సాంకేతికతతో మత్స్య రంగంలో సుస్థిరాభివృద్ధి
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:26 AM
సాంకేతికతను వినియోగించి.. చేప లు, రొయ్యల ఉత్పత్తిలో ప్రతి ఏటా 15 శాతం వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్లు మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ చెప్పారు.
ఏటా 15% వృద్ధి సాధనకు ప్రణాళికలు
రేపు విజయవాడలో మత్స్యకార దినోత్సవం: మత్స్యశాఖ కమిషనర్
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సాంకేతికతను వినియోగించి.. చేప లు, రొయ్యల ఉత్పత్తిలో ప్రతి ఏటా 15 శాతం వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్లు మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ చెప్పారు. రాష్ట్రంలోని చేపలు, రొయ్యల సాగుదారులు, మత్స్యకారులు సుస్థిరాభివృద్ధి సాధించేందుకు సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 21న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని చెప్పారు.
10 ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆక్వా చెరువుల్లో ప్రాణవాయువు తగ్గితే.. వాటంతట అవే తిరిగే ఎయురేటర్ల టెక్నాలజీ, తక్కువ ఖర్చుతో వ్యర్థాల నుంచి సంపద సృష్టించే బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాల పెంపకం వంటివి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని లక్షా 20 వేల మంది మత్స్యకారులకు భద్రత కల్పించే ట్రాన్స్‌ఫౌండర్లు, 2.30 లక్షల మంది ఆక్వా రైతులకు పెట్టుబడి తగ్గించేలా బయోఫ్లోప్ టెక్నాలజీ, డ్రోన్లతో రొయ్యలకు మేత అందించే విధానంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. మత్స్యకారులు, ఆక్వా రైతులకు టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గించి, స్థిరమైన లాభాలు పొందేలా మత్స్య రంగానికి ప్రభుత్వ సహకారం అందించనున్నట్లు ఆయన వివరించారు.