Share News

ఉచిత ఇసుక.. ధరల మరక!

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:14 AM

టీడీపీ కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తోంది. ‘ఉచితం’ అంటే... ప్రజలపై భారం పడకూడదు. జగన్‌ ప్రభుత్వంలో మాదిరిగా ప్రజలకు ఇసుక కష్టాలు ఉండకూడదు.

ఉచిత ఇసుక.. ధరల మరక!

ఉద్దేశం ఉత్తమం.. ఆచరణలో బాలారిష్టాలు

‘ఉచితం’ అమల్లో సమస్యలెన్నెన్నో..

సామాన్యులకు ఇసుక ఇంకా భారమే

ఉచిత విధానంతో దక్కని ఉపశమనం

జనానికి చేరని ఉత్తమ పథకం ప్రయోజనం

ఉచితానికి నిర్వహణ చార్జీల గండం

జీఎస్టీ వేయడంపైనా జనం కినుక

రవాణా చార్జీల్లో వ్యత్యాసంతో భారం

అమలులో లోపాల దిద్దుబాటు తక్షణావసరం

నాడు ఏం జరిగింది?

జగన్‌ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో అడ్డగోలుగా దోపిడీ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి సహజ సంపదను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిన ఇసుక తవ్వేసి... అందినకాడికి సొమ్ము చేసుకున్నారు. ఐదేళ్లూ జనాలకు చుక్కలు చూపించారు. ఇసుక దందాలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తాడేపల్లి వరకు వేల కోట్లు దోచుకోవడం బహిరంగ రహస్యం!

నేడు ఏం జరుగుతోంది?

చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకున్నారు. జగన్‌ ప్రభుత్వంలో సాగిన దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించారు. దీంతో ఇక ఇసుక కష్టాలు ఉండవని అంతా భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రజలకు ఊరట కలగలేదు. కొన్నిచోట్ల గతం కంటే ఇప్పుడే భారమైందన్న అభ్యంతరాలూ వ్యక్తమవుతున్నాయి. ఎందుకిలా?

సమస్య ఎక్కడ?

ఉచిత ఇసుక ఆలోచన అత్యుత్తమమైనదే అయినా దాని అమల్లో ఎదురవుతున్న అవాంతరాలు ప్రజల కష్టాలను పూర్తిగా తొలగించలేకపోవడానికి ప్రధాన కారణం. ఇసుక ఉచితమే అయినా, రవాణా, నిర్వహణ చార్జీల వసూలు విషయంలో ఏకరూపత లేకపోవడం, వర్షాకాలం కావడంతో ఇసుక రీచ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, తగినంత స్టాక్‌ లేకపోవడం సమస్యను తొలగించలేకపోతున్నాయి.

ఎందుకిలా..

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాలరాజుపల్లి వద్ద ఇసుక రీచ్‌ ఉంది. అక్కడ గతంలో ట్రాక్టర్‌ ఇసుక 4 నుంచి 5 వేల రూపాయల మధ్యలో దొరికేది. ఇప్పుడూ అవే ధరలు అమలవుతున్నాయని అంగళ్లుకు చెందిన విష్ణురెడ్డి చెప్పారు. కానీ గతంలో 16 టన్నుల టిప్పర్‌ ధర రూ.21 వేలు ఉంటే, ఇప్పుడు ఏకంగా 27 వేలు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

