Share News

వరద ప్రభావిత 10 జిల్లాల్లో రైతుల రుణాల రీ-షెడ్యూల్‌

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:52 AM

వరద ప్రభావిత 10 జిల్లాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే,

వరద ప్రభావిత 10 జిల్లాల్లో రైతుల రుణాల రీ-షెడ్యూల్‌

అమరావతిలో రూ.33137.98 కోట్లతో 45 ఇంజనీరింగ్‌ పనులు

జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పునఃప్రారంభం

రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): వరద ప్రభావిత 10 జిల్లాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే, రాజధాని అమరావతిలో 45 ఇంజనీరింగ్‌ పనులను రూ.33137.98 కోట్లతో చేపట్టడానికి ప్రభుత్వం సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో గత ప్రభుత్వం రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రాష్ట్ర సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్‌టీఆర్‌ జిల్లాల్లో 30-8-2024 తర్వాత వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీ-షెడ్యూల్‌ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే, రూ.50 వేల లోపు రుణాలపై స్టాంప్‌ డ్యూటీ, యూజర్‌ చార్జీలు మినహాయించాలని నిర్ణయించింది. 2024-25లో ధాన్యం సేకరణ నిమిత్తం మార్క్‌ఫెడ్‌కు రూ.1,000 కోట్ల అదనపు రుణాన్ని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి పొందేందుకుగాను ప్రభుత్వ హామీని పొడిగించడంతోపాటు నేషనల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్సీడీసీ) నుంచి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు బదిలీ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.


ధాన్యం కొనుగోలు చేసిన ఆరేడు గంటల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నారు. రైతులకు ఇన్‌స్టంట్‌ పేమెంట్‌ చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధాని అమరావతిలో ఐఏఎస్‌, గజిటెడ్‌, క్లాస్‌ ఫోర్‌ క్వాటర్ల నిర్మాణానికి, వరద మిటిగేషన్‌ పనులు, రహదారులు, మౌలిక వసతుల కల్పన తదితర 45 ఇంజనీరింగ్‌ పనులను రూ.33137.98 కోట్లతో చేపట్టడానికి సీఆర్డీఏకు అనుమతి ఇస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఏపీ రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు 14 పోస్టుల మంజూరు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అలాగే, జలజీవన్‌ మిషన్‌ పథకం కింద రూ.11,400.80 కోట్ల విలువైన 44,195 పనులకు టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా టెండర్లను పిలిచేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు బదలాయించిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మార్కెటింగ్‌ జీవవీ రమేష్‌ కుమార్‌ను తిరిగి ఏపీలో ఆయన రిటైర్మెంట్‌ తేదీ(30.6.2026) వరకు విధుల్లో కొనసాగే విధంగా సూపర్‌ న్యూమరీ పోస్టు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్యాకేజీ నెంబర్‌-3, 5, 5ఏ కింద పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజీ 6ఏ ఎసెన్షియల్‌ బ్యాలెన్స్‌ పనుల టెండర్లకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. జ్యుడీషియల్‌ ప్రివ్యూ న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉన్నందున ప్రివ్యూ లేకుండానే టెండర్‌ ప్రక్రియ పూర్తికి ఆమోదం తెలిపింది. క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రెన్యువబుల్‌ ఎనర్టీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ఎన్టీపీసీతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రానికి రూ.20620 కోట్ల ఆదాయం రానుంది. 1 లక్షా 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రెండేళ్ల కాలపరిమితికి సృష్టించిన 679 సూపర్‌ న్యూమరీ డిప్యూటీ తహశీల్దార్‌(రీసర్వే) పోస్టులను మరో రెండేళ్లు కొనసాగించాలని నిర్ణయించింది.

.


జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు..

475 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల విద్యార్థులతోపాటు కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు, హైస్కూల్‌ ప్లస్‌ విద్యా సంస్థలకు రూ.32.45 కోట్లతో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్‌, రికార్డు బుక్స్‌, నోట్‌ బుక్స్‌ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇకపై ప్రభుత్వ కాలేజీల్లోనూ జేఈఈ, నీట్‌ శిక్షణ అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది

Updated Date - Dec 20 , 2024 | 05:52 AM