Monsoon: తొలకరి పలకరింపు
ABN , Publish Date - Jun 03 , 2024 | 04:00 AM
రాష్ట్ర రైతాంగాన్ని తొలకరి పలకరించింది. మూడు నెలలుగా ఎండ తీవ్రత, వర్షాభావంతో అల్లాడిన ప్రజలు, రైతులకు ఊరటనిచ్చేలా నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
రాష్ట్రంలోకి మూడు రోజుల ముందే నైరుతి
రాయలసీమ నుంచినెల్లూరు వరకు విస్తరణ
2-3 రోజుల్లో కోస్తాకు కూడా రుతుపవనాలు
మొదలైన తొలకరి... పలు జిల్లాల్లో వర్షాలు
మరో 3 రోజులపాటు కొనసాగే అవకాశం
విశాఖపట్నం, అమరావతి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతాంగాన్ని తొలకరి పలకరించింది. మూడు నెలలుగా ఎండ తీవ్రత, వర్షాభావంతో అల్లాడిన ప్రజలు, రైతులకు ఊరటనిచ్చేలా నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మే 30న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని అనేక భాగాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు వరకు విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా జూన్ ఐదో తేదీకల్లా రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని భాగాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. అయితే దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. ఇంకా అరేబియా సముద్రం నుంచి పడమర గాలులు కేరళ వైపు బలంగా వీస్తుండడంతో రుతుపవనాల కదలికలో పురోగతి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆదివారం కేరళ, లక్షద్వీప్, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. గతేడాది ఎల్‌నినో కారణంగా కేరళలో జూన్ 8న ప్రవేశించిన రుతుపవనాలు, 11న రాయలసీమ, దక్షిణ కోస్తా వరకు విస్తరించాయి. కానీ, ఈ ఏడాది ముందుగానే రాష్ట్రంలోకి రావడంతో తొలకరి పనులకు రైతులు శ్రీకారం చుడతారని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, వాతావరణ అనిశ్చితి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
ఆదివారం ఉత్తరకోస్తాలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పెదనడిపల్లిలో 78.5, పూసపాటిరేగ మండలం గోవిందపురంలో 76.55 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. రాజాం సమీపంలోని డోలపేటలో 66.5, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 66.0 మి.మీ కురిసింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7, అనంతపురం జిల్లా ఉరవకొండలో 52.6, కూడేరులో 50.4, బెలుగుప్పలో 49.8, కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 47.7, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, హిరమండలం, పాతపట్నం, పలాస, నందిగాం తదితర మండలాల్లో ఉరుములు.. మెరుపులతో వర్షం కురిసింది. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సుమారు 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, ఆదివారం ఉదయం, సాయంత్రంలో కోస్తాలో పలుచోట్ల, రాత్రి సమయంలో విశాఖ నగరంలో రుతుపవన ముందస్తు వర్షాలు కురిశాయని వాతావరణశాఖ అధికారి ఒకరు తెలిపారు.
మూడు రోజులు విస్తారంగా వానలు..
రానున్న మూడు రోజుల వరకు కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల పిడుగులు పడే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి
యడ్లపాడు, జూన్ 2: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఆదివారం పిడుగు పడి ఇద్దరు రైతులు పెద్ది వీరయ్య (53), చిరతల శ్రీనివాసరావు (50) మృతిచెందారు. వారిద్దరూ చెరో ట్రాక్టరుతో గ్రామ పరిధిలోని పొలం దున్నుతున్న సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. దీంతో వారు ట్రాక్టర్లు దిగి సమీపంలోని వేప చెట్టు కిందకు చేరారు. అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
అవి సునామీ అలలు కాదు..!
విశాఖ నగరంలో ఆదివారం రాత్రి పది గంటల నుంచి సుమారు గంటపాటు ఉరుములు, పిడుగులతో మోస్తరు వర్షం కురిసింది. వర్షం కంటే చెవులు చిల్లులు పడేలా శబ్ధాలతో పిడుగులు పడ్డాయి. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంతో శ్రీకాకుళం జిల్లాలో ఆవరించిన మేఘాలు విజయనగరం జిల్లా మీదుగా విశాఖ నగరంపైకి ప్రయాణించాయి. దీంతో రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా నగరంతోపాటు అనకాపల్లి పరిసరాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి పిడుగులతో కూడిన వర్షం కురిసింది. రుతుపవనాల రాకకు ముందు ఇలాంటి ప్రీమాన్ మాన్‌సూన్ థండర్స్ రావడం సాధారణమేనని వాతావరణ శాఖ నిపుణుడొకరు తెలిపారు. గంట నుంచి రెండు గంటల తర్వాత మేఘాలు విచ్ఛిన్నమవుతాయన్నారు. అంతే తప్ప ఇవేమీ సునామీ అలలు కావన్నారు.