Share News

సర్కారీ షాపులకు గుడ్‌బై

ABN , Publish Date - Aug 30 , 2024 | 05:00 AM

రాష్ట్రంలో 2017లో చివరిసారిగా ప్రైవేటు మద్యం షాపులకు పాలసీ విడుదలైంది. 2019లో అది ముగిసిన తర్వాత అదే సంవత్సరం అక్టోబరు 1 నుంచి వైసీపీ సర్కారు ప్రభుత్వ మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది.

సర్కారీ షాపులకు గుడ్‌బై

కొత్త పాలసీలో పూర్తిగా ప్రైవేటు మద్యం దుకాణాలే!

ఆరు రాష్ర్టాల్లోని పాలసీలపై అధ్యయనం

ప్రభుత్వానికి ఎక్సైజ్‌ అధికారుల నివేదికలు

తెలంగాణ పాలసీకే ప్రభుత్వ వర్గాల మొగ్గు?

దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలుగా నిర్ణయం

దుకాణాలకు ఆన్‌లైన్‌లో లాటరీ ప్రక్రియ

2 వేల కోట్ల ఆదాయం రావచ్చని అంచనా

షాపుల్లో మళ్లీ పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి

సెప్టెంబరు మొదటి వారంలో నోటిఫికేషన్‌

అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్‌బై చెప్పడానికి రంగం సిద్ధమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన మద్యం పాలసీ ముగింపు దశకు చేరింది. సెప్టెంబరు తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ మద్యం దుకాణాలు కనిపించవు. పూర్తిగా ప్రైవేటు షాపులే ఉండేలా ఎక్సైజ్‌ శాఖ కొత్త పాలసీని రూపొందిస్తోంది. ఆరు రాష్ర్టాల్లోని మద్యం పాలసీలపై ఆ శాఖ అధికారులు అధ్యయనం చేసి ఇటీవల ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. వాటిలో తెలంగాణ తరహా పాలసీనే ఉత్తమంగా ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. తాజాగా ఏర్పాటుచేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ ముందు ఈ నివేదికలు ఉంచి పాలసీకి తుది రూపు తీసుకురానున్నారు. అయితే దాదాపుగా తెలంగాణ పాలసీకే ప్రభుత్వ వర్గాలు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

దరఖాస్తులపై ఆదాయ లక్ష్యం

రాష్ట్రంలో 2017లో చివరిసారిగా ప్రైవేటు మద్యం షాపులకు పాలసీ విడుదలైంది. 2019లో అది ముగిసిన తర్వాత అదే సంవత్సరం అక్టోబరు 1 నుంచి వైసీపీ సర్కారు ప్రభుత్వ మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకూ 4,380 షాపులు ఉంటే వాటిని 3,500కు కుదించి ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరోసారి షాపుల సంఖ్యను 2,934కు కుదించారు. ఇవికాకుండా టూరిజం కేంద్రాల్లో షాపుల పేరుతో మొత్తం 3,392కు పెంచారు. ఇప్పుడు దాదాపుగా అదే సంఖ్యలో షాపులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 2023లో తెలంగాణ లిక్కర్‌ పాలసీ ప్రకటించినప్పుడు దరఖాస్తు ఫీజు కింద రూ.2,628 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఈ రూపంలో కనీసం రూ.2వేల కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీలో దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు(నాన్‌-రిఫండబుల్‌)గా నిర్ణయించారు. ఒక్కో షాపునకు సగటున 40 దరఖాస్తుల ప్రకారం చూసినా రూ.2,300కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అయితే మొత్తం దుకాణాల్లో 10శాతం అంటే దాదాపు 300 వరకూ గీత కార్మికులకు కేటాయించాలి. వాటికి ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండదు. దీంతో రూ.2వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

అంతా ఆన్‌లైన్‌లోనే

కొత్త పాలసీని పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోకి తీసుకొస్తున్నారు. దరఖాస్తుల నుంచి లాటరీ వరకూ మొత్తం ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ చేపడతారు. తొలుత లాటరీకి వెళ్లాలా? వేలం ప్రక్రియ చేపట్టాలా? అనే అంశాలపై కసరత్తు చేశారు. వేలం విధానంలో ప్రారంభంలో ఆదాయం ఎక్కువ వచ్చినా, ఆ తర్వాత స్థిరత్వం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ ధరకు లైసెన్స్‌లు పొందినవారు మధ్యలోనే షాపును వదిలేస్తే అది ఆదాయ నష్టంతో పాటు, ఇతర అంశాలపైనా ప్రభావం చూపుతుందని, అందువల్ల లాటరీ విధానంలో ఎంపిక చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తొలిసారి బార్‌ పాలసీని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. అది వేలం విధానం కాగా ఇప్పుడు లాటరీ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేపట్టనున్నారు. అలాగే పాత విధానం తరహాలో షాపుల్లో పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులు ఇవ్వనున్నారు. గతంలో ప్రైవేటు షాపు పక్కనే మద్యం సేవించేందుకు పర్మిట్‌ రూమ్‌ ఉండేది. ప్రభుత్వ షాపుల విధానంలో వాటిని తొలగించారు. దానివల్ల మందుబాబులు రోడ్లపైనే మద్యం తాగే దుస్థితి వచ్చింది. దానిని అరికట్టేందుకు రూమ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