టీడీపీ కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తోంది. ‘ఉచితం’ అంటే... ప్రజలపై భారం పడకూడదు. జగన్‌ ప్రభుత్వంలో మాదిరిగా ప్రజలకు ఇసుక కష్టాలు ఉండకూడదు. గతంలో ఇష్టానుసారం సాగిన దోపిడీకి బ్రేక్‌ పడాలి. వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఇసుక తీసుకెళ్లాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అప్పుడూ ఇప్పుడూ అవే ధరలు. చిత్రంగా కొన్నిచోట్ల ఇంకా అధిక ధరకు ఇసుక కొనాల్సి వస్తోందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం కచ్చితంగా ప్రజోపయోగకరమైనదే. కానీ దాని అమలు తీరులోనే లోపాలు, కష్టనష్టాలు కలగలిసి ప్రజలకు దాని ప్రయోజనం దక్కకుండా చేస్తున్నాయి. మొన్నటిదాకా సాగిన అడ్డగోలు అమ్మకాల కన్నా ఉచిత విధానంలో ఇసుక ఎందుకు భారమవుతోందన్నది తక్షణం దృష్టిపెట్టాల్సిన అంశంగా మారింది. గత ప్రభుత్వంలో గంపగుత్తగా 20 టన్నుల లారీకి ఒక రేటు, 4 టన్నుల ట్రాక్టర్‌కు ఒక రేటు అని బ్లాక్‌మార్కెట్‌లో అమ్మారు. ప్రభుత్వానికి తోచినంత జమ చేసి మిగతాది దోచేశారు. వ్యాపారులు సిండికేట్‌ అయి 20 టన్నుల ఇసుక లారీని 25 వేల నుంచి 40 వేలకు అమ్మిన రోజులున్నాయి. అడ్డగోలు ధరల దెబ్బకు నిర్మాణ రంగమే పడకేసే పరిస్థితి ఎదురైంది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోంది. ఇసుక ఉచితమే అయినా, రవాణా చార్జీలను ప్రజలే భరించాల్సి ఉంటుంది. దూరాన్ని బట్టి ఈ చార్జీల భారం వేర్వేరుగా ఉండటంతో సమస్య ప్రారంభమైంది. కొన్నిచోట్ల ఇసుక ధర గతం కంటే ఏ మాత్రం తగ్గకపోగా, పెరిగిందన్న అభ్యంతరాలూ వ్యక్తమవడం ప్రారంభమైంది. ఉత్తమమైన పథకం అమల్లో లోపాలను ఈ ధరల కష్టాలు చెప్పకనే చెబుతున్నాయి. రవాణా చార్జీలు, నిర్వహణ చార్జీలు (ఆపరేషనల్‌ కాస్ట్‌), జీఎస్టీ వసూలు చేస్తుండటం, అవి ఒక్కోచోట ఒక్కోరకంగా ఉండటం సమస్యను తీవ్రతరం చేశాయి. చాలాచోట్ల నిర్వహణ చార్జీలు.. రవాణా చార్జీలతో సమానంగా ఉంటున్నాయి. కొన్ని స్టాక్‌యార్డ్‌ల్లో నిర్వహణ చార్జీలే ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఉచితంగా ఇవ్వడమే ప్రధాన లక్ష్యం అనుకుంటే నిర్వహణా చార్జీల భారం నుంచి సామన్యుడికి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇసుక ఉచితమైనప్పుడు జీఎస్టీ ఎందుకన్నది మరో కీలక ప్రశ్న.

ghk.jpg


లోపాలు సరిదిద్దకుండా...

ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలని చంద్రబాబు 2016-19 మధ్య ఉచితంగా పంపిణీ చేశారు. ఇసుకకు ధర లేదు కానీ, గనుల శాఖకు చెల్లించే సీనరేజీ, ఇతర ఫీజులు, రవాణ చార్జీలు కలిపి ఎక్కువగానే ఉండేవి. ఆ ప్రభావం ఆ నాటి ఎన్నికలపై కూడా చూపింది. జగన్‌ వచ్చాక ఉచిత విధానం ఎత్తివేసి ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చారు. అది లాభసాటి వ్యాపారంగా మారడంతో ఇసుకలో చేయని అక్రమమంటూ లేదు. ఇటీవల అధికారం చేపట్టిన చంద్రబాబు మళ్లీ పాత ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో అమలు చేసిన ఉచిత విధానంలోని లోపాలు, సమస్యలను గుర్తించి పరిష్కరించకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా ముందడుగు వేశారు. ఉచిత ఇసుక పాలసీలు తీసుకొచ్చారు. కానీ అది అమల్లోకి వచ్చిన మరుసటి రోజు నుంచే కొత్త చిక్కులు, తలనొప్పులు రావడం మొదలైంది. సందట్లో సడేమియా అంటూ కొందరు కృత్రిమ కొరతతో సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ఉచిత ఇసుకపై పెనుదుమారం చెలరేగుతోంది.

మాట నిలబెట్టుకున్నా...

తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇసుక కష్టాలు తీరుస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు ఇచ్చారు. జగన్‌ పాలనలో ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభించడం లేదని, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అనేక వాస్తవాలను ప్రజల ముందుంచారు. తాను అధికారంలోకి రాగానే ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తానని మాటించారు. మాట చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే జూలై 8న ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టారు. అప్పటికి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్టాక్‌యార్డుల్లో అందుబాటులో ఉన్న ఇసుకను, వైసీపీ నేతల కబందహస్తాల నుంచి స్వాధీనం చేసుకున్న ఇసుకను ప్రజలకు ఉచితంగా సరఫరా చేశారు. జగన్‌ ప్రభుత్వంలో మాదిరిగా తాము ఇసుకకు ధర తీసుకోమని, కేవలం చట్టబద్ధమైన ఫీజులు, పన్నులు మాత్రమే కట్టాలని, ఇదేమీ ప్రజలకు భారం కాదని జీఓలో పేర్కొన్నారు. జీఓలో పేర్కొన్న అంశాలు తొలుత ప్రజలకు అర్థం కాలేదు. ఉచిత విధానం అమల్లోకి వచ్చిన తర్వాతే అసలు కష్టాలు తెలుస్తున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌, ఇసుక వాహనాల ఎంప్యానల్‌మెంట్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌, పక్కాగా ధరల అమలు వంటి అంశాలు ఎన్ని చెబుతున్నా ఆచరణలో బిల్లుల భారం వినియోగదారులను బాధిస్తోంది.

రీచ్‌లన్నీ తెరిస్తే కష్టాలకు చెల్లు..

ఇటీవల వరదలు రావడం, రీచ్‌లు ఓపెన్‌ కాకపోవడం కూడా ఇసుక కొరతకు కారణమని తెలుస్తోంది. దూర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకురావడం వల్ల రవాణా చార్జీలు భారం ఎక్కువగా పడుతోంది. ప్రస్తుతం 20 టన్నులకే పరిమితం చేశారు. మరో పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రీచ్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల చెప్పారు. అప్పటి నుంచి పరిస్థితి మారుతుందని అధికారులు చెబుతున్నారు.

మేలు ఏదీ?

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి పనసపాడుకు వీరబాబు అనే వ్యక్తి 20 టన్నుల ఇసుక బుక్‌ చేసుకున్నారు. కోటిలింగాల స్టాక్‌ పాయింట్‌గా ఉంది. ఇసుకకు రూపాయి కూడా ధర వసూలు చేయలేదు. కానీ రవాణా చార్జీ 9,276 వసూలు చేశారు. మరో 7,363.81 రూపాయలు ఇతర చార్జీలు ఉన్నాయి. అవి దేనికి వసూలు చేశారో బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. ఇలా 20 టన్నుల లారీకి 16,640 రూపాయలు వసూలు చేశారు. 20 టన్నుల ఇసుకకు జీఎస్టీ, ఇతర చట్టబద్ధమైన ఫీజులు ఎంతుంటాయి? మహా అయితే 2300 రూపాయల వరకు ఉంటాయి. ఆ వివరాలు ప్రస్తావించకుండా ఇతర చార్జీల పేరిట వినియోగదారుడి నుంచి 7,363.81 రూపాయలు వసూలు చేశారు. అంతకు ముందు జగన్‌ హయాంలో 14,500 రూపాయలకు ఇసుక దొరికిందని ఇదే ప్రాంతానికి చెందిన వారు చెబుతున్నారు. అంటే గతానికంటే ఇప్పుడే 2,140 రూపాయలు ఎక్కువ అయ్యిందన్నది వాళ్ల లెక్క. ఇతర చార్జీలు ఎందుకు భారీగా ఉన్నాయా అని ఆరా తీస్తే.. నిర్వహణ చార్జీలు రూ.4,811, చట్టబద్ధమైన ఫీజులు రూ.1,760, జీఎస్టీ రూ.762 అని అధికారులు లెక్కలు చెబుతున్నారు.


చార్జీల మోత

గణేష్‌ అనే వ్యక్తి పార్వతీపురం మన్యం జిల్లా కాట్రగడ్డ డీ సిల్టేషన్‌ పాయింట్‌ వద్ద 20 టన్నుల ఇసుక బుక్‌ చేసుకున్నారు. విశాఖలోని కంచరపాలెంలో ఇసుక డెలివరీ చేశారు. ఇందుకు ఇత ర చార్జీల కింద వసూలు చేసిన ఫీజు 5,142 రూపాయలు.

అన్నమయ్య జిల్లాలోని ఎర్రబల్లి స్టాక్‌పాయింట్‌ నుంచి కడపలోని దర్గావీధికి 20 టన్నుల లారీకి 14,330 రూపాయలు చార్జీ వసూలు చేశారు. రవాణా చార్జీ రూ.7476 కాగా, మిగతాది నిర్వహణ చార్జీలు, జీఎస్టీ.

బ్లాక్‌మార్కెటింగ్‌

పల్నాడు జిల్లాలో ఇసుక బ్లాక్‌మార్కెటింగ్‌ చాలా ఎక్కువగా ఉంటోంది. నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల్లో టన్ను ఇసుక బ్లాక్‌లో రూ.1,800కు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుక 8 వేల వరకు ఉంటోంది. పోర్టల్‌ ద్వారా ఇసుక బుకింగ్‌ జరగడం లేదని ప్రజలు చెబుతున్నారు. పోర్టల్‌లో బుకింగ్‌ ఓపెన్‌ అయిన కాసేపటికే స్టాక్‌ లేదని చూపిస్తోంది. కొందరు బ్లాక్‌ మార్కెంటింగ్‌ వ్యక్తుల వల్ల ఇలా జరుగుతోందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దూరం దెబ్బ..

విజయనగరం జిల్లాలో నాలుగైదు నెలల క్రితం ట్రాక్టర్‌ ఇసుక రూ.4,500కు దొరికితే, ఇప్పుడు అది 9 వేలకు చేరింది. లారీ ఇసుక 23 వేలకు లభిస్తే, ఇప్పుడు 40 వేలు పెట్టాల్సి వస్తోంది. ఇది కూడా ఒడిశా, శ్రీకాకుళం నుంచి తెచ్చుకుంటున్నారు. ఇసుక కొరత ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బొబ్బిలి స్టాక్‌పాయింట్‌ నుంచి విజయనగరానికి ఇసుక రావాలంటే రవాణా చార్జీల భారం తడిసిమోపెడవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని ప్రాంతాలకే లబ్ధి

పార్వతీపురం మన్యం జిల్లాలో ఉచిత ఇసుక వల్ల కొన్ని మండలాల వారికే మేలు జరుగుతోంది. బామిని, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట మండల ప్రజలకే ఉచితం అందుబాటులో ఉంటోంది. మిగిలిన 12 మండలాలకు ఇసుక దూరాభారంగా ఉంది. పార్వతీపురం నుంచి 80 కి.మీ. దూరంలోని కాట్రగడ్డ వద్ద ఇసుక రీచ్‌ ఉంది. దీంతో ట్రాక్టర్లలో ఇసుక తీసుకురాలేకపోతున్నారు. పార్వతీపురం, సాలూరు, సీతానగరం, మక్కువ, వీరఘట్టం, కొమరాడ, పాలకొండ తదితర మండలాల పరిధిలో వేగవతి, నాగావ ళి నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. గతంలో ట్రాక్టర్‌ ఇసుక 4 వేలు ఉంటే, ఇప్పుడు 5 వేలపైనే అమ్ముతున్నారు.


బుకింగ్‌లో అక్రమాలు

నెల్లూరు జిల్లాలో ఇసుక బుకింగ్‌ నుంచే అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి. పోర్టల్‌ తెరవగానే కొందరు ట్రాన్స్‌పోర్టర్లు బినామీ పేర్లతో బుకింగ్‌ చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో సామాన్యులకు ఇసుక దొరడం లేదని చెబుతున్నారు. బినామీ పేర్లతో ఇసుక బుకింగ్‌ చేసుకున్న ట్రాన్స్‌పోర్టర్లు బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. పోతిరెడ్డిపాలెం యార్డు నుంచి 20 టన్నుల ఇసుక టిప్పర్‌ను 10 వేలకు తీసుకొని మార్కెట్‌లో 20 వేలపైనే అమ్ముతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే ధర ఉండేది.

