MP Ambika విశ్వమానవ సమానత్వాన్ని కాంక్షించిన జాషువా
ABN , Publish Date - Sep 28 , 2024 | 11:36 PM
తెలుగు సాహితీ పూతోటలో విరబూసిన సాహితీ సుగంధ పుష్పం, విశ్వమానవ సమానత్వాన్ని కాంక్షించిన మహనీయుడు గుర్రం జాషువా అని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు.
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
అనంతపురం కల్చరల్, సెప్టెంబరు 28: తెలుగు సాహితీ పూతోటలో విరబూసిన సాహితీ సుగంధ పుష్పం, విశ్వమానవ సమానత్వాన్ని కాంక్షించిన మహనీయుడు గుర్రం జాషువా అని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. గుర్రం జాషువా 129వ జయంతిని పురస్కరించుకుని శనివారం జాషువా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు ఆయన విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకకు ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుర్రం జాషువా అనేక రచనలు చేశారని, ఖండకావ్యాలు రాశారని, వాటిలో గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర అతిముఖ్యమైనవన్నారు. అంటరానితనం, ఆధిపత్యం, వివక్ష, అసమానతలను నిరసిస్తూ సమానత్వ స్థాపనే లక్ష్యంగా సాహిత్య ఆయుధాన్ని చేపట్టిన గుర్రం జాషువాకు నివాళులర్పించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల కామర్స్ సెమినార్ హాల్‌లో ఆచార్య బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించిన జాషువా సాహితీ సదస్సులో జాషువా సాహిత్యపీఠం ప్రధాన కార్యదర్శి నాగలింగయ్య, ఎస్కేయూ తెలుగుశాఖ అకడమిక్ కన్సల్టెంట్ డాక్టర్ నానీల నాగేంద్ర, ఎల్‌కేపీ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆశావాది శశాంకమౌళి మాట్లాడారు. జాతి పెడదోరణులను తన కవితా సాహిత్యంతో దునుమాడిన గొప్ప దార్శనికుడన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ తిప్పేస్వామి, పెద్దన్నగౌడ్, ఇంజనీర్ సుధాకర్‌బాబు, ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి, అంకె రామలింగయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.