వారం, పది రోజుల్లో పాలసీ

కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం వారం, పది రోజుల వ్యవధిలో ప్రకటించనుంది. ప్రభుత్వ మద్యం షాపుల పాలసీ సెప్టెంబరుతో ముగుస్తుంది. అక్టోబరు 1 నుంచి ప్రైవేటు షాపుల పాలసీ అమల్లోకి వస్తుంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, లాటరీ ప్రక్రియను 20 రోజుల్లో పూర్తిచేసేలా షెడ్యూలు రూపొందిస్తున్నారు. మరోవైపు సెప్టెంబరు 5 నుంచి ఎక్సైజ్‌లో బదిలీలు ప్రారంభం కావాలి. ఈలోగా ఎక్సైజ్‌ శాఖ పునర్‌వ్యవస్థీకరణ జీవోలు విడుదల చేయాలి. ఒకేసారి అటు బదిలీలు, ఇటు కొత్త పాలసీ అంటే ఇబ్బందులు వస్తాయని భావించిన అధికారులు ప్రస్తుతానికి సిబ్బందిని సర్దుబాటు చేసి పాలసీ ప్రక్రియ ముగించాలని భావిస్తున్నారు. పాలసీ అమల్లోకి వచ్చాక బదిలీలు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నారు.


వైసీపీ కమీషన్‌ పాలసీ

రాష్ట్రంలో తొలినుంచీ ప్రైవేటు మద్యం షాపుల పాలసీనే ఉంది. లైసెన్సీలు ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేసి వాటిని షాపుల్లో విక్రయిస్తారు. ఫలితంగా వారికి 10శాతం మార్జిన్‌ లభిస్తుంది. అందులోనే షాపుల అద్దెలు, ఖర్చులు, సిబ్బంది జీతాలు చెల్లించుకునేవారు. 2014 తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ప్రయోగాత్మకంగా 10శాతం షాపులను ఎక్సైజ్‌ శాఖ ద్వారా నడిపించే విధానం అమలు చేశారు. కానీ వాటిలో ప్రైవేటు షాపుల స్థాయిలో అమ్మకాలు జరగలేదు. దీంతో ప్రభుత్వ మద్యం షాపులతో ప్రయోజనం లేదని అప్పట్లోనే తొలగించారు. కానీ వైసీపీ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ప్రభుత్వ షాపుల విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ షాపులు అయితే మద్య నిషేధం అమలు చేయడం సులభమవుతుందని మొదట్లో ప్రచారం చేసింది. కానీ రెండు నెలలకే అసలు విషయం బయటపడింది. సొంత బ్రాండ్లు అమ్ముకోవడానికి, మద్యం కంపెనీల వద్ద కమీషన్ల వసూలే లక్ష్యంగా ఆ పాలసీని అమలు చేశారు. ప్రైవేటు షాపులైతే ప్రజలు ఎక్కువగా తాగే బ్రాండ్లనే అందుబాటులో ఉంచుతాయి. ప్రభుత్వ షాపుల్లో అందుకు విరుద్ధంగా వైసీపీ పెద్దలు చెప్పిన బ్రాండ్లనే బలవంతంగా అమ్మించారు. వినియోగదారులకు మరో దారి లేకుండా నాసిరకం బ్రాండ్లు తాగేలా చేశారు. ఫలితంగా వైసీపీ పెద్దలకు కేవలం కమీషన్ల రూపంలోనే రూ.3,113కోట్లు వెళ్లాయి.

కేబినెట్‌ సబ్‌కమిటీ నియామకం

నూతన మద్యం పాలసీ రూపకల్పనలో సిఫారసులకు ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎంఎ్‌సఎంఈ, సెర్ప్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఈ కమిటీలో ఉన్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విధానం, అందులో ఇబ్బందులు, లోపాలను గుర్తించి కొత్త పాలసీ ఎలా ఉండాలనే దానిపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఇతర రాష్ర్టాల్లో పాలసీలపై చేసిన అధ్యయనం వివరాలను పరిశీలించి ముసాయిదా పాలసీని మంత్రిమండలికి సమర్పిస్తారు.

నేడు సెబ్‌ రద్దు జీవో

అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను రద్దుచేసే జీవోను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ఎక్సైజ్‌ శాఖను పునర్‌వ్యవస్థీకరించాలని, సెబ్‌ను రద్దు చేయాలని తాజాగా కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఎక్సైజ్‌ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే శాఖ పునర్‌వ్యవస్థీకరణపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. అందుకు అనుగుణంగా సెబ్‌ను రద్దుచేసి, పూర్తిగా పాత విధానంలోకి ఎక్సైజ్‌ శాఖను తీసుకురానున్నారు.

Updated Date - Aug 30 , 2024 | 05:01 AM