Share News

ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే..

ABN , Publish Date - Nov 16 , 2024 | 04:39 AM

గత ప్రభుత్వం చేసిన అప్పులకు లెక్కల్లేవని, ఐదు నెలల నుంచి రోజుకొక అరాచకం బయటపడుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు.

ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే..

అప్పులు 9.74 లక్షల కోట్లుపైనే!.. ఇంకా తవ్వాల్సింది చాలానే ఉంది...

జగన్‌ హయాం అప్పులకు లెక్కల్లేవు

ఇప్పటికి ఇంతే బయటపడ్డాయి

ఒక్కో శాఖ అకౌంట్‌ క్లియరెన్స్‌కు 4 నెలలు

5 నెలలుగా రోజుకో దుర్మార్గం వెలుగులోకి..

వైసీపీ మిగిల్చిన ఆర్థికకష్టాలతో కుంగుబాటు

వస్తున్న పెట్టుబడులు చూస్తే తిరిగి ధైర్యం

బడ్జెట్‌పై చర్చకు మంత్రి పయ్యావుల జవాబు

అమరావతి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం చేసిన అప్పులకు లెక్కల్లేవని, ఐదు నెలల నుంచి రోజుకొక అరాచకం బయటపడుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఒక్కో శాఖలో అకౌంట్లు బయటకు తీయడానికి 4నెలల సమయం పడుతోందని చెప్పారు. రాష్ట్ర అప్పులు రూ.9.74 లక్షల కోట్లకుపైనే ఉన్నాయని, ఈ లెక్క ఇంకా పెరుగుతూనే ఉందని స్పష్టం చేశారు. ఫలానా తేదీలోగా ఇన్ని వేలకోట్ల అప్పులు కట్టాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని చెప్పారు. ఏక్షణాన ఏ అప్పుల వాడు వస్తాడో, ఏ బ్యాంకరు వస్తాడోనని కంగారుగా ఉంటోందని వ్యాఖ్యానించారు. నాలుగురోజులు వరుసగా ఆర్థిక మంత్రిగా వైసీపీ ప్రభుత్వ బిల్లు బాధితుల కష్టాలు, సహచర మంత్రుల వినతులు వింటుంటే కుంగుబాటు వస్తోందని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూస్తుంటే తిరిగి ధైర్యం వస్తోందని వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ వివరాలు పంచుకున్నారు. ‘‘2014-19లో చంద్రబాబు హయాంలో 13.5 శాతం వృద్ధి నమోదైంది. అది అలాగే కొనసాగి ఉంటే రూ.76,000 కోట్ల ఆదాయం అదనంగా ఏపీకి వచ్చేది. కానీ, జగన్‌ హయాంలో కేవలం అప్పులపై ఆధారపడడంతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే. దేనికీ సరైన లెక్కలు, జమా ఖర్చులు లేవు’’ అని మంత్రి తెలిపారు.


అంతా అంకెల గారడే..

గత ప్రభుత్వం అంకెల గారడీతో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని పయ్యావుల అన్నారు. ‘‘కేంద్ర సంస్థలను జగన్‌ ప్రభుత్వం తప్పుదారి పట్టించింది. ఇప్పుడు కూడా అదే గారడీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో అనేకమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలకిచ్చే చిక్కీల బిల్లులు కూడా పెండింగ్‌లో పెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడంతో కళాశాలల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. మేం వచ్చాక సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాం. పోలవరం పనులు నిలిపివేసి డయాఫ్రమ్‌ వాల్‌ విధ్వంసానికి కారణమయ్యారు. రోడ్ల మరమ్మతులు చేపట్టలేదు. ఇసుక, మద్యం మాఫియాను ప్రోత్సహించారు’’ అని వివరించారు. చట్టసభల అనుమతి లేకుండా రూ.634 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్‌ చెప్పిందని గుర్తుచేశారు. జగన్‌ హయాంలో ఏపీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ను ఏర్పాటుచేసి ప్రభుత్వ శాఖలను ఊడ్చేశారని వెల్లడించారు. రూ.80,000 కోట్లు విలువైన ఉద్యోగుల పీఎఫ్‌, సీపీఎస్‌, స్మాల్‌ డిపాజిట్ల్లు....గత ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. ఇందులో రూ.21,000 కోట్లు ఉద్యోగులకు విధిగా ఇవ్వాల్సిన నిధులున్నాయని చెప్పారు. జగన్‌ ప్రభుత్వ ఆర్థిక అరాచకాలు భరించలేక మిగతా రాష్ట్రాలు కూడా అలా చేస్తాయేమోనని కేంద్రం చట్టాలు కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి చెప్పారు.

