ఆరోగ్య ధీమా.. అందరికీ బీమా
ABN , Publish Date - Aug 25 , 2024 | 05:37 AM
వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న ఆరోగ్య బీమా విధానాలను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హైబ్రిడ్ విధానంలో ప్రజలకు బీమా సౌకర్యం కల్పించాలని సూచించారు.
5 కోట్ల మందికీ రూ.25 లక్షల చొప్పున!
‘హైబ్రిడ్’ విధానానికి సీఎం సానుకూలం
్చబీమా సంస్థల ప్రతినిధులతో ఆరోగ్యశాఖ చర్చలు
వివిధ రాష్ట్రాల్లో అమలు తీరుపై మరింత కసరత్తు
రూ.2.5 లక్షల వరకూ బీమా సంస్థల ద్వారా వైద్యం
ఆ మొత్తం దాటితే ఎన్టీఆర్ ట్రస్టు పరిధిలోకి
ఏపీఎల్ జనాభాకూ బీమా సదుపాయం
వీరివరకు ఎక్కువ ప్రీమియం చెల్లించనున్న సర్కారు!
మరికొంత వారే కంపెనీలకు చెల్లించేలా ఏర్పాటు?
ఉద్యోగులు, పెన్షనర్లకూ బీమా కార్డులు
రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకూ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్న హామీ అమలు దిశగా ప్రభుత్వం వేగం పెంచింది. హైబ్రిడ్ విధానం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆమోదం తెలిపారు. అయితే వివిధ రాష్ట్రాల్లోను, అంతర్జాతీయంగా ఎక్కడ మంచి బీమా అమలవుతోంది.. అక్కడి పరిస్థితులపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు మరింత లోతుగా కసరత్తు చేస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న ఆరోగ్య బీమా విధానాలను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హైబ్రిడ్ విధానంలో ప్రజలకు బీమా సౌకర్యం కల్పించాలని సూచించారు. బీమా కంపెనీలతోనూ అనేక సమావేశాల తర్వాత మొత్తం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకూ హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య బీమా అమలు చేస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. ఆయన కూడా సూత్రప్రాయంగా సరేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరంతా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం పొందుతున్నారు. వీరు కాకుండా ఉద్యోగులు, పెన్షన్లర్లు, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న (ఏపీఎల్) ప్రజలు కలిపి 8.13 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆరోగ్యబీమా లేకుండా ఉండకూడదన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 1.60 కోట్ల కుటుంబాలకు రూ.25 లక్షల బీమాను కచ్చితంగా అమలు చేయాలంటే ఆర్థికంగా చాలా బారం పడుతుంది. దాదాపు రూ.10-12 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై భారం లేకుండా ప్రజలందరికీ రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించడమే హైబ్రిడ్ విధానం. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున ఏడాదికి 13 నుంచి 15 లక్షల మంది మాత్రమే వివిధ సమస్యల నిమిత్తం ఆస్పత్రులకు వెళ్తున్నారు. అందులోనూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం పొందే వారిలో 95 శాతం మందికి రూ.2.50 లక్షల లోపే ఖర్చవుతోంది. మిగిలినవారిలో 3 శాతం మందికి రూ.5 లక్షల్లోపు, 2 శాతం మందికి రూ.15 లక్షల లోపు మాత్రమే వ్యయమవుతోందని అంచనా. దీని ఆధారంగా ఆరోగ్యశాఖ అధికారులు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 1.60 కోట్ల కుటుంబాలకు రూ.2.50 లక్షల ఖర్చు వరకూ ప్రభుత్వమే బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది. ఖర్చు రూ.2.50 లక్షలు దాటితే రూ.25 లక్షల వరకూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం అందిస్తుంది. అంటే ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ ఇన్సూరెన్స్ కార్డు ఇస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కార్డును కూడా వారు కలిగి ఉంటారు. దీనివల్ల ప్రజలందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఉండడంతో పాటు ప్రభుత్వంపై ఆర్థికంగా భారం కూడా తగ్గుతుంది. ఆరోగ్య బీమా నిమిత్తం సర్కారు ఏడాదికి రూ.2,500 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది. ప్రస్తుతం ట్రస్టు ద్వారా ఇంతే మొత్తాన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఖర్చు చేస్తోంది.
ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యం..
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈహెచ్‌ఎస్ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నా వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 5.14 లక్షల మంది ఉద్యోగులు, 2.99 లక్షల మంది పెన్షన్లర్లు ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారు. ప్రభుత్వం వీరికి కూడా బీమా కార్డులు అందిస్తుంది. ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వైద్యం సమయంలో వీరికి ప్రత్యేక రూం సౌకర్యం ఉండేలా, హైక్వాలిటీ మందులు వాడేలా, శస్త్రచికిత్సల సంఖ్య కూడా ఎక్కువ ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
బీమా పరిధిలోకి ఏపీఎల్
ప్రభుత్వ ఆరోగ్య బీమా పరిధిలోకి రాష్ట్రంలో 8.6 లక్షల ఏపీఎల్ జనాభా కూడా రానుంది. వీరంతా దాదాపు ప్రైవేటు ఆరోగ్య బీమాలు కలిగి ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం వారికి కూడా ప్రీమియం చెల్లించి, రూ.25 లక్షల వరకూ బీమా కల్పించనుంది. అయితే 8.6 లక్షల మందికీ రూ.2.50 లక్షల వరకే బీమా సంస్థ భరిస్తుంది. మిగిలిన రూ.22.50 లక్షల బీమాకు ఎవరు భరోసా కల్పించాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు 2-3 మార్గాలు ఆలోచించారు. ఏపీఎల్ కుటుంబాల వరకూ ప్రభుత్వం చెల్లించే ప్రీమియంను కొంత పెంచాలని నిర్ణయించారు. వారు కూడా నేరుగా కొంత మొత్తాన్ని బీమా సంస్థలకు చెల్లించే విధంగా ఆలోచన చేస్తున్నారు. దీనిపై ఇంకా కసరత్తు నడుస్తోంది.
స్విట్జర్లాండ్ విధానం బెస్ట్
అంతర్జాతీయంగా స్విట్జర్లాండ్‌లో ఆరోగ్య బీమా పకడ్బందీగా అమలవుతోంది. ఆ దేశంలో నివసించే ఏ పౌరుడైనా కచ్చితంగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. అక్కడి ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.30 వేల వరకూ ప్రీమియం చెల్లిస్తుంది. వైద్యం ఖర్చు ఎంతైనా ఇక బీమా కంపెనీదే బాధ్యత. రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. ఆ దేశంలో కొంత మందితో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడి అమలు విధానంపై సీఎంకు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారు. మొత్తంగా ఆరోగ్య బీమా విషయంలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. నిబంధనలు సిద్ధం చేశాక వాటికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే అధికారులు టెండర్లకు వెళ్తారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రజలంతా ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారు.