Pawan kalyan: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 09 , 2024 | 06:23 PM
స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇక వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచుతున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 15 కార్యక్రమాలకు ప్రస్తుతం అధికారికంగా ఇస్తు్న్న రూ.100, రూ.250 మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన వెలువడింది.
జనాభా ఆధారంగా నిధులు కేటాయింపు..
‘‘ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నాం. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5 వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందిస్తాం’’ అని పవన్ కల్యాణ్ వివరించారు.
ఘనంగా వేడుకలు..
ప్రభుత్వం కేటాయించే నిధులతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందజేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్‌ను ఇటీవల పలువురు సర్పంచులు కలిసిన సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని చెప్పారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నదీ తెలియచేయాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. గత 34 ఏళ్లుగా రూ.100, రూ.250 చొప్పునే అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే ఆ స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదని, ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ స్పష్టం చేశారు. ఆ మేరకు రూ.10 వేలు, రూ.25 వేలు అందజేయాలని నిర్ణయించారు. పంచాయతీల అధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. జాతీయ పండుగలైన స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహించాలని సూచించారు.
పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగం విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆటల పోటీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలని సూచించారు. బహుమతులు అందించాలని, పంచాయతీ పరిధిలోని స్వతంత్ర సమరయోధులు, రక్షణ రంగం నుంచి వచ్చివారినీ, పారిశుధ్య కార్మికులను సత్కరించాలంటూ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక పాఠశాలలు, అంగన్వాడీల్లోని పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు అందించాలని, పారిశుధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.