Share News

Pinnelli : నేను సచ్ఛీలుడిని... నాపై కేసులే లేవు

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:36 AM

తాను సచ్ఛీలుడిని, తనపై కేసులే లేవని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనకు తాను సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. తనకు అనుచరులే లేరని, తనకు ఎటువంటి నేరచరిత్ర లేదని చెప్పుకొచ్చారు. తనపై ఒక తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు మాత్రమే ఉందని, అంతకుమించి ఎటువంటి కేసులు లేవని చెప్పడంతో పోలీస్‌ అధికారులు విస్మయానికి గురయ్యారు.

Pinnelli : నేను సచ్ఛీలుడిని... నాపై కేసులే లేవు

ఆ రోజు పాల్వాయి గేటు పోలింగ్‌ బూత్‌లోకే వెళ్లలేదు

నాకు నేరచరిత్ర లేదు... అనుచరులు కూడా లేరు

పోలింగ్‌ తర్వాత రోజు ఇంటినుంచి బయటకు పోలేదు

కారంపూడిలో హింసాత్మక ఘటనలతో సంబంధం లేదు

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సమాధానాలు... కంగుతిన్న పోలీసులు

గుంటూరు, జూలై 10: తాను సచ్ఛీలుడిని, తనపై కేసులే లేవని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనకు తాను సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. తనకు అనుచరులే లేరని, తనకు ఎటువంటి నేరచరిత్ర లేదని చెప్పుకొచ్చారు. తనపై ఒక తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు మాత్రమే ఉందని, అంతకుమించి ఎటువంటి కేసులు లేవని చెప్పడంతో పోలీస్‌ అధికారులు విస్మయానికి గురయ్యారు. తాను చెప్పిందే వేదం... తాను రాసిందే శాసనం అన్నట్లుగా మాచర్ల నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని అరాచక పాలన సాగించిన పిన్నెల్లి ప్రస్తుతం ప్రజలను పిచ్చోళ్లను చేసినట్లు వ్యవహరిస్తుండటం సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తోంది. ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తరువాత నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి సాగించిన దౌర్జన్యం, అరాచకాలు, హింసత్మక ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఆయా కేసుల్లో నిందితుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. పోలింగ్‌ రోజున, ఆ తరువాత మాచర్ల నియోజకవర్గంలో చోటుచేసుకున్న హింసాకాండపై పూర్తి ఆధారాలు, వివరాలు సేకరించేందుకు రామకృష్ణారెడ్డిని పోలీసులు రెండు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు సెంట్రల్‌ జైల్లోనే ఆయనను గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారించారు. కస్టడీలో అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలతో పోలీసు అధికారులు కంగుతిన్నారు. పాల్వాయి గేటు పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను యావత్‌ ప్రపంచం చూసింది. తాజాగా వైసీపీ అధినేత జగన్‌ నెల్లూరు సెంట్రల్‌ జైల్‌లో పిన్నెల్లిని పరామర్శించి అక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘పాల్వాయి గేటు పోలింగ్‌ బూత్‌లో ఏకపక్ష ఎన్నిక జరుగుతుండటంతో అడ్డుకునేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు, అందులో తప్పేముంది’ అంటూ కితాబిచ్చారు. ఇదిలా ఉంటే పోలీస్‌ కస్టడీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం తాను ఆరోజు పోలింగ్‌ బూత్‌ లోకి వెళ్లనేలేదని చెప్పుకొచ్చారు. సీసీ పుటేజీలో మీరు కనిపించారు కదా, ఈవీఎం ధ్వంసం చేయడం స్పష్టంగా కనిపిస్తోందంటూ పోలీసు అధికారులు వేసిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘నేను అసలు పోలింగ్‌ బూత్‌లోకే వెళ్లలేదు.. నేను ఈవీఎం ధ్వంసం చేయడం ఏమిటి.. ఏం మాట్లాడుతున్నారు?’ అంటూ పోలీసులను ఎదురు ప్రశ్నించడంతో వారు అవాక్కయ్యారు. ఆ తర్వాత రోజు కారంపూడిలో జరిగిన హింసాత్మక ఘటనలతో తనకు గానీ తన సోదరుడు వెంకటరామిరెడ్డికి గాని ఎటువంటి సంబంధం లేదని పిన్నెల్లి స్పష్టం చేశారు. ఆరోజు గన్‌మన్లు లేకపోవడంతో తాను ఇంటికే పరిమితమయ్యానని, అటువంటప్పుడు కారంపూడి ఎలా వెళ్తానని ఎదురు ప్రశ్నించారు. పోలింగ్‌ రోజున, ఆ తరువాత మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీతో పాటు ప్రత్యక్ష సాక్షులు, నేరాలకు సంబంధించిన బాధితులు ఉన్నప్పటికీ పిన్నెల్లి చెప్పిన సమాధానాలు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Updated Date - Jul 11 , 2024 | 07:15 AM