Share News

ఉపాధి అవినీతిపై అంకుశం

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:33 AM

గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 2022-23లో నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో జరిగిన అవినీతికి సంబంధించి 8 మంది సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఉపాధి అవినీతిపై అంకుశం

మొదటిసారిగా 8 మందిపై ఎఫ్‌ఐఆర్‌

ఇప్పటికే ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌

2022-23లో జరిగిన అక్రమాలపై చర్యలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 2022-23లో నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో జరిగిన అవినీతికి సంబంధించి 8 మంది సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిలో ఇదే మొదటి ఎఫ్‌ఐఆర్‌. పంచాయతీరాజ్‌ శాఖ బాధ్యతలు చేపట్టాక ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఉపాధి హామీ పథకం అవినీతిని రూపుమాపడానికి పలు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల చీఫ్‌ విజిలెన్స్‌ అధికారిగా అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారి భవానీ హర్షను నియమించి ఆ విభాగానికి జవసత్వాలు నింపారు. ఆయన బాధ్యతలు చేపట్టగానే విజిలెన్స్‌కు సంబంధించి జీఓ నెంబర్‌ 52కు పదును పెట్టారు. ఉపాధి హామీ పథకంలో రూ.లక్ష కంటే ఎక్కువగా అవినీతికి పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చినగోపవరం పంచాయతీలో జరిగిన భారీ అవినీతిపై ఇటీవల సోషల్‌ ఆడిట్‌ తనిఖీలు నిర్వహించింది. ఆ మండలంలో రూ.60 లక్షలకు పైగా అవినీతి జరిగిందని తేల్చారు. ఒక్క చినగోపవరం పంచాయతీలోనే రూ.50 లక్షల దాకా అప్పనంగా దోచుకున్నారని గుర్తించారు.

ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను జాబ్‌కార్డుల్లో సభ్యులుగా చేర్చి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎ.మహేంద్ర రూ.27.45 లక్షలను స్వాహా చేశారని నిర్ధారించారు. ఆ మండలంలో ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌గా ఉన్న శీనయ్య రూ.13.79 లక్షలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు ఎం.వెంకటేశ్వర్లు రూ.9.63 లక్షలు, ఎంవీ ప్రసాద్‌ రూ.3.73 లక్షలు, ఎం.ప్రసన్న రూ.2.70 లక్షలు స్వాహా చేశారని తేల్చారు. ఇటీవల చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ భవానీ హర్ష ఆ మండలంలో పర్యటించి సమగ్ర విచారణ చేపట్టారు. సోషల్‌ ఆడిట్‌ హియరింగ్‌ తర్వాత అవినీతిలో భాగస్వాములైన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మహేంద్రరెడ్డి, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ శీనయ్య, టెక్నికల్‌ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, ప్రసన్న, ఎంవీ ప్రసాద్‌లను ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. ఈ అవినీతిలో ఇద్దరు ఏపీఓలు, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ సహకారం ఉందంటూ వారిని కూడా బాధ్యులను చేస్తూ మొత్తం 8 మంది సిబ్బందిపై కేసులు నమోదు చేసేందుకు ఆదేశాలిచ్చారు. అవినీతి కేసులలో కేవలం రికవరీలతో సరిపెట్టడం కాకుండా బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టడం ద్వారా పథకాన్ని గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్‌ తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఉపాధి సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

అవినీతిని వెలుగులోకి తెచ్చిన అంబుడ్స్‌మెన్‌

నెల్లూరు జిల్లాలో ఉపాధి పథకంలో అవినీతిపై వేటాడుతున్న అంబుడ్స్‌మెన్‌ వెంకటరెడ్డి మొదట చిన్నగోపవరం పంచాయతీపై దృష్టి సారించారు. గ్రామంలో ఎస్సీలకు చెందిన ఉపాధి వేతనాలను కొంత మంది దోచుకోవడంపై ఉన్నతాధికారులను అలెర్ట్‌ చేశారు. ఆయన స్వయంగా తనిఖీ చేశారు. మండల సోషల్‌ ఆడిట్‌ హియరింగ్‌కు సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ కలువాయి వచ్చేట్లు చేసి ఉపాధిలో జరిగిన అవినీతిని బయటపెట్టారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. భవానీ హర్ష దృష్టికి తీసుకెళ్లి అవినీతిపరులపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆయన ఇప్పటికే కొడవలూరు మండలం తలమంచి గ్రామ పంచాయతీలోనూ జరిగిన అవినీతిపై పలువురు సిబ్బందిని ఇంటిదారి పట్టించారు.

Updated Date - Dec 10 , 2024 | 04:33 AM