Share News

High Court: పారా బాయిల్డ్‌ బియ్యం ఎగుమతిపై అభ్యంతరం లేదు

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:41 AM

కాకినాడ పోర్టులోని తమ పారా బాయిల్డ్‌ రైస్‌ను బార్జ్‌ల నుంచి ఎంవీ స్టెల్లా నౌకలో లోడ్‌ చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లను ఉపసంహరించుకొనేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

High Court: పారా బాయిల్డ్‌ బియ్యం ఎగుమతిపై అభ్యంతరం లేదు

పిటిషనర్లకు అన్ని అనుమతులు ఉన్నాయి

హైకోర్టుకు నివేదించిన ఏఏజీ

వ్యాజ్యాల ఉపసంహరణకు కోర్టు అనుమతి

అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): కాకినాడ పోర్టులోని తమ పారా బాయిల్డ్‌ రైస్‌ను బార్జ్‌ల నుంచి ఎంవీ స్టెల్లా నౌకలో లోడ్‌ చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లను ఉపసంహరించుకొనేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గురువారం వ్యాజ్యాలు మరోసారి విచారణకు రాగా అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌(ఏఏజీ) సాంబశివ ప్రతాప్‌ వాదనలు వినిపిస్తూ.. పారా బాయిల్డ్‌ బియ్యం ఎగుమతికి పిటిషనర్లకు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. వారి బియ్యం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 1320 మెట్రిక్‌ టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని స్టెల్లా నౌక నుంచి దించేశాక పిటిషనర్ల పారా బాయిల్డ్‌ రైస్‌ను నౌకలో లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. పిటిషనర్లు, అధికారుల మధ్య సంప్రదింపులు జరిగాయని, వారి బియ్యాన్ని నౌకలో లోడ్‌ చేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారని తెలిపారు. అందువల్ల పిటిషన్లను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఇరువైపుల వాదనలు నమోదుచేసిన న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. వ్యాజ్యాల ఉపసంహరణకు అనుమతిచ్చారు. భవిష్యత్తులో తమకు వ్యతిరేకంగా అధికారులు ఏమైనా చర్యలు చేపడితే తిరిగి కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. ఉపముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలను అనుసరించి కాకినాడ పోర్టులో తమ పారా బాయిల్డ్‌ బియ్యాన్ని బార్జ్‌ల నుంచి స్టెల్లా నౌకలో లోడ్‌ చేయనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని పేర్కొం టూ చిత్ర అగ్రి ఎక్స్‌పోర్ట్స్‌ ఎండీ కేవీ భాస్కర్‌రెడ్డి, పద్మశ్రీ రైస్‌మిల్‌ ఎండీ పోతంశెట్టి గంగిరెడ్డి, సూర్యశ్రీ రైస్‌మిల్‌ ఎండీ పోతంశెట్టి విశ్వనాథ్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు బియ్యం రవాణాకు పిటిషనర్లకు అనుమతులున్నాయా? బియ్యం లోడింగ్‌ను అడ్డుకొనేందుకు ప్రభుత్వానికున్న అధికారాలేంటి? వివరాలు తమ ముందుంచాలని ఏఏజీని కోర్టు ఆదేశించింది.’

Updated Date - Dec 20 , 2024 | 05:41 AM