర్వాత కేంద్రం ఆమోదం కోసం పంపించారు.

కేంద్రం తిరస్కరణ

జగన్‌ సర్కారు పంపిన టైటిల్‌ బిల్లును కేంద్రం తిరస్కరించి వెనక్కి పంపించింది. టైటిల్‌ బిల్లుపై కేంద్ర భూవనరుల విభాగం, హోం శాఖలు అభ్యంతరం తెలిపాయి. భారత స్టాంపు చట్టం-1899, సర్వే, సరిహద్దుల చట్టం-1923, ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కులు, పట్టాదార్‌ పాసుపుస్తకం చట్టం-1971, రిజిస్ట్రేషన్‌ చట్టం-1908, పరిమిత దాయిత్వ చట్టం-1963, భూ సేకరణ, పునరావాస చట్టం-2013.. ఇలా అనేక కీలకమైన కేంద్ర, రాష్ట్రాల చట్టాల్లోని అంశాలకు పోటీగా, వాటిని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు టైటిల్‌ బిల్లులో ఉన్నాయని కేంద్ర సంస్థలు ఆక్షేపించాయి. కేంద్ర చట్టాలతో వైరుద్యం వస్తుందని తెలిసి 8 అంశాలు ఎందుకు చేర్చారంటూ కేంద్ర హోం శాఖ ప్రశ్నించింది. అప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం టైటిల్‌ బిల్లును న్యాయ పరిశీలనకు పంపాలి. అయితే ఆ పనిచేయకుండా పలు అంశాలనే అటూ ఇటూ మార్చి కొత్తగా మరో సవరణ బిల్లును 2021లో అసెంబ్లీలో ఆమోదించారు. కేంద్రం రెండోసారి కూడా ఆ బిల్లును ఆమోదించకుండా అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నాటి వక్ఫ్‌ బోర్డు సర్వే జాయింట్‌ కమిషనర్‌ను కేంద్రంలోని సీనియర్‌ ఐఏఎ్‌సలతో చర్చించేందుకు పంపించింది. కేంద్ర రిజిస్ట్రేషన్‌ చట్టం-1908, కేంద్ర స్టాంప్‌ చట్టం-1899లను ధిక్కరించే క్లాజులను బిల్లులో ఎందుకు ప్రస్తావించారన్న ప్రశ్నలకు ఆ అధికారి సమాధానం ఇవ్వలేక తిరుగుటపాలో విజయవాడకు వచ్చారు. ముచ్చటగా మూడోసారి అంటే.. 2022లో బిల్లులో మరోసారి సవరణలు చేసి అసెంబ్లీలో ఆమోదం పొందారు. తర్వాత కూడా కేంద్రం ఆ బిల్లును ఆమోదించకుండా నిలిపివేసింది. పైరవీలు, లాబీయింగ్‌ చేయడంలో దిట్ట అయిన సర్వే అధికారి ఒకరు ఢిల్లీలో అనేక ప్రయత్నాలు చేశారు. ఏం జరిగిందో కానీ కేంద్రం అభ్యంతరాలకు సరైన సమాధానం చెప్పలేదని తెలిసినా ఆ బిల్లును ఆమోదించారు.

నల్సార్‌ నిపుణుల అభ్యంతరం

ఏపీ టైటిల్‌ బిల్లుపై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలకు 2019, 2021, 2022లో సవరించారు. ఈ సమయంలో సర్వే శాఖ ఈ బిల్లుపై నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణులను సంప్రదించింది. సివిల్‌ కోర్టుల ప్రమేయం లేకుండా బిల్లును ఎలా తయారు చేస్తారంటూ న్యాయ నిపుణులు ప్రశ్నించారు. కేంద్రంలోని 4చట్టాలను ధిక్కరించి రెవెన్యూ అధికారులకు ట్రైబ్యునల్స్‌లో సూపర్‌ పవర్‌ కట్టబెట్టడం సరికాదని సూచించారు. ఈ అంశాలను మార్చుకోవాలని ప్రతిపాదించారు. తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా రాశారు. అయితే సర్వే శాఖ ఈ విషయాలను పట్టించుకోలేదు.

చట్టం తీసుకొచ్చే విధానం ఇదేనా?

రాష్ట్రంలో కోట్లాది మంది రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావాలంటే సర్కారు న్యాయ, రెవెన్యూ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయించాలి. కమిటీ ఇచ్చే సిఫారసులతో ముసాయిదా బిల్లును రూపొందించాలి. ఈ ప్రక్రియలోనూ రెవెన్యూ, న్యాయ నిపుణులు పాల్గొనేలా సర్కారు చర్యలు తీసుకోవాలి. కానీ జగన్‌ సర్కారు అడ్డగోలుగా ముసాయిదా బిల్లును తయారు చేయించిందన్న విమర్శలున్నాయి. నిపుణులు, మేధావుల ప్రమేయం లేకుండానే బిల్లు రూపొందించింది. కేంద్రం తిరస్కరించిన తర్వాత అయినా ముసాయిదా బిల్లును సమీక్షించుకోకుండా, నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించకుండా మళ్లీ కేంద్ర ఆమోదానికి పంపించింది.

కోర్టుల జోక్యం ఉండదు

భూమిపై హక్కు అంటే.. యజమానికి భూమిపై పరిపూర్ణమైన హక్కులను కల్పించి దానికి చట్టబద్దమైన గ్యారెంటీ కల్పించడం. ఉదాహరణకు ఓ రైతుకు పది ఎకరాల భూమిపై హక్కు ఉంటే హక్కుల రిజిస్టర్‌లో ఆ వివరాలను నమోదు చేసి అధికారిక నోటిఫికేషన్‌ ద్వారా బహిరంగంగా ప్రకటిస్తారు. ఎలాంటి అభ్యంతరాలు, వివాదాలు రాకుంటే ఆ భూమిపై ఆ రైతుకు ఉన్న హక్కు శాశ్వతమవుతుంది. ఆ భూమికి అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా.. ఆ భూమిపై ఎవరైనా వివాదం రాజేసి, తనకు హక్కు ఉందని పత్రాలు ఇస్తే యజమానికి చిక్కులు తప్పవు. ఆ భూమిని వివాదాస్పద రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఇక ఆ భూమి తనదేనని యజమాని పోరాటం చేయాలి. వివాదాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రైబ్యునల్స్‌లో పరిష్కరించుకోవాలి. ట్రైబ్యునల్‌లో రెవెన్యూ అధికారులే కేసులు పరిష్కరిస్తారు. ఈ క్రమంలో రైతులు సివిల్‌ కోర్టులకు వెళ్లడానికి వీల్లేదు. రాష్ట్రస్థాయి ట్రైబ్యునల్‌లో కూడా న్యాయం దక్కకపోతే అప్పుడు రైతులు హైకోర్టును ఆశ్రయించాలి. ఓ సామాన్య రైతు తన భూమి వివాదం పరిష్కారం కోసం హైకోర్టుకు వెళ్లిపోరాటం చేయాలంటే అయ్యే పనేనా? వివాదం తేలేవరకు అసలు హక్కుదారులకు గ్యారెంటీ ఇవ్వరు. ఇది రైతులను తీవ్రంగా కలవరపెడుతున్న అంశం.

రీ సర్వేతో తకరారు

ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే జరుగుతోంది. రీ సర్వే అనంతరం ఇస్తున్న పాస్‌పుస్తకాల్లో భారీగా తప్పులు ఉంటున్నాయి. భూమి విస్తీర్ణం, కొలతలు, సరిహద్దుల నమోదులో తప్పులు వస్తున్నా రెవెన్యూ యంత్రాంగం సరిచేయడం లేదు. పైగా ఒకే భూమిపై ఇద్దరికి పాస్‌పుస్తకాలు ఇచ్చిన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపఽథ్యంలో అసలు హక్కుదారుకు టైటిల్‌ వస్తుందా? లేదా? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌కు రీ సర్వే రికార్డులనే ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. తప్పుల తడక రికార్డులను పరిగణనలోకి తీసుకుని టైటిల్‌ ఇస్తే మరిన్ని భూ వివాదాలు వస్తాయని రైతు సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసే అప్పిలేట్‌లలో రిటైర్డ్‌ అధికారులను నియమించే క్లాజు ఉంది. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. సర్వీసులో ఉన్నవారు తప్పులు చేస్తేనే చర్యలు తీసుకోలేకపోతున్నారని, ఇక రిటైర్డ్‌ అధికారులు తప్పులు చేస్తే వారిపై ఏం నియంత్రణ ఉంటుందని రెవెన్యూ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి.

చాలా ప్రమాదకర చట్టం

నీతి ఆయోగ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు సంబంధించిన డ్రాఫ్ట్‌ రిపోర్టును అన్ని రాష్ట్రాలకు పంపింది. దీనివల్ల ప్రజలకు చట్టబద్ధంగా అన్యాయం జరుగుతుందని భావించి దేశంలోని ఏ రాష్ట్రమూ దీనిని అంగీకరించలేదు. ఒక్క మన రాష్ట్రంలోనే దీనికి అంగీకారం తెలుపుతూ చట్టం చేసి, నోటిఫికేషన్‌ ఇచ్చారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా భూ హక్కుల చట్టం రూపకల్పన చేశారు. న్యాయవ్యవస్థను పరిధి నుంచి పూర్తిగా తొలగించి ప్రభుత్వ అదుపు ఆజ్ఞల్లో ఉండే రెవెన్యూ శాఖకు ఆస్తి నిర్ధారణ హక్కులు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలలో మార్పులు చేయకుండా ఆస్తి హక్కును నిర్ధారించే అధికారం, రెవెన్యూ అధికారులు నిర్ధారించిన ఆస్తిహక్కు నిర్ధారణ చెల్లుబాటు కావు.

- న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు

Updated Date - Apr 24 , 2024 | 04:06 AM