Share News

స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:02 AM

ఎగువ భాగంలో ఓ మోస్తరు వర్షాలు పడడంతో గోదావరి ఉధృతి స్పల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో వర్షాలు లేవు.

స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

భద్రాచలం, పాపికొండలు, పోలవరం స్పిల్‌వే, రాజమహేంద్రవరం, కోనసీమలో ఉధృతంగానే

ఇప్పటికే 743 టీఎంసీల నీరు సముద్రం పాలు

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), పోలవరం, జూలై 26: ఎగువ భాగంలో ఓ మోస్తరు వర్షాలు పడడంతో గోదావరి ఉధృతి స్పల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో వర్షాలు లేవు. కానీ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరిక ఉంది. అయితే వచ్చిన వరద వచ్చిన వరద వచ్చినట్టు సముద్రంలోకి వెళ్లిపోతే గోదావరి జిల్లాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ రోజుల తరబడి నీరు నిలవడం వల్ల లంకల్లోని గ్రామాలతోపాటు, స్లూయిజ్‌ల నుంచి నీరు వెనక్కి రావడంతో డ్రైన్లు పొంగుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల పొలాలు, ఊళ్లు మునిగిపోతున్నాయి. ఏజెన్సీ, లంక గ్రామాల్లోని నివాస ప్రాంతాలు నీటిలో నానిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. పశువుల మేత కొరత ఏర్పడుతోంది. 22న ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అప్పటికే భద్రాచలం వద్ద మొదటి హెచ్చరిక అమలులో ఉంది. తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినా. వరద తగ్గుముఖం పట్టాక ఉపసంహరించారు. ఇప్పుడు మళ్లీ వరద పెరగడంతో ప్రస్తుతం భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉంది. ఇక కోనసీమలోనూ లంకలన్నీ నీళ్లలో ఉండిపోవడంతో అక్కడ జీవనం కష్టమైంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి నుంచి జూన్‌ 1నుంచి ఇప్పటివరకూ 743 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. పోలవరం కడితే చాలా వరకూ నీటిని నిల్వ చేయవచ్చు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 13.60 అడుగులు ఉండగా, 12,52,949 క్యూసెక్కులు సముద్రంలోకి పోతోంది. గోదావరి పాండ్‌ లెవల్‌ 14.81 మీటర్లతో నిండుకుండలా ఉంది.

పట్టిసీమ నుంచి 3,540 క్యూసెక్కులు విడుదల

ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడికాల్వకు శుక్రవారం 3,540 క్యూసెక్కుల జలాలు విడుదల చేసినట్టు పట్టిసీమ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు పెద్దిరాజు తెలిపారు. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి స్పల్పంగా పెరిగి 23.877 మీటర్లకు చేరుకుంది. వరద జలాలను ఎప్పటికప్పుడు 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న 11,06,947 క్యూసెక్కుల వరద జలాలు దిగువకు విడుదల చేసినట్లు ఈఈ మల్లిఖార్జునరావు, డీఈ మాధవరావు తెలిపారు.

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం, జూలై 26: శ్రీశైలం జలాశయానికి శుక్రవారం భారీగా వరద కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు 2,11,208 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత 861.00 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 109.0060 టీఎంసీలుగా నమోదైంది. ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 35,315క్యూసెక్కులు, కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 9,921 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌ జలాశయానికి విడుదల చేశారు.

Updated Date - Jul 27 , 2024 | 03:02 AM