పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై 18న తీర్పు
ABN , Publish Date - Jul 11 , 2024 | 04:41 AM
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి సంఘటనలపై దాఖలైన కేసుల్లో ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
గురజాల అదనపు జిల్లా కోర్టులో ముగిసిన వాదనలు
గుంటూరు(లీగల్), జూలై 10: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి సంఘటనలపై దాఖలైన కేసుల్లో ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఈ నెల 18న కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ పిటిషన్లపై గురజాల అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు జడ్జి రుద్రపాటి శరత్‌బాబు వద్ద బుధవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు వెలువరించేందుకు ఈ నెల 18కి వాయిదా వేశారు. పిన్నెల్లి తరఫున మాజీ ఏపీపీ, జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ స్పెషల్ లీగల్ అడ్వైజర్‌గా పనిచేసిన ఇనకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పాల్వాయిగేటు సంఘటన నుంచి కౌంటింగ్ తేదీ వరకు పోలీసులు ఈ కేసుల్లో స్తబ్ధుగా వ్యవహరించారని.. తొలుత ఎఫ్‌ఐఆర్‌లో లేకపోయినా తర్వాత దురుద్దేశపూర్వకంగా పిన్నెల్లిని నిందితుడిగా చేర్చారని తెలిపారు. సీఐ నారాయణస్వామిపై దాడి జరిగి ఉంటే ఆయన పోలీసు అధికారిగా ఉండి వెంటనే మెడికో లీగల్ కేసుగా ఎందుకు నమోదు చేయించలేదని, గాయంపై కూడా పోలీసులు అసత్యాలు చెబుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో జరిగిన చిన్న చిన్న ఘటనలతోనే ఆయనపై పోలీసులు రౌడీషీట్ తెరిచారని చెప్పగా.. రౌడీషీట్ రద్దుకు హైకోర్టుకు వెళ్లవచ్చు కదా అని న్యాయమూర్తి సూచించారు. ప్రాసిక్యూషన్ తరపున ఈ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన హైకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. పోలీసు అధికారులు ఎన్నికల తేదీన జరిగిన హింసలో కొంతకాలం స్తబ్ధుగా వ్యవహరించిన మాట వాస్తవమేనని, అయితే పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టడం ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయిందని.. దీనిని మీడియా ద్వారా అందరూ చూశారని తెలిపారు. సిటింగ్ ఎమ్మెల్యేగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసు అధికారిపై దాడి చేయడం తీవ్రమైన చర్యగా అభివర్ణించారు. పోలీసుల దర్యాప్తునకు పిన్నెల్లి ఏమాత్రం సహకరించడం లేదని, ఎన్నికల రోజు తాను ఆ పోలింగ్ బూత్ వద్దకే వెళ్లలేదని అసత్యమాడుతున్నారని తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులు పిన్నెల్లిని విచారించే సమయంలో రికార్డు చేసిన ప్రశ్నావళిని, ఆయన ఇచ్చిన సమాధానాలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మరి కొంతమంది నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని, వారిని కూడా అరెస్టు చేయాల్సి ఉందన్నారు. పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు అవరోధం కలిగిస్తారని.. సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపారు. ఆయన బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 18కి వాయిదా వేశారు.