Share News

100 రోజుల్లో టీసీయస్ కు శంకుస్థాపన

ABN , Publish Date - Oct 19 , 2024 | 04:15 AM

విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సెంటర్‌ ఏర్పాటుకు వంద రోజుల్లోగా శంకుస్థాపన చేస్తామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

100 రోజుల్లో టీసీయస్ కు శంకుస్థాపన

విశాఖ ఐటీ రంగానికి ఇది గేమ్‌ చేంజర్‌

సూపర్‌ 6 అమలుకు కట్టుబడి ఉన్నాం.. నవంబరు లేదా డిసెంబరులో పూర్తిస్థాయి బడ్జెట్‌

వాట్సాప్‌ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ సేవలు.. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వం

జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు.. వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం

రుషికొండ ప్యాలె్‌సను ఏం చేయాలో ప్రజలే చెప్పాలి: మంత్రి లోకేశ్‌

జగన్‌ పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరు

విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సెంటర్‌ ఏర్పాటుకు వంద రోజుల్లోగా శంకుస్థాపన చేస్తామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఇప్పటికే విశాఖలో పలు ఐటీ కంపెనీలు ఉన్నాయని, అయితే టీసీఎస్‌ విశాఖ ఐటీ రంగానికి గేమ్‌ చేంజర్‌ వంటిదని పేర్కొన్నారు. టీసీఎస్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. జగన్‌ మీడియాపై దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం విశాఖపట్నం వచ్చారు. అనంతరం కోర్టు బయట విలేకరులతో మాట్లాడారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన పలు పరిశ్రమలన్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వెళ్లిపోయాయన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తరువాత పరిశ్రమలు, ఐటీ కంపెనీలతో మాట్లాడి ఒక్కొక్కటి తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలకు సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు యువ ఐఏఎస్‌ అధికారితో ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వచ్చే నెలలో అమెరికా పర్యటన ఉందని, అక్కడ పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతానని వివరించారు.

వర్సిటీల్లో అక్రమాలపై విచారణ

సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్‌ స్పష్టం చేశారు. వచ్చే నవంబరు లేదా డిసెంబరులో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడతామని తెలిపారు. ప్రజలకు సంబంధించినంత వరకూ జనన, మరణ, కులం, వివాహ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా త్వరలో వాట్సా్‌పల ద్వారా సేవలు అందిస్తామని వెల్లడించారు. విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి ఉపకులపతుల నియామకం చేపట్టిన తరువాత గత ప్రభుత్వ హయాంలో వర్సిటీల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

జగన్‌ ఎందుకు భయపడుతున్నారు?

గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తనపై సాక్షి తప్పుడు కథనం రాసిందని, కోర్టులో పరువునష్టం దావా వేశానన్నారు. ఈ కేసుకు సంబంధించి క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు రెండోసారి వచ్చానని, గతంలో కానీ, ఇప్పుడు కానీ ప్రభుత్వ వాహనాలు వినియోగించలేదన్నారు. ఇప్పటికీ సాక్షి తప్పుడు కథనాలు రాస్తోందని, వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెడ్‌ బుక్‌ చూస్తే వైసీపీ అధినేత జగన్‌ ఎందుకు భయపడుతున్నారని లోకేశ్‌ ప్రశ్నించారు. ఎన్టీయే ప్రభుత్వం ఉన్నంత వరకు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రశ్నరాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్‌ నిర్మించారని, అక్కడ పర్యావరణ చట్టాలు ఉల్లంఘించడంతో ఎన్జీటీ రూ.200 కోట్లు జరిమానా విధించిందన్నారు. రుషికొండ ప్యాలె్‌సను ఏ విధంగా వినియోగించుకోవాలో ప్రజలు సూచనలు ఇవ్వాలని లోకేశ్‌ కోరారు. ప్రైవేటు షాపుల్లో మద్యం ఎంఆర్‌పీకే అమ్మాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. తెలుగుదేశం పార్టీ పెద్ద కుటుంబమని, కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయని, కూర్చుని చర్చించుకుని పరిష్కరిస్తామన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 04:15 AM