వెయిటింగ్‌ చార్జీలు

పశ్చిమగోదావరి జిల్లాలో 18 టన్నుల ఇసుక అంటే 4.5 యూనిట్‌లు వైసీపీ ప్రభుత్వంలో రూ.14వేలకు లభ్యమైంది. ఇబ్బడి ముబ్బడిగా తవ్వకాలు సాగించడంతో విరివిగా ఇసుక దొరికేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలను పకడ్బందీగా పాటిస్తూ అడ్డగోలు తవ్వకాలకు చెక్‌ పెట్టారు. ఇప్పుడు గోదావరిలో తవ్వకాలు లేవు. గతంలో నిల్వ ఉంచిన ఇసుకనే విక్రయించారు. దాంతో దళారులు రంగ ప్రవేశం చేశారు. ఇసుక కోసం లారీలు నాలుగు రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోందని రోజుకు రూ.1500లు అదనంగా రవాణా చార్జీలు వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న స్టాక్‌ పాయింట్‌ల వద్ద రూ.5 వేలకే లారీ ఇసుక అంటే 18 టన్నులు లభ్యమవుతుంది. లారీ కిరాయి రూ.6 వేలు. పశ్చిమగోదావరి జిల్లాకు రూ.11 వేలకు ఇసుక లభ్యం కావాలి. నాలుగురోజులు వెయిటింగ్‌ చార్జీలు అదనంగా రూ.6 వేలు వేస్తున్నారు. మొత్తం చార్జీలు, ఖర్చులు కలిపినా 17వేలకు ఇసుక రావాలి. కానీ రూ.30 వేలకు అమ్మకాలు సాగిస్తున్నారు. దళారులు మధ్యలో లబ్ధి పొందుతున్నారు.

ఇసుక కొరత

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. ట్రాక్టర్‌ ఇసుక గతంలో రూ.800కు మించి అమ్మలేదు. బయట ప్రాంతాలకు అయితే రూ.1,500 నుంచి 2 వేలకు అమ్మేవారు. ఇప్పుడు ట్రాక్టర్‌ ఇసుక 4 వేలు పెట్టినా దొరకడం లేదు. కృష్ణా తీరం వెంబడి వరదలు రావడంతో ఇసుక తవ్వే అవకాశం లేదు. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో ఇసుక కష్టాలు తీరుతాయని అధికారులు చెబుతున్నారు.

ఇవీ సమస్యలు

ఇసుక బుకింగ్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చాం. ఎనీవేర్‌ బుకింగ్‌ అని ప్రభుత్వం చెబుతోంది. ఇసుక పంపిణీలో ఏ సమస్యలు లేవు, సోషల్‌ మీడియాలోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గనుల శాఖ అధికారులు పదేపదే చెబుతున్నారు. నేల విడిచి సాముచేస్తున్న వారికి క్షేత్రస్థాయి పరిస్థితి తెలియడం లేదు. సోషల్‌ మీడియాలో జరుగుతున్నది చాలా తక్కువ. క్షేత్రస్థాయిలో ఉన్న ఆందోళనే చాలా ఎక్కువ. అది ప్రభుత్వానికి నష్టం చేస్తోంది. ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన ప్రధాన అంశాలివీ..

నిర్వహ ణ చార్జీల భారం చాలా ఎక్కువగా ఉంటోంది. దీన్ని నియంత్రించకపోతే సర్కారు ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల సామాన్యులకు కలిగే మేలు కనిపించదు.

ఆన్‌ లైన్‌ బుకింగ్‌ పేరుకే గొప్పగా ఉంది. ఆచరణలో సామాన్యుడిని దెబ్బతీసేలా ఉంది. ఇసుకను బ్లాక్‌మార్కెట్‌ చేసేవారు ఓ పనిగా పెట్టుకొని సైట్‌ ఓపెన్‌ కాగానే బుకింగ్‌ చేసుకుంటున్నారు. ఉన్న స్టాక్‌ అంతా బ్లాక్‌మార్కెట్‌దారులకే వెళ్లిపోతోంది. సామాన్యులు బుకింగ్‌ చేసుకోవాలంటే నో స్టాక్‌ అప్షన్‌ చూపిస్తోంది. ఇలా బ్లాక్‌మార్కెట్‌ చేసుకునేవారు 20 టన్నుల టిప్పర్‌ను 25 వేలకు పైనే అమ్ముకుంటున్నారు.

నోరున్నవారిదే పెత్తనమవుతోంది. సామాన్యుల దగ్గరికి ఇసుక వచ్చేసరికి స్టాక్‌లో ఉన్నదంతా వెళ్లిపోతోంది. దీంతో ఉచితం అనేది కొందరికే మేలు అన్నట్లుగా సాగిపోతోంది.

నిర్వహణ లోపాలు స్పష్టంగా ఉన్నాయి. అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారుతోంది. ఉచితం అనే పదానికే అర్థం లేకుండా అడ్డగోలుగా చార్జీలు వేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఇప్పటి దాకా ఉచిత ఇసుక అమలుపై సోషల్‌ ఆడిట్‌ చేయించి లోపాలను కనిపెట్టి పరిష్కారాలు చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 07 , 2024 | 04:14 AM