Share News

ఎన్నికల ముందు అస్మదీయులకు మేళ్లు

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:26 AM

గెలుపు ధీమా సడలిపోవడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు అస్మదీయ సంస్థలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ ఆస్తులను పంచిపెడుతున్నారు.

ఎన్నికల ముందు అస్మదీయులకు మేళ్లు

మళ్లీ వస్తామో రామోననే భావనతో అడ్డంగా దోచిపెట్టిన జగన్‌ ప్రభుత్వం

ఇండోసోల్‌కు 21వేల ఎకరాలు ధారాదత్తం

నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందు అప్పగింత

యాక్సి్‌స’కు రూ.వేలకోట్ల లబ్ధికి గట్టి ప్రయత్నం

డిస్కమ్‌లతో 21 ఒప్పందాలు..రద్దుచేసిన ఈఆర్‌సీ

ఆమోదించినట్టైతే జనంపై రూ.7300 కోట్ల భారం

తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్న ఈఆర్‌సీ

అమరావతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : గెలుపు ధీమా సడలిపోవడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు అస్మదీయ సంస్థలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ ఆస్తులను పంచిపెడుతున్నారు. యాక్సి్‌సకు రూ.7300 కోట్లు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే.. ఇండోసోల్‌కు 20వేల ఎకరాలను ధారాదత్తం చేశారు. నిజానికి, 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే సంప్రదాయేతర ఇంధనోత్పత్తి సంస్థలతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ జగన్‌ రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఒప్పందాలను (పీపీఏ) ఏకపక్షంగా రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీంతో.. మళ్లీ ఆ పీపీఏలను డిస్కమ్‌లు కొనసాగించాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ.. జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని యాక్సిస్‌ సంస్థ మాత్రం అప్పట్లో తప్పుబట్టలేదు. ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి...మళ్లీ పీపీఏలను చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ జగన్‌ రద్దు చేయడంతో యాక్సిస్‌, సుజలాన్‌ సంస్థలు సంయుక్తంగా చేసుకున్న ఒప్పందాలు సహజంగానే రద్దవుతాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కోతో చేసుకున్న ఒప్పందాన్ని సుజలాన్‌ రద్దు చేసుకుంది. కానీ, యాక్సిస్‌ మాత్రం డిస్కమ్‌లతో 774.90 మెగావాట్ల విండ్‌ ఎనర్జీ కోసం 21 ఒప్పందాలను చేసుకుంది. మిగిలిన సంప్రదాయేతర ఇంధనోత్పత్తి సంస్థలన్నింటితోనూ ఒప్పందాలను రద్దు చేసుకున్నాక ..

యాక్సి్‌సతో మాత్రమే ప్రత్యేకంగా డిస్కమ్‌లు ఒప్పందం చేసుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని ప్రభుత్వవర్గాల్గో గుసగుసలు వినిపించాయి. డిస్కమ్‌లతో తాము చేసుకున్న కొనుగోలు ఒప్పందం మేరకు .. విద్యుత్తు ధరను నిర్ధారించాలంటూ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ సంస్థను ‘యాక్సిస్‌’ ఆశ్రయించింది. ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుని ధర ఖరారుచేస్తే.. రాష్ట్ర వినియోగదారులపై రూ.7300 కోట్ల భారం పడుతుందని ఈఆర్‌సీ తేల్చి చెప్పింది. వినియోగదారుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తాము ధరను ఖరారు చేయడం సాధ్యం కాదని ఈ నెల 19వ తేదీన తేల్చి చెప్పింది. బహిరంగ మార్కెట్లో సోలార్‌ఎనర్జీ కార్పొరేషన్‌కు (సెకీ) కరెంటును అమ్ముకోవాలంటూ యాక్సి్‌సకు ఈఆర్‌సీ సూచిస్తూ ఆ పీపీఏలను తోసిపుచ్చింది. మరోవైపు, మరో అస్మదీయ సంస్థ ఇండోసోల్‌ దరఖాస్తు చేయడమే ఆలస్యం 21వేల ఎకరాల భూములను కట్టబెడుతూ జగన్‌ సర్కారు ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకుంది. గతఏడాది నవంబరు 27వ తేదీన తమకు భూమి కేటాయించాలంటూ న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ సంస్థకు ఇండోసోల్‌ లేఖ రాసింది. అయితే, అనూహ్యంగా అదేరోజున ఇండోసోల్‌ అడిగిన భూములను ఎక్కడెక్కడ ఎంతెంత ఇవ్వాలో సర్వే నంబర్లతో సహా ఆ సంస్థ... రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేసింది. ఈ సిఫారసు చేయడమే ఆలస్యమన్నట్లుగా కేబినెట్‌ ఆమోదానికి పంపేయడం .. మంత్రివర్గం ఆమోదించడం .. జరిగిపోయాయి. ఇండోసోల్‌కు అది అడిగినన్ని భూములు కట్టబెట్టేశారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసేలా సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై దర్యాప్తు జరిపించాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ శుక్రవారం డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 09:12 AM