Share News

గోదావరి ఉగ్రరూపం

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:14 AM

ఏలూరు జిల్లాలోని పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు పోలవరానికి చేరుతోంది.

గోదావరి ఉగ్రరూపం

ముప్పు ముంగిట కొల్లేరు.. అప్రమత్తమైన యంత్రాంగం

నేడు మళ్లీ అల్పపీడనం.. నాలుగైదు రోజులు వర్షాలు

ఏలూరు/అమలాపురం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలోని పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు పోలవరానికి చేరుతోంది. బుధవారం నాటికి పోలవరం స్పిల్‌వే వద్ద 175 గేట్లను ఎత్తేసి 8.22 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఉన్న గండిపోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో గురువారం తెల్లవారుజాము నాటికి రెండో ప్రమాద హెచ్చరిక దిశగా వరద క్రమేపి పుంజుకుంటోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ముంపు మండలాలను జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి స్వయంగా సందర్శించారు. గర్భిణులను, వయో వృద్ధులను, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో కొండవాగుల తీవ్రత పెరిగింది. కాగా, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీవర్షాలతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Updated Date - Sep 05 , 2024 | 04:14 AM