నాటి అరాచకాలకు కాగ్‌ పత్రమే రుజువు

గత ప్రభుత్వం తమకు కావాల్సిన వారి బిల్లులనే సీఎ్‌ఫఎంఎ్‌సలో ప్రవేశపెట్టిందని మంత్రి గుర్తుచేశారు. బయటకు కనపడుతున్న లెక్కలు వేరు, తవ్వినకొద్దీ వచ్చే లెక్కలు వేరన్నారు. జగన్‌ హయాంలో కాగ్‌ ప్రభుత్వానికి క్వాలిటేటివ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిందని, స్వతంత్రభారతంలో ఏరాష్ట్రానికీ కూడా ఇప్పటి వరకు కాగ్‌ ఆ పత్రం జారీ చేయలేదని చెప్పారు. దానర్థం ఏంటంటే తమకు చూపించినటువంటి లెక్కల ప్రకారం ఇంతమేరకే తాము సర్టిఫై చేస్తున్నాం.... చూపించనివి ఇంకా ఉన్నాయి...వాటి గురించి తమకు తెలియదని.... ఆనాడు జరిగిన ఆర్థిక అరాచకాలకు ఈ పత్రమే రుజువు అని మంత్రి తెలిపారు.

గవర్నర్‌ నెత్తినా ‘అప్పు’

అసెంబ్లీ అనుమతి లేకుండా ఖర్చు పెట్టడమే కాకుండా, కాగ్‌ పర్యవేక్షణలో లేని కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు చేసి వాటి ద్వారానే మళ్లించే అరాచక విధానాన్ని జగన్‌ అవలంబించారని మంత్రి మండిపడ్డారు. ఏపీఎ్‌సడీసీ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) ద్వారా బ్యాంకుల నుంచి రూ.25,000 కోట్ల అప్పు తీసుకుని... గ్యారంటీర్‌గా గవర్నర్‌ను (గవర్నమెంట్‌) పెట్టే హీనస్థితికి నాటి జగన్‌ సర్కారు దిగజారిందని కేశవ్‌ ఆగ్రహించారు. మరి.. రుణం తీర్చకపోతే చర్యలు తీసుకోవడానికి గవర్నర్‌కు రాజ్యాంగ రక్షణలు ఉంటాయి కదా అని బ్యాంకర్లు అభ్యంతరపెట్టగా, గవర్నర్‌ రక్షణలను సైతం తొలగిస్తూ జీవోను తెచ్చి అభాసుపాలు అయ్యారన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు దాచుకున్న 2,100 కోట్లను ఎల్‌ఐసీ నుంచి తీసుకొచ్చి వాడేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఎనర్జీ ఉద్యోగుల సేవింగ్స్‌ రూ.5,043 కోట్లు వాడేశారని వెల్లడించారు.

‘‘అప్పులతో సంక్షేమం అందిస్తే రాష్ట్రం దివాలా తీస్తుంది. అందుకే అభివృద్ధి చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో పేదవారికి పథకాలు అమలు చేయడం మా ప్రభుత్వ విధానం. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కూడా వీలు లేకుండా చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా అర్థం చేసుకోవాలనేదీ అర్థం కావడం లేదు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాం’’

- ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

Updated Date - Nov 16 , 2024 | 05:58 AM