పెళ్లి దుస్తులు కొనేందుకు వెళ్లి..
ABN , Publish Date - May 19 , 2024 | 03:47 AM
మరో పది రోజుల్లో పెళ్లి. పెళ్లి కొడుకు సహా కుటుంబ సభ్యులు రెండు కార్లలో హైదరాబాద్‌కు వెళ్లి పెళ్లి దుస్తులు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం
డివైడర్‌ను ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లిన కారు
రేకు చొచ్చుకెళ్లి పెళ్లికొడుకు తల, మొండెం వేర్వేరు
తండ్రి, సోదరుడి భార్య, పిల్లలూ మృతి
గుత్తి, మే 18: మరో పది రోజుల్లో పెళ్లి. పెళ్లి కొడుకు సహా కుటుంబ సభ్యులు రెండు కార్లలో హైదరాబాద్‌కు వెళ్లి పెళ్లి దుస్తులు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. స్వస్థలానికి మరో గంటలో చేరుకోవాల్సి ఉండగా ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా డివైడరును ఢీకొని, అవతలి వైపు వస్తు న్న లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించగా, మరొకరు గాయపడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పెళ్లికొడుకు షేక్ ఫిరోజ్ బాషా(30), ఆయన తండ్రి అలీసాహెబ్(56), సోదరుడి భార్య జహీరా బాను(40), సోదరుడి పిల్లలు మహమ్మద్ ఆయాన్(6), మహమ్మద్ ఆమాన్(3), పిన్ని రెహనా బేగం(40) మృతిచెందారు. ఫిరోజ్ పిన్ని కొడుకు మహమ్మద్ గౌస్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం నగరంలోని బిందెల కాలనీకి చెంది న షేక్ ఫిరోజ్ బాషా ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి. ఈ నెల 27న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి దుస్తులు కొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు అందరూ రెండు కార్లలో హైదరాబాద్ వెళ్లారు. రాత్రి వరకూ షాపింగ్ చేసి తిరుగు ప్రయాణమయ్యారు.
ఫిరోజ్ బాషా, తండ్రి అలీసాహెబ్, పిన్న మ్మ రెహనా బేగం, సోదరుడి పిల్లలు మహమ్మద్ ఆయాన్, ఆమాన్, వదిన జహీరా బాను, పిన్నమ్మ కొడుకు మహమ్మద్ గౌస్ ఒక కారులో ఎక్కారు. మరో కారులో ఫిరోజ్ బాషా తల్లి, ఆమె కూతురు, అల్లుడు, మరో ఇద్ద రు బయలుదేరారు. వీరు గంట ముందుగానే అనంతపురానికి చేరుకున్నారు. ఫిరోజ్, ఇతర కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు తెల్లవారుజామున గుత్తి మండలం బాచుపల్లి వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న మహమ్మద్ గౌస్ నిద్రమత్తు కారణంగా అదుపు తప్పింది. డివైడరును ఢీకొని, అవతలి వైపున లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. లారీ మడ్‌గార్డ్ రేకు చొచ్చుకెళ్లడంతో ఫిరోజ్ తల మొండెం నుంచి వేరైంది. ప్రమాద స్థలంలోనే ఆయనతో సహా నలుగురు మృతిచెందారు. డ్రైవింగ్ చేసిన మహమ్మద్ గౌస్ చికిత్స పొందుతున్నారు. ఫిరోజ్ తండ్రి అలీసాహెబ్ గుజరీ వ్యాపారి. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు, కుమార్తెకు పెళ్లిళ్లు అయ్యాయి. పెద్దకొడుకు రెండేళ్ల క్రితం మృతిచెందాడు. ఇప్పుడు కారు ప్రమాదంలో అలీసాహెబ్‌తో పాటు మిగిలిన ఒక్క కొడుకు, వితంతువైన పెద్ద కోడలు, ఆమె ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు.