Share News

కోర్టు ముందు హాజరవ్వాల్సిందే!

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:44 AM

పాస్‌పోర్టు జారీకి అవసరమైన నిరభ్యంతరం పత్రం (ఎన్‌వోసీ) పొందేందుకు ప్రత్యేక కోర్టు ముందు హాజరవ్వాలని..

కోర్టు ముందు హాజరవ్వాల్సిందే!

స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందే ఎన్‌వోసీపై జగన్‌కు హైకోర్టు స్పష్టీకరణ

పాస్‌పోర్టు ఐదేళ్లకు ఇచ్చేలా ఎన్‌వోసీ ఇవ్వండి

ప్రత్యేక కోర్టు ఉత్తర్వులకు పాక్షిక సవరణ కోర్టు ఉత్తర్వులు కఠినమైనవి కావు

కేసు పెండింగ్‌లో ఉందని జగన్‌కు తెలుసు సమన్లు అందలేదంటూ

ప్రయోజనం పొందలేరు: న్యాయమూర్తి

పూచీకత్తు సమర్పించడమంటే విచారణ ప్రక్రియలో పాల్గొంటానని కోర్టుకు వాగ్దానం చేయడమే. కోర్టు విచారణ ప్రక్రియకు లోబడి ఉంటానని జగన్‌ ఒకవైపు చెబుతూ.. అందుకు భిన్నంగా ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను ప్రశ్నిస్తున్నారు.

2018 నుంచి పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉందని జగన్‌కు తెలుసు. న్యాయవాదిని పెట్టుకుని కోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు కూడా పొందారు. సమన్లు అందలేదన్న వాదనతో ప్రయోజనం పొందలేరు.

అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పాస్‌పోర్టు జారీకి అవసరమైన నిరభ్యంతరం పత్రం (ఎన్‌వోసీ) పొందేందుకు ప్రత్యేక కోర్టు ముందు హాజరవ్వాలని.. రూ.20 వేల స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనని హైకోర్టు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి తేల్చిచెప్పింది. పాస్‌పోర్టును ఏడాది పాటే పునరుద్ధరిస్తామని, తమ ముందు హాజరై రూ.20వేల పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విధించిన షరతులను పాక్షికంగా సవరించింది. ఐదేళ్లపాటు పాస్‌పోర్టు రెన్యువల్‌కు వీలుగా ఎన్‌వోసీ జారీ చేయాలని సదరు కోర్టును ఆదేశించింది. రూ.20 వేల బాండ్‌తో పూచీకత్తు సమర్పించాలని ప్రత్యేక కోర్టు విధించిన షరతు కఠినమైనదేమీ కాదని పేర్కొంది.


‘రాజ్యాంగం నిర్దేశించిన చట్టబద్ధమైన పాలనకు లోబడి దేశ పరిపాలన ఉంటుందని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అందరూ బద్ధులై ఉండాల్సిందేనని ప్రజాజీవితంలో ఉన్న పిటిషనర్‌ (జగన్‌)కు బాగా తెలుసు. విజయవాడ ప్రత్యేక కోర్టులో 2018 నుంచీ పరువునష్టం కేసు ఉందని ఆయనకు తెలుసు. ఆయన సహనిందితుడు కేసు విచారణలో పాల్గొంటున్నారని కూడా తెలుసు. ఈ నేపఽథ్యంలో ఆ కేసు విచారణలో సాధ్యమైనంత త్వరగా పాల్గొంటారని ఆశిస్తాం. అయితే అలా జరుగలేదు. ప్రస్తుతం జగన్‌ తరఫున ప్రత్యేక కోర్టులో న్యాయవాది వకాలత్‌ వేసి పాస్‌పోర్ట్‌ జారీకి అవసరమైన ఎన్‌వోసీ కోసం పిటిషన్‌ వేశారు. అవసరం కాబట్టే ఆయన న్యాయవిచారణ ప్రక్రియలో పాల్గొన్నారని గుర్తించాలి.


పరువు నష్టం కేసులో సమన్లు అందనందున పూచీకత్తు సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఆదేశించజాలదన్న జగన్‌ వాదన సరికాదు. కేసు పెండింగ్‌లో ఉందని తెలియనివారికి.. కేసు ప్రొసీడింగ్స్‌లో పాల్గొనేందుకు వీలుగా సమాచారం ఇచ్చేందుకు మాత్రమే సమన్లు జారీ చేస్తారు. కోర్టుకు హాజరైతే భద్రత కల్పన విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని జగన్‌ చెబుతున్నారు. రాజకీయ ప్రముఖుల కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు వద్ద ఇలాంటివి సర్వసాధారణం. కోర్టు ఉత్తర్వులు సాఫీగా అమలయ్యేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కోర్టు వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి’ అని స్పష్టం చేసింది. ఈ నేపఽథ్యంలో ఎన్‌వోసీ జారీకి కోర్టు ముందు హాజరై.. రూ.20 వేల స్వీయ పూచీకత్తు సమర్పించడం సహా ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది.


ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ బుధవారం తీర్పు ఇచ్చారు. పాస్‌పోర్ట్‌ జారీకి అవసరమైన నిరభ్యంతరపత్రం(ఎన్‌వోసీ) ఇచ్చేందుకు విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కఠిన షరతులు విధించడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌ శుక్రవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం బుధవారం నిర్ణయం వెలువరించింది.

Updated Date - Sep 12 , 2024 | 06:45